Mahaprasthana of Bapu dolls-11 బాపు బొమ్మల మహాప్రస్థానం-11
Mahaprasthana of Bapu dolls-11
బాపు బొమ్మల మహాప్రస్థానం-11
“పాత పదాలు,డిక్షన్,వర్ణనలు అలంకారాలు,ఛందస్సు, ఉపమానాలు,పద్ధతులు,ఆచారాలు కవిత్వంలోవీ,జీవితంలోవీ ఇంకా మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరిచాడు శ్రీశ్రీ..”
(చలం, యోగ్యతా పత్రం)
తిండిలేక తూముపక్కన ధూళిలో తూలిపోతూ కూడా వెకిలి చూపులు చూస్తున్నాడు, కూనిరాగాలు తీస్తూ..!
అతడికి జరిగిన దురన్యాయం అటుంచి, అతడి ప్రవర్తనకు సభ్యసమాజం వేళాకోళమాడుతున్నదని శ్రీశ్రీ దుఃఖం వ్యక్తం చేస్తున్నాడు.
“అలకలన్నీ అట్టకట్టిన, బొమికలన్నీ ప్రోవుపట్టిన, కాగితం వలె పలచబారిన వెర్రివాడా ! కుర్రవాడా !
వీథికంతా వెక్కిరింతగా, ఊరికంతా దిష్టి బొమ్మగ, తూము ప్రక్కన ధూళిలోనే తూలుతున్నావా !
నీవు చూసే వెకిలి చూపూ, నీవు తీసే కూనిరాగం, మాకు తెలియని నీ ప్రపంచపు’ మహారణ్యపు చిక్కుదారులు!
వెర్రివాడా ! కుర్రవాడా ! నిన్ను చూసీ చూడనట్లె తెలివి మీరిన పెద్దమనుషులు తొలిగిపోతారు !
వెర్రివాడా ! కుర్రవాడా ! క్షమిస్తావా ! సహిస్తావా ! బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని !
అట్లు చూడకు, అట్లు పాడకు, మమ్ము వేళాకోళమాడకు! వెర్రివాడా ! కుర్రవాడా! వేడుకుంటాము.”!!
1935 (?)
కవిత్వం రాయడం ప్రారంభించాక చాలా కాలం వరకు సంవిధానమే (technic) కవిత్వం అనుకున్నాడు శ్రీశ్రీ. తొలుత కళ కళ కోసమే అనుకున్నాడు. బలంగా నమ్మాడు కూడా. ఆ తర్వాత ఈ అభిప్రాయానికి తిలోదకాలిచ్చి ‘కళ’ ప్రజలు కోసమన్న నిర్ణయానికొచ్చాడు. ఎన్నోకొత్త కొత్త ప్రయోగాలు చేశాడు. అలాంటి ఓ ప్రయోగాత్మక కవిత ఇది..!!
కవిత్వానికి సాంప్రదాయ వాదులు చెప్పే లక్షణాలను, నిర్వ చైనాలో సారాన్ని ఇందులో పరిహరించాడు. సూటిగా, సింపుల్ గా పామరుడికి సైతం అర్థమయ్యే రీతిలో రాశాడు. ఊపిరి పీల్చడం ఎంత సులువో కవిత్వం రాయడం కూడా అంతే సులువని ఈ కవిత ద్వారా చెప్పకనే చెప్పాడు. ఛందస్సుకీ, వ్యాకరణానికీ, అలంకారాలకీ, అన్నింటికీ అవతల స్వచ్ఛమైన కవిత్వముందని శ్రీశ్రీ గ్రహించాడు.
దాన్ని అందుకున్నాడు.
బాపు బొమ్మకు బ్నిం వివరణ…!!
“మేం మహా బుద్ధిమంతులం.తెలివిమీరిన పెద్దమనుషులం. న్యాయా ప్రాంతాలు చెప్పేవాళ్ళం. పట్టాలు తీసుకున్నవాళ్ళం. కానీ మావల్ల నువ్వెంత దురన్యాయం పాలైనా నువ్వు కేవలం వెర్రివాడివి. మేము తయారుచేసిన ఎప్పటికీ ఎదగని కుర్రవాడివి. నువ్వు క్షమోంచేస్తావు. సహించేస్తావు.
ఈ కవితకు బాపుగారు వేసిన బొమ్మలో ఉన్మాదిని చూపెట్ట లేదు. ఉన్మాదిని తయారు చేసిన చిద్విలాసిని చూపెట్టారు. చిద్విలాసి బుర్రలో మెదడు లేదు. ఆ పుర్రెకు మాత్రం చట్టాలు రాయగల పట్టాలు కున్న టోపీ వుంది డ్రెస్ లో Skelton వుంది.”(బ్నిం)
ఈకవితను విప్పి చెప్పడానికి చాంతాడు వివరణ అక్కర్లేకుండా తన చేతి గీతలతో ఈ కవిత రాతను మన
ముందు నిలబెట్టారు బాపు గారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని బాపు గారు తన గీతల్లో కి ఒంపుకున్న తీరు గురించి
ఎంత చెప్పినా తక్కువే..!!