Header Top logo

love story : శేఖర్ కమ్ముల ఒక సాహసమే..

love story : శేఖర్ కమ్ముల ఒక సాహసమే..

ఉదయం మార్నింగ్ షో సమయంలో థియేటర్ కి వెళ్లి ఫస్ట్ షో టికెట్స్ తెచ్చుకున్నా. ఏడు గంటలకే తినే అలవాటు ఉండడంతో ఇద్దరిమీ ఇడ్లి తిని ఫస్ట్ షోకి వెళ్లాం. థియేటర్ కిటకిట. 99 శాతం యూత్. నైస్ గైస్, గాళ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. కులం ఈ దేశంలో ప్రేమికుల మధ్య సృష్టించే దుర్మార్గ విధ్వంసాన్ని. చాలాసార్లు నేను నాగచైతన్య మెడవేపే చూస్తున్నా.. తెగిపడ్డ ప్రణయ్ మెడ శవమైన నరేశ్‌ దేహం, అంగం కోయబడ్డ ఇంకో ప్రేమికుడి శరీరం. 50శాతం లవ్ సినిమాలో ఉన్న హీరోనేనా అనిపించింది.

ఫ్యూడల్ కాస్ట్ హంటింగ్ కి విలవిలాడుతోండే దేహం సగం సచ్చిపోయి పలికే టోన్ అతని గొంతులో పలికింది. నిజం మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఒక అనివార్యత క్రియేట్ అయిందని మనం అనుకోవచ్చు. కానీ శేఖర్ కమ్ముల ఒక సాహసమే చేశాడు. వారసత్వ కంపు తెలుగు సినిమా మెలో డ్రామాకి అలవాటు పడిన మన బుర్రకి ఈ దేశపు పచ్చి వాస్తవం డాల్బీ సౌండ్ స్క్రీన్ మీద రసి కారుతూ కనిపించడం జీర్ణించుకోలేమ్.

ఒక సాధారణ ప్రేమ కథే. కానీ అప్పర్ కాస్ట్, లోయర్ కాస్ట్ మధ్య. అది రక్తి కట్టాలంటే నెత్తుటి కాల్వలు దాటాల్సిందే. చాలాసార్లు మా మేడం ‘శ్రీదేవి సోడా సెంటర్’ గుర్తు తెచ్చి ఏవో పోల్చాలని చూసింది. కానీ నాకలా అనిపించలేదని చెప్పాను. కరుణ కుమార్, శేఖర్ కమ్ముల ఒకే స్టోరీని దృశ్యమానం చేసేప్పుడు భిన్న అభివ్యక్తీ వైఖరులు ఉండొచ్చు. కానీ ఎంచుకున్న పాయింట్, చెప్పాలని చేసిన ప్రయత్నం మాత్రం హృదయపూర్వకంగా అభినందించదగింది.

సినిమా ఐపోయాక ముగింపు గురించి యూత్ చర్చ,  కానీ వెలి ప్రేమకి ఏ ముగింపు ఇస్తే ఏ హృదయం ఎట్లా సంతోషపడుతుంది. పటిష్టమైన సంభాషణలు హృదయాన్ని కట్టి పడేసే ఎమోషన్స్, అన్నింటికంటే ముఖ్యంగా సినిమా మొత్తం హాయి అయిన సౌందర్యంతో మురిపించే అద్భుతమైన తెలంగాణ మాండలికం. కులం చూడని మత పట్టింపు లేని అచ్చమైన మనుషులకి నచ్చుతుంది. ఆ తోవలో వెళ్లాలని అనుకున్నవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇంకా చాలా రాయాలని వుంది కానీ అంతా రాసేస్తే.. బావోదు.

– నూకతోటి రవికుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking