Header Top logo

MLA kidnapped by Naxals నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-01

కిడ్నాప్..

MLA kidnapped by Naxals

నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-01

తూర్పు దిశన ఉదయించిన సూరీడు ఆకాశంలో ఎర్రని బంతిలా చూడ ముచ్చటగా కనిపిస్తున్నాడు. ఆ సూరీడి రాకతో పున్నమి చంద్రుడు చిన్న బోయి మబ్బుల వెనక్కి వెళ్లాడు. నిశ్చబ్దాన్ని భంగం చేస్తూ గోడ గడియారం ట్రింగ్.. ట్రింగ్.. ఆరు గంటలు కొట్టింది. ఆ శబ్దానికి మేలుకువ వచ్చి కప్పుకున్న దుప్పటిని పక్కకు పెట్టి చుట్టూరా చూసాను. సూర్య కిరణాలు కిటికి సందులోంచి గది లోనికి రావడంతో వెలుతురు కనిపిస్తోంది.

‘‘అరే అప్పుడే ఆరైనట్లుందే.. రామడుగు, సుద్దులం, కొరట్ పల్లి గ్రామాలకు వెళ్లాలి గదా.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు స్వయంగా కృతజ్ఞతలు చెప్పే ప్రోగ్రాం ఉంది..’’ మనసులోనే అనుకుని మంచం దిగి స్నానం చేయడానికి బాత్ రూములోకి వెళ్లాను. అరగంటలో రెఢీ అయి టిఫిన్ చేసి హాల్ లోనికి వచ్చాను.

‘‘సార్.. గుడ్ మార్నింగ్..’’ చదువుతున్న దిన పత్రికను పక్కకు పెట్టి కుర్చిలోంచి లేసాడు ధర్పల్లి మండలం సిర్నాపల్లి సర్పంచ్ రఘువీర్ రెడ్డి.

‘‘వెరి గుడ్ మార్నింగ్ రఘువీర్.. మనోళ్లు ఎవరు రాలేదా.. ఎన్నికల ప్రసారమప్పుడు కూడా నక్సల్స్ కు భయపడి ఆ ఏరియాకు ఎవరు రాలేరు కదూ.. సరే.. మనమే వెళుదాం..’’ అన్నాను.

గోడకు వేలాడుతున్న క్యాలెండర్.. ఆ పక్కనే గోడ గడియారం కనిపించింది.

ఆ రోజు.. పందొమ్మిది వంద ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరువై మూడవ తేది.

సమయం ఉదయం తొమ్మిదిన్నర అవుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లగానే చల్లని గాలి స్వాగతం పలుకుతున్నట్లనిపించింది. ఇంటి ఆవరణలో పెరిగిన ఎత్తైన కొబ్బరి చెట్లు. వరుసగా పెంచిన జామ చెట్లు.. పచ్చగా కనిపిస్తున్న మామిడి చెట్లు ఆహ్లదకరమైన వాతవరణం..

అంబసిడర్ కారులో నేను, రఘువీర్ రెడ్డి ఇద్దరం కూర్చోగానే కారు స్టార్ట్ చేసాడు డ్రైవర్ నారాయణ..

కారు కంటే వేగంగా నాకు ఆలోచను జరిగిన ఎన్నిక తీరుపైకి వెళ్లాయి.

మొదటి సారి పందొమ్మిది వంద ఎనభై అయిదులో జరిగిన ఎన్నికలో అసెంబ్లీకి పోటీ చేసాను.

ఏడు వేల ఏడు వంద ఇరువై ఆరు ఓట్ల మెజార్టీ..

రెండవ సారి పందొమ్మిది వంద ఎనభై తొమ్మిదిలో మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తే..

రెండు వందల ఇరువై అయిదు ఓట్ల మెజార్టీ..

ఇంతా తక్కువ మెజార్టీ రావడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆలోచించాను.

మొదటిది.. బూటకపు ఎన్నికను బహిష్కరించాని నక్సల్స్ పిలుపు ఇవ్వడం..

వారికి పట్టున్న గ్రామాలలో పొలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు కావడం..

రెండవది.. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజలో వ్యతిరేకత ఏర్పడటం..

