Memories of Endluri Sudhakar Sir ఎండ్లూరి సుధాకర్ సార్ జ్ఞాపకం
Memories of Endluri Sudhakar Sir
ఎండ్లూరి సుధాకర్ సార్ జ్ఞాపకం
ఏ క్యా కర్దియే సాబ్!
ఆప్ సే మిల్ కే దిల్ భర్ బాత్ కర్నా సంఝా
ఆప్ కే ఉర్దూసే తర్జుమా రుబాయియో కో ఛపానా థా
ఆప్ కె లిటరేచర్ పే ఏక్ సెమినార్ ప్లాన్ కర్నా థా
ఆప్ పే ఏక్ బడీ కితాబ్ నికాల్నా థా..
ఐసే కైసే బినా బాతాయే చలేగయే సాబ్😭
అబ్ సే ముఝే క్యా మియా.. కైసే హో -బోల్కే కోన్ బాత్ కారాయేoగే
ఉర్దూలో నాతో మాట్లాడే ఏకైక తెలుగు కవి ఎండ్లూరి సార్!
ఆయన పలకరింతలో ఎంతటి ఆత్మీయత ఉండేదో!
నా జగ్ నే కీ రాత్ కవిత్వానికి గొప్ప ముందుమాట రాశారు. నా కథలు అచ్చయినప్పుడు కాల్ చేసి మాట్లాడేవారు. అలాయిబలాయి కథల్ని విశ్లేషిస్తూ facebook లైవ్ మాట్లాడారు.
సముద్ర తీరంలో బాగా ఎంజాయ్ చేశాం
రుబాయిల అనువాదాలు బుక్ వేద్దాం సార్ అంటే వినకపోతిరి. మీ సాహిత్యం మీద రెండు రోజుల సెమినార్ చేద్దాం సార్ అంటే నక్కో మియా! లోగ్ జల్తే! అని అస్సలు వద్దంటిరి. ఇక మీరు వినరు గానీ మేమే చేయాలని మిత్రులం అనుకున్నాం.
రైల్వే రవీంద్ర మనిద్దరిని గోవా తీసుకెళ్లినప్పుడు సముద్ర తీరంలో బాగా ఎంజాయ్ చేశాం, ఎన్ని మాట్లాడుకున్నామో.. ఎన్ని వెరైటీలు తిన్నామో తాగామో..
తెలుసుకోవలసింది చాలా ఉండే!
మీతో చాలా ఎక్కువ సమయం గడపాలని ఉండేది సర్.. మీ నుంచి నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలా ఉండే! అప్పటికే ఫోన్ మాట్లాడుకున్నప్పుడల్లా ఏవో కొత్త విషయాలు మీ నుంచి విని అబ్బురపడేవాడిని. నా కథల్లో ఉర్దూ మార్దవం ఉందనీ నాలో గొప్ప కథకుడున్నాడని, కొందరు ఉర్దూ కథకులతో పోలుస్తూ మీరు మాట్లాడినప్పుడు బహుత్ ఖుషీ హుఈ సర్. బేచారే కథల గురించి మానస చెప్తుంటే ఆశ్చర్యపడ్డానని అన్నారు..
నా చిట్ఠీ కవితను మీరు అనువదించడం చూసి అబ్బురపడ్డాను..
అవార్డులు రాకుండా అడ్డుపడ్డ పెద్దలు
తెలుగు సాహిత్యానికి మీరు చేసిన సేవ చాలా గొప్పది. 90ల మొదట్లో మీ దళిత కవితలు తెలుగు సాహిత్యాన్ని చాచి లెంపకాయ కొట్టాయ్. మీ మల్లె మొగ్గల గొడుగు కథలు ఒక ఊపు ఊపాయి. సాహిత్యానికి ఒక షాక్ ట్రీట్మెంట్! వర్తమానం, నల్లద్రాక్ష పందిరి కవిత్వమే కాక మీరు ధైర్యంగా డప్పు మోగిస్తూ నిలవడం అద్భుతం! కానీ మీకు రావలసిన అవార్డులు రాకుండా అడ్డుపడ్డ పెద్దలున్నారు! మీకు రావలసినంత పేరుకి అడ్డుపడే వాళ్ళున్నా మీరు జానే దో… అనుకునేవారు!