Header Top logo

మనుషులు కావాలి : ముక్కామల చక్రధర్‌

మనుషులు కావాలి

”   వెలిసాడు.
సరే, బుద్ధుడితో పాటు మునిగిన బృహత్‌ శరీరాలు కావాలి”
” ఆ శరీరాలు కావాలి నాకు… తెచ్చిస్తారా” అంటాడు నా స్నేహితుడు, మంచి కవి హెచ్చార్కే ఓ కవితలో. అవును, ఇప్పుడు నేనూ అదే అడుగుతున్నాను.

పుష్కరాల స్నానం ఇచ్చే పుణ్యం సరే… ఆ పుష్కరాల్లో మరణించిన వారి శరీరాలు కావాలి నాకు. ఈమధ్యనే కందుకూరు, గుంటూరుల్లో అకారణంగా అసువులు బాసిన వారితో మాట్లాడాలి. ఆ అవకాశం కల్పిస్తారా ఈ రాజకీయులు. ప్రాణమంటే ఎక్స్ గ్రేషియాగా మారిన కాలంలో ఉన్నాం.

ఇది వాంచనీయమా… ఇది సమంజసమా… ప్రజలంటే ఓట్లుగా, నోట్లుగా మారిపోతున్న మాయదారి లోకం ఇది. ఎక్కడ చూసినా ఆదిపత్యపు అహంకారం కనపడుతున్న వేళ… మనుషుల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి.

రాష్ట్రాన్ని కంప్యూటరీకరించింది నేనే అంటాడో నాయకుడు. తెలుగు వారు సగర్వంగా ప్రపంచాన్ని ఏలుతున్నాడంటే దానికి పునాది వేసింది నేనే అని కూడా అంటాడు. దీనికి వందిమాగద మీడియా వంత పాడుతుంది.

మరి ఆ సమయంలో అప్పుల కుప్పలై పురుగు మందులే పెరుగన్నంగా మార్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్న రైతులు, వారి కుటుంబాల గురించి ఎవరూ పెదవి విప్పరేం. నాకింకా ఆనాడు బషీర్‌ బాగ్‌లో తూటాలకు బలైపోయిన ఆ ఇద్దరూ నా కుడి, ఎడమల వైపు నడుస్తున్నట్లే ఉంటుంది. ఆనాటి ఏలిక చేసిన వికటట్టాహాసం నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఉచిత విద్యుత్‌ పథకం ఉంది. మరి ఆ శరీరాలు ఏవీ.

ఇప్పుడు కూడా నేను ఆ బృహత్ శరీరాలే కావాలంటాను. మనుషులు లేని లోకంలో ఎలా జీవించగలుగుతాం. ఎలా మనగలుగుతాం. కళేబరాల మీద నడుస్తూ…. ఎన్నికల పాటలకు కదలలేని శరీరాల మధ్య నాట్యం చేయడమంటే అసహ్యం నాకు. అవును, రాజకీయాలకు అతీతంగా మనుషుల గురించే మాట్లాడతాను.

ఇక్కడ నేను అంటే సర్వనామమే. అప్పుడెప్పుడో కాలి బొబ్బలెక్కిన కాకతీయ రైలు గురించి భోరుమన్నాను. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన శ్రీకాంతాచారి నా ఇంటి పేరు. అదే సమయంలో సమైక్య రాష్ర్టం కోసం రైలుకి ఎదురెళ్లిన రాయలసీమ యువరక్తం నా మారు పేరు. మనుషుల గురించి మాట్లాడకుండా ఇంకే మాట్లాడినా అది వ్యర్ధ పదమే.

నదిలో మునిగిపోతున్న వాడ్ని అందరూ చూస్తుండగా బయటకు తీసి అతను మింగిన నీటిని కక్కిస్తున్నట్లుగా ప్రపంచానికి ఓ భ్రమ కల్పించి… గుండెలపై ఒక్క నొక్కు నొక్కి చంపేయచ్చు. ఈ హత్యకు చేతికి నెత్తురంటదు. కనీసం నీటి చుక్క ఆనవాలు కూడా కనిపించదు. హంతకుడు ఎవరో అందరికీ తెలుసు.

సాక్ష్యాలే సాధికారికం కనుక నదిలో పడి ఊపిరాడక మరణించిన వారి జాబితాలోకి అతగాడి మరణం కూడా చేరిపోతుంది. ఆధునిక హంతకుడి హత్యా రహస్యం అదే. హంతకుడే హత్యల గురించి గగ్గోలు పెట్టడం, కొవ్వుత్తులు వెలిగించి సంతాప సభలు నిర్వహించడం ఆధునిక హంతకుడి విదూషక నాటకం. ఈ నాటకంలో మిగిలిన పాత్రలన్నీ ఎటువంటి రిహార్సల్స్ లేకుండా చకచకా తమ పాత్రలు పోషిస్తాయి.
ప్రఖ్యాత దర్శకుడు బాపు సినిమా ముత్యాలముగ్గులో విలన్‌ రావుగోపాలరావు సహ నటుడు ముక్కామలతో ఓ సందర్భంలో అన్న డైలాగ్‌ “ఎదవ పానాలు ఎవడిక్కావాలి. అర్ధణాకి ఆరు పానాలు ఇస్తాను. డబ్బు కావాలయ్యా.. డబ్బు” నేటి రాజకీయానికి, కొందరు నాయకులకు నకలు రావుగోపాలరావు విలనిజం. మనిషి డీహ్యుమనైజ్‌ కావడం కళ్ల ముందు కదలాడే దృశ్యం.

ఈ దృశ్యానికి ఎవరూ మినహాయింపు కాదు. కాలేరు. అధికార యావలో మనుషుల్ని పుట్టించడం, వారిని బతికుండగానే బలి తీసుకోవడం ఓట్ల పెట్టెలో దాగి ఉన్న అసలు సిసలు వాస్తవం. కవి వసీరా అన్నట్లు….
” అవును.. నన్నెవరో ఓట్ల కోసమే పెంచారు. నన్నెవరో అదనపు విలువల కోసమే పెంచారు…
నన్నెవరో ఓట్ల కోసమే చంపేశారు. నన్నెవరో అదనపు విలువల కోసమే చంపేశారు”

ముక్కామల చక్రధర్‌

సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929
విశాలాంధ్ర సౌజన్యంతో..

1 Comment
  1. Ram says

    Superb and excellent Analysis.Truely said and final conclusion is absolutely eye opening.

Leave A Reply

Your email address will not be published.

Breaking