మూడవది.. ఎన్నికలో గ్రామాభివృద్ది కంటే కూడా వ్యక్తిగత లాభాన్ని ప్రజలు ఆశించడం..

ఈ కారణా వల్లనే అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిసాననుకున్నాను.

‘‘అయినా.. ఓట్లను నోట్లతో కొనే రాజకీయాలు రాజ్యమేలుతున్న నేటి రోజులో కాంగ్రెస్ పార్టీ హవాలో ప్రభుత్వ వ్యతిరేకత.. నక్సల్స్ వ్యతిరేకించినా.. తక్కువ మెజార్టీతో నైనా గెలిచాను. ఒక్క ఓటుతో గెలిచినా.. గెలుపు.. గెలుపు.. ఇదీ ప్రజా విజయమే. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజకు కృతజ్ఞతు చెప్పడం నైతిక బాద్యత’’ అనుకున్నాను

కారు వేగంగా ముందుకు వెళుతుంది.

‘‘నారాయణ.. నడ్పల్లి దాటగానే టర్న్ తీసుకో.. విక్టోరియా హాస్పిటల్ నుంచి వెళదాం..’’ అన్నాను.

‘‘ సరే.. సార్..’’ కారు వేగం పెంచాడు డ్రైవర్..

‘‘నారాయణ.. నడ్పల్లి దాటగానే టర్న్ తీసుకో.. విక్టోరియా హాస్పిటల్ నుంచి వెళదాం..’’ అన్నాను.

‘‘ సరే.. సార్..’’ కారు వేగం పెంచాడు డ్రైవర్..

పది నిమిషాలో నడ్పల్లి గ్రామం చేరుకుంది కారు. అక్కడి నుంచి డిచ్పల్లి విక్టోరియా హాస్పిటల్ వైపు టర్న్ చేసాడు డ్రైవర్ నారాయణ.

నెమ్మదిగా వెళుతున్న కారులో నుంచి విక్టోరియా హాస్పిటల్ వైపు చూసాను. ఎత్తైన పెద్ద వృక్షాలు…

పురాతనమైన భవనాలు.. రకరకాల పూల మొక్కలతో గార్డెనింగ్.. విశామైన రోడ్లు.. మధ్యలో ఎత్తైన చర్చి.. ప్రకృతి వాతవరణం మధ్య వెలసిన ఆ విక్టోరియా హాస్పిటల్ కుష్టు రోగులకు దేవాలయం.

ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు పెషేంట్లు.. అక్కడ ఉన్న వారందరికి కుటుంబం ఉంది.. బంధువులున్నారు. కానీ.. కుష్టురోగం ఉందని వెలి వేశారు వారి కుటుంభీకులు..

వారికి కుష్టు రోగం రావడం వారి తప్పు కాదు..

ఆ కుష్టు రోగం కంటే ఎక్కువగా రక్త బంధువులే వెలి వేశారనే బాధ వారిని కృంగ దీస్తోంది. చికిత్స కోసం విక్టోరియా హాస్పిటల్ వచ్చిన వారంతా తిరిగి ఇంటికి పోవడానికి ఇష్టపడటం లేదు.

ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వారందరు ఇక్కడే స్థిర పడ్డారు..

అక్కడ నివాసం ఉంటున్న వారికి కులాలు లేవు.. మతాలు లేవు.. వారందరిది మానవత్వ కులం ఒక్కటే..

అయినా.. ఆత్మీయుల వద్దనుకున్నా.. రక్త బంధాన్ని బంధువులు బవంతంగా తెగతెంపులు చేసుకున్నా.. ధైర్యంగా బతుకుతున్నారు వారంతా.. కులం.. మతా గోడలను కూకటి వేళ్లతో కూల్చి.. మంచి మనస్సుతో ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఎక్కువ..

క్రమేణ వారికి ఆ కుష్టు రోగం తగ్గింది. వారి పిల్లలకు ఆ వ్యాధి సోకలేదు… అయినా.. ఆ రెండు ఊళ్ల పేరులు చెబితే కుష్టురోగులుండే ఊరురా.. అంటూ హేళనగా మాట్లాడుతారు ప్రజలు.. రెండు వంద సంవత్సరాలు మనలను బానిసలుగా చూసి.. భారత దేశాన్ని దోచుకున్న అదే బ్రిటీష్ దేశం నుంచి కుష్టు రోగులను ఆదుకునే దేవతలా ఇన్బెల్ కీర్ నిజామాబాద్ జిల్లాకు వచ్చింది.

