రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక పాలనలో పౌరుల హక్కులను అడుగడుగునా
కాలరాస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
ఓటమి భయంతోనే చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు
బుధవారం ఆయన రాయదుర్గం పట్టణంలో విలేకర్లతో మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడును తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలను కలుసుకోకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి కుతంత్రాలకు తెగబడుతున్నారన్నారు.
క్షుద్రశక్తుల చేతిలో రాష్ట్రం ఎంతగా విలవిల్లాడిపోతుందో, ప్రజాస్వామ్యం అడుగడుగునా ఎంతగా పరాభవానికి గురవుతుందో కుప్పంలో జరుగుతున్న సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నెం:01 జీ.ఓ.ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సభలు పెట్టకుండా, ప్రజలను కలవకుండా ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
నిన్నటి రోజు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీకి జీ.ఓ నెం: 01 ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటనలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లతో ప్రజల రాకపోకలకు తీవ్ర విఘాతం కల్పించడంతో పాటు పౌరుల హక్కుల్ని హరించిన అధికారులకు సదరు జీ.ఓ. ఎందుకు వర్తించదని నిలదీశారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, జాతీయ స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతున్న నారా చంద్రబాబు నాయుడు పర్యటనకే అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులను వెనకుండి నడిపిస్తున్న శక్తులేమిటో ప్రజలందరికి తెలుసన్నారు.
చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటున్న జగన్ రెడ్డి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
ఒకవైపు జీ. ఓ.నెం: 2430 తీసుకొచ్చి పత్రికలను నియంత్రించడానికి గతంలో సిఎం. కుట్రలు చేశాడన్నారు. అదే క్రమంలో నేడు ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు,నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేకుండా కొత్త సంవత్సరంలో తెచ్చిన జీ.ఓ నెం:01ను జగన్ నిరంకుశ విధానాలకు పరాకాష్టగా కాలవ అభివర్ణించారు.
తమ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తామన్నారు. చంద్రబాబు జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టె ప్రసక్తి లేదని, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నూకలు చెల్లిపోతాయని ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు.