Header Top logo

ఈ క్రాంతికి లేదు విశ్రాంతి! No rest for Naxalite Kranti LSN Murthy!

నక్సలైట్ క్రాంతి ఎల్‌ఎస్‌ఎన్ మూర్తికి లేదు విశ్రాంతి!

శ్రీకాకుళం నుండి కరీంనగర్ వరకు భగభగ మండే నిప్పు కనిక లాంటి అక్షరాలతో మార్కెట్లోనీ పేపర్ స్టాల్లోనూ కనిపించే క్రాంతి పత్రిక పూర్వపు ఎడిటర్ సత్యనారాయణ మూర్తి శాశ్వత సెలవు తీసుకున్నారు.1976 నుండి 1992 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నలుగురులో ఇద్దరు చేతుల్లో క్రాంతి పత్రిక కనిపించేది. రైతాంగ పోరాటాలు మొదలుకొని విదేశాల్లో జరిగే అనేక ఉద్యమాలు తిరుగుబాట్లు వార్తలన్నీ క్రాంతిలో ఉండేవి. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ గ్రామాల్లో చేపట్టిన రైతు కూలీ పోరాటాలు, భూముల పంపిణీ, ఆ పార్టీ నాయకుల అరెస్టులు, ధర్నాలు , ఎన్కౌంటర్లు నిజా నిజాలు ఇవే క్రాంతి పత్రికలు కనిపించేవి.

రాజ్యానికి వ్యతిరేకంగా క్రాంతి పత్రిక..

ఇతర పత్రికల్లో ఒక రిపోర్టర్ అధికారులకు నాయకులకు వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే అదే పెద్ద రాద్ధాంతం అవుతుంది. అలాంటిది ఏకంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఒక పత్రికను నడుపుతూ ఆ పత్రికకు ఎడిటర్ గా కొనసాగడం అంటే అది ఎంత పెద్ద కత్తి మీద సాము చెప్పాల్సిన అవసరం లేదు . అక్షరాలే ఆయుధాలుగా కనిపించే క్రాంతి పత్రికను అప్పటి సి ఏం ఎన్. జనార్దన్ రెడ్డి కాలంలో పీపుల్ సార్ పార్టీ దాని అనుబంధ సంఘాలపై నిషేధం ప్రకటించేంతవరకు మూర్తిగారు ఎడిటర్ గా పని చేశారు. నిషేధం తర్వాత మూర్తి గారు అజ్ఞాతవాసం దండకారణ్యంలోను అక్కడ విశ్రాంతి లేకుండా పత్రిక బాధ్యతలు అజ్ఞాతవాసంలో ఆయనను దగ్గరగా చూసిన లొంగిపోయిన మాజీ మావోయిస్టు తన గురించి ఇలా చెప్పారు.

లొంగిపోయిన మాజీ మావోయిస్టు మాటల్లో..

నేను ఓ పది సార్లు మూర్తి గారిని చూశా. ఎప్పుడు నిద్రపోయేవారో తెలియదు. ఇతర పనులు కూడా ఆయనకు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తిరుగుబాట్లు వాటి సమాచారం ఇంగ్లీష్, ఇతర భాషల నుండి తర్జుమా చేసి కమిటీలకు అప్పగించడం చేస్తుండేవారు. మావో, మార్క్స్ రచనలు ఎక్కువ భాగం మూర్తి గారి తెలుగులోకి అనువదించారని చెప్పారు. దండ కారణ్యంలోనూ క్రాంతి పత్రికను నడిపించారనీ తెలిపారు..

విప్లవ బ్రహ్మచారి..

సాధారణంగా మనుషులు ఎవరైనా యుక్త వయసులో పెళ్లి చేసుకునే వారే. అందులో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆరు నెలలు తిరగకముందే పెళ్లి చేసుకుని సంసార సుఖాల వైపు స్థిరపడిపోతారు.ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి (76) ఈ జీవితం ప్రజలకు అంకితం అన్నట్టు ఉద్యోగాన్ని వదిలి శ్రీకాకుళం పోరాటస్ఫూర్తితో కొండపల్లి సీతారామయ్యకు అనుచరుడుగా మారి , బ్రహ్మచారి గా.. పూర్తి కాలం విప్లవకారుడుగా ఎదిగారు. మూడు రోజుల క్రితం మూర్తి మరణించడంతో ఐదు దశాబ్దాలు విప్లవకారుడికి అరుణారుణ జోహార్లు అర్పించారు.