డిచ్పల్లి సమీపంలో మూడు వందల యాభై ఎకరాలో విక్టోరియా హాస్పిటల్ నెల కొలిపింది ఆమె..

కానీ.. డాక్టర్ కేశవరెడ్డి కూడా చిత్తూర్ జిల్లా తుపు పల్లిలో పుట్టి అందరూ అసహించుకునే కుష్టు రోగులకు 1976 నుంచి వైద్య సేవందిస్తున్న గొప్ప మానవతవాది అనుకున్నాను.

కుష్టురోగుల నివాసం ఉండే ఆ రెండు గ్రామాకు ఎన్నికలో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసాను..

వ్యక్తిగతంగా కలిసి సమస్యను పరిష్కరం చేస్తానని భరోసా కూడా ఇచ్చాను.. దగ్గరి నుంచి వారి బతుకును చూశాను.. కొంత మేరకు వారి సమస్యలను పరిష్కరించాను.

విక్టోరియా హాస్పిటల్ దాటి హైదరాబాద్ టు నాగాపూర్ నేషనల్ హైవేపై దూసుకెళుతున్నది కారు..

సుద్దపల్లి క్రాసింగ్ వద్ద యానంపల్లి వైపు కారు తిప్పాడు డ్రైవర్. గుంతలు పడిన కాంక్రీట్ రోడులో కారు వేగం తగ్గించాడు అతను.

సాంపల్లి తాండాకు రాగానే గిరిజన పిల్లలు కారు వెనుక పరిగెత్తుతూ వస్తున్నారు.

కొంతసేపు పరిగెత్తి కారు వేగానికి నోట్లోకి.. ముక్కుకు దుమ్ము పోవడంతో దగ్గుతూ దమ్మొచ్చి ఆగి పోయారు పిల్లలంతా..

యానంపల్లి ఊరు చివర రోడుకు ఇరువైపుల వ్యవసాయ తోటలున్నాయి..

అ తోటలలో పచ్చని ఆకులతో పసుపు పంట అందంగా కనిపిస్తోంది. ఆ పసుపు తోట ఒడ్డున ఎత్తుగా పెరిగిన తొగరి చెట్లకు కాయ ఇరుగ కాసింది.

కారులో నుంచి ఆ తోటలోకి చూస్తుంటే ఎర్రని టమాటాలు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్లకు కాసిన ఎర్రని మిరుప కాయలు దగ దగ మెరుస్తున్నాయి.

ఎత్తైన ఒడ్డుపై కర్రలు పాతి వాటిపై దిష్టిబొమ్మను..

కుండ ఉంచారు రైతు. ఆ కుండపై సున్నంతో మనుషుల్లాగా వేసిన బొమ్మను చూసి పిట్టలు భయపడి తోట లోనికి రావని అలా పెట్టారు వారు.

ఉల్లి పంటకు నీళ్లు పారిస్తున్న ఓ రైతు రోడ్ పై వెళుతున్న కారు శబ్దానికి నిలబడి చూస్తున్నాడు. ఆ రోడ్ పక్కన పెరిగిన ఎత్తైన చెట్లను ఎవరో నరికినట్టున్నారు.

‘‘ రఘువీర్.. ప్రకృతి మనిషికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. బ్రతుకు నిస్తోంది. అయినా.. ఆ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు మనిషి కదూ!’’ బాధతో అన్నాను.

‘‘ఔను సార్.. మీరన్నది నిజమే.. మనిషి నిజం తెలుసుకోలేక పోతున్నాడు..

ఈ మధ్య నక్సల్స్ వచ్చిన తరువాత అడవిలోకి వెళ్లి చెట్లను నరుకడానికి ఎవరు సాహాసం చేయలేక పోతున్నారు.

అడవిలో చెట్లు బాగా పెరిగినవి. నక్సల్స్ లేనప్పుడు స్మగ్లరులు అడవిలో ఉన్న టేకు కలపను నరికి అమ్ముకునే వారు.