ఎల్ ఎస్ ఎన్  మూర్తి నెలరోజులుగా  గొంతు కేన్సర్ కు హైదరాబాద్  నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  2022 డిసెంబర్ 21 రాత్రి 8 గంటల 45 నిముషాలకు   తుదిశ్వాస విడిచారు .  ఆయన  స్వగ్రామం  తెలుగు రాష్ట్రంలోని తెనాలికి సమీపంలోఉండే కఠేవరం.

ప్రభుత్వ జాబ్ వదిలి నక్సలైట్ బాట పట్టి..

హైదరాబాదులోని డిఫెన్స్ అకౌంట్స్ లో ప్రభుత్వ ఉద్యోగిగాపనిచేసేవారు. ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి నక్సల్బరీ ఉద్యమంతో ప్రేరితుడై తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి పూర్తి కాలపు విప్లవకారుడిగా గత 50 ఏళ్లుగా విప్లవోద్యమానికి తన జీవితాన్ని సమర్పించిన అరుదైన వ్యక్తి. జన నాట్య మండలి ఏర్పాటులో రాజకీయంగా ముఖ్యమైన భూమిక నిర్వహించిన వారిలో  ఆయన ఒకరు . జన నాట్య మండలి  ఏర్పడిన తరువాత దానికి రాజకీయ కమిస్సార్ గా పని చేశారనీ పౌర హక్కుల సంఘం తెలిపింది.

రైతు కూలీ సంఘం సభలలో ..

రాష్ట్రవ్యాప్తంగా రికార్డు సృష్టించిన 1983లో కరీంనగర్ లో జరిగిన చారిత్రక రైతు కూలీ సంఘ సభల నిర్వహణలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఇలా ఆయనకు కరీంనగర్ తో విడవని అనుబంధం ఉంది . క్రాంతి పత్రిక ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మావో సంకలిత రచనలు  6వ భాగం నుంచి 9వ భాగం అనువదించి ,  తెలుగులో తేవడంలో ఆయనదే ముఖ్య పాత్ర.  దండకారణ్య ఉద్యమంలో ఒక దశాబ్దం పాటు పని చేసారు.  అక్కడ పనిచేస్తున్నప్పుడు  పత్రికల నిర్వహణలో , రాజకీయ కార్యకర్తలకు  విద్యను అందించడంలో ముఖ్య భూమిక పోషించారు.. కార్యకర్తల నుంచి నాయకత్వం దాకా అందరి  అభిమానాన్ని  అందుకున్నారు.  మావోయిస్టు  పార్టీ  కేంద్ర కమిటీ కి సంబంధించిన పనుల నిర్వహణలో ఉండగా అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో కొన్ని ఏళ్ళ పాటు ఉండి బెయిలు పై విడుదల అయ్యారు.

ప్రజల కోసం బతికి, విద్యార్థుల కోసం దేహం అప్పగింత..

విప్లవోద్యమానికి అంకితమై అవివాహితుడిగానే ఉండిపోయారు. అయితే తాను బతికినంత కాలం విడత ప్రజల పక్షాన వర్గ రహిత సమాజం కోసం అక్షరాలను అందించిన మేధావి. నెలరోజులపాటు ఆసుపత్రిలో క్యాన్సర్ తో పోరాడారు. ప్రజల కోసం బతికిన ఆయన దేహాన్ని సైతం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వైద్యశాలకు అప్పగించారు.

చివరి ఘడియలలో బంధువుల సహాయంతో..

సాధారణంగా అనారోగ్యంతోలొంగిపోయిన నక్సలైట్లు, బయట కనిపిస్తే చాలు అక్కడ నుండి ఎన్ని డబ్బులు కొట్టుకొచ్చాడు అంటూ మాట్లాడుతుంటారు. మూర్తి జీవన చరమాంకంలో బంధువుల సహాయంతో ఓ ఫౌండేషన్ లో ఉన్నారు. తన మీద ప్రజలకు ఉపయోగపడాలి చివరకు తన దేహం విద్యార్థులకు ఉపయోగపడాలని కృత నిశ్చయంతో.. తన దేహాన్ని విద్యార్థులకు పాఠాలుగా మారాలని ముందుగానే బంధువులకు చెప్పడంతో మూర్తి గారి సూచన మేరకు
భౌతిక కాయాన్ని   వైద్య కళాశాలకు   అప్పజెప్పిన్నట్లు  బంధు మిత్రులు తెలిపారు. పుట్టుక చావు నాది బ్రతుకంతా ప్రపంచానీది అని కాలోజీ అన్నారు కానీ, మూర్తి గారు మాత్రం బ్రతుకుతో పాటు భౌతిక దేహం కూడా ప్రజలకే అని నిరూపించారు.

కట్ట నరేంద్ర చారి

సీనియర్ జర్నలిస్టు పెద్దపల్లి

6303073400

Leave A Reply

Your email address will not be published.

Breaking