కొన్ని సందర్భలో ఆ స్మగ్లరులను పట్టుకుని నక్సల్స్ శిక్షించడంతో భయపడి అడవిలోకి వెళ్లి చెట్లను నరికే సాహాసం చేయడం

లేదు.’’ అన్నాడు రఘువీర్ రెడ్డి.

‘‘సార్.. రామడుగు క్రాసింగ్ వచ్చింది.. ముందు సుద్దుం వెళదామా.. రామడుగా..’’ అడిగాడు డ్రైవర్.

‘‘రామడుగు ఊరు బయట మన కోసం ప్రజలు గంట నుంచి ఎదురు చూస్తున్నారట.. సర్పంచ్ ముత్తయ్య ఇప్పటికే రెండు సార్లు ఫోన్ చేసాడు.’’ అన్నాడు రఘువీరరెడ్డి.

‘‘అయితే.. ముందు రామడుగు వెళుదాం.. అక్కడి నుంచి కొరట్ పల్లి, సుద్దులం, చల్లగరిగే గ్రామాలు తిరిగి లంచ్ టైమ్ కు ఇంటికి చేరుకుందాం.’’ అన్నాను.

పది నిముషాలలో కారు రామడుగు చేరుకుంది. సర్పంచ్ ముత్తయ్య, లైబ్రరీయన్ హన్మండ్లు, గ్రామ పెద్దలు నాకు పూల దండలు వేసి స్వాగతం పలికారు.

‘‘ఎమ్మెల్యే కారు వచ్చిందిరా..’’

దూరంగా ఆడుకుంటున్న పిల్లలు పరుగెత్తుకు వచ్చారు.

‘‘తెలుగు దేశం జిందాబాద్.. ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావు నాయకత్వం వర్ధిల్లాలి.’’ ఉత్సహంగా నినాదాలు చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

ఆ తరువాత ఊరు ప్రారంభం నుంచి ర్యాలీ బయలు దేరింది.

ముందు డప్పు కొడుతున్నారు. వారి వెనుకనే మంగళహారతుతో మహిళలు నడుస్తున్నారు.

ఆ తరువాత వరుసలో నేను.. నాకు కుడి వైపు రామడుగు సర్పంచ్ ముత్తయ్య..

ఎడమ వైపు సిర్నాపల్లి సర్పంచ్ రఘువీరరెడ్డి నడుస్తున్నారు..

మమ్మలిని అనుచరిస్తున్నారు లైబ్రరీయన్ హన్మండ్లు, గ్రామ పెద్దలు.. యువకులు..

ఊళ్లోకి వెళుతుంటే ఎడమ వైపు ఎత్తైన చిన్న గుట్ట.. ఆ గుట్టపై గుంపుగా పెరిగిన మొతుక చెట్లు.. పసుపు రంగులో తంగేడి పూల చెట్లు.. ఎత్తుగా పెరిగిన పాల కొయ్య చెట్లు. కుడి వైపు కూన పెంక ఇళ్లు.. అక్కడక్కడ స్లాబ్ లతో కొత్తగా కట్టిన భవనాలు.. మట్టి రోడ్లో గుంపు గుంపుగా ర్యాలీగా నడుస్తుంటే దుమ్ములేస్తోంది.

జేబులో ఉన్న దస్తీని తీసి మొఖం తుడుచుకుని నడుస్తున్నాను. డప్పు శబ్దానికి ఇంటి బయటకు వచ్చిన ప్రజలు మా ర్యాలీని చూస్తున్నారు. వారికి చేతులు జోడించి దండం పెడుతున్నాను. వారం రోజు క్రితం ఎన్నికలు జరిగినా.. అలాంటి వాతవరణం ఊరిలో కనిపించలేదు.

(ఎమ్మెల్యేను ప్రజల సమక్ష్యంలో నక్సల్స్ ఎలా కిడ్నాప్ ఎలా చేస్తారు..? మా ఎమ్మెల్యేను కిడ్నాప్ చేస్తే ఊరుకోమని తిరుగబడ్డ ప్రజలకు నక్సల్స్ ఏమి సమాధానం చెబుతారు.. రేపటి వరకు ఆగాల్సిందే..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking