Header Top logo

ఆటో డ్రైవర్‌ నుంచి జర్నలిజం వరకూ

ఆటో డ్రైవర్‌ నుంచి జర్నలిజం వరకూ…

– ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్టు

జర్నలిస్టులంటే సమాజం భయపడుతుందా… గౌరవిస్తుందా… వీళ్లతో ఎందుకులే అని దూరంగా ఉంటుందా. అసలు ఈ వృత్తి పట్ల భయంతో కూడిన గౌరవం వల్ల కలిగే గుర్తింపు ఏమైనా ఉంటుందా. నా మూడు దశాబ్దాల జర్నలిస్టు అనుభవంలో ఈ వృత్తిలో ఉన్న వారి పట్ల సమాజం గౌరవాన్ని నటిస్తూ భయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విషయం జర్నలిస్టులకు కూడా తెలుసు. కాని, ఈ వృత్తిలో ఉండే ఓ మత్తు ఇందులోకి ఒక్కసారి ప్రవేశించిన వారిని పట్టి పీడిస్తుంది.

బురదలో కూరుకుపోయామన్న ఎరుక కలిగాక ఆ బురదని ఎంజాయి చేయడం తప్ప మరోదారి కనపడదు. లేకపోతే హాయిగా ఆటో నడుపుకుంటూ కలకాలం హంసలా రోడ్లపై ఎగురుతూ గడపాల్సిన గోవిందరాజు చక్రధర్‌ అనే ఆటో డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ జర్నలిస్టు అవతారమెత్తి ఆ కూపంలో కూరుకుపోవడమేమిటి. చాలా పత్రికల్లో సీనియర్‌ జర్నలిస్టుగా డెస్క్‌ల్లో పని చేసి అపార అనుభవంతో జర్నలిజం పాఠశాలలకు ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరించారు చక్రధర్‌. ఆ మధ్య మీడియా మొఘల్‌గా అందరూ అభివర్ణించే ఈనాడు రామోజీరావు మీద రామోజీ ఉన్నది ఉన్నట్టు అంటూ ఓ పుస్తకం కూడా తీసుకొచ్చారు. ఆ పుస్తకంలో ఈనాడులో తన చేదు అనుభవాలను అక్షరబద్ధం చేశారు.

ఆయన ఆశించినట్లే ఆ పుస్తకం సంచలనమైంది. ముఖ్యంగా జర్నలిస్టు వర్గాల్లో. నాకైతే ఆ పుస్తకం మీద అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఒక సంస్ధలో కొన్ని సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పని చేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత యాజమాన్యాన్ని ఆడిపోసుకోవడం సమంజసం కాదనిపించింది. రచయితకు అంతకు ముందే జర్నలిస్టు, సాహిత్య సమాజంలో చాలా పేరు ఉండడంతో ఈ పుస్తకానికి మెచ్చుకోలు కూడా లభించింది. ఇందులో ఇంకో తిరకాసు ఉంది. రామోజీరావు దగ్గర పని చేసి బయటకు వచ్చిన వారంతా “ఈ పని మేం చేయలేదు. చేయలేకపోయాం. మీరు చేసారు” అనే మెచ్చుకోలు కూడా చక్రధర్‌కి మంచి కిక్కు ఇచ్చి ఉండొచ్చు.

సరే, అదలా ఉంచితే ఇప్పుడు మళ్లీ మరో పుస్తకం తీసుకొచ్చారు గోవిందరాజు చక్రధర్‌. అది తాను జర్నలిస్టు కావడానికి ముందు తన వృత్తి జీవితం గురించి రాసింది. అదే గ్రాడ్యుయేట్‌ ఆటో సర్వీస్. గోవిందరాజుచక్రధర్‌ తన డిగ్రీ చదువు ముగిసిన తర్వాత ఉద్యోగాల వేట పేరుతో ఖాళీగా ఉండకుండా ఆటో డ్రైవర్‌గా మారడం ఆనాటి యువతకే కాదు… నేటి యువతకు కూడా ఆదర్శమే. పైగా అగ్ర కులానికి చెందిన గోవిందరాజు చక్రధర్‌ ఈ పనికి పూనుకోవడం అప్పట్లో సంచలనమే.

నాకూ ఈ ఆటో డ్రైవర్‌ అనుభవం ఉంది. అయితే చాలా తక్కువ సమయమే అది. దీనికి కారణం కూడా అగ్రకులానికి చెందిన వాడ్ని కావడమే. నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత విజయవాడలో కొన్నాళ్ల పాటు ఆటో నడిపిన నన్ను మా నాన్న గారు ” చదువుకుని ఈ వృత్తి ఏమిటి… తలవొంపులు కాకపోతే” అని వెనక్కి తీసుకొచ్చేశారు. కాని, చక్రధర్‌ మూడేళ్ల పాటు ఆటో నడపడం డిగ్నిటీ ఆఫ్‌ ల్యాబర్‌ అనే పదానికి ప్రతీక.
ఈ గ్రాడ్యువేట్‌ ఆటో సర్వీస్‌ పుస్తకంలో ఆటో డ్రైవర్‌ జీవితం ఒక్కటే కనపడదు. సమాజంలో వివిధ రకాల మనుషులు, మనస్తత్వాలు, వారి ప్రవర్తన, ప్రయాణీకుల పట్ల ఆటో డ్రైవర్ల చూపు, నిర్లక్ష్యం, ఒక్కోసారి శ్రద్ధ వంటి బహు రూపాలు కనిపిస్తాయి.

ఈ పుస్తకంలో నాకే కాదు… చాలామందికి ఏకీభవించని, అంగీకరించని వ్యాసాలున్నాయి. అంటే మగబుద్ధి అనే మాటకు పర్యాయపదం వంటి వ్యాసాలుగా భావించాల్సినవి. అందులో ఒకటి అర్ధరాత్రి… ఆటోస్టాండ్‌, ఒంటరి యువతి. రాత్రి బస్సు దిగిన ఓ ఒంటరి యువతిని అక్కడున్న ఆటో డ్రైవర్లు చూసిన చూపులు. ఈ వ్యాసంలో సాటి ఆటో డ్రైవర్లను ఉద్దేశించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ” ప్రతీ ఆటో డైవర్‌ కళ్లు కామంతో ఎరుపెక్కాయి.

ప్రతి ఆటో డ్రైవర్ లో ఓ ఉన్మాదం పడగవిప్పి బుసలు కొట్టింది. జింక మీద దాడి చేయబోయే పులిలా చేలరేగిపోతున్నారు ” అంటూ రాశారు. ఆనాడు గుంటూరులో ఉన్న ఆటో డ్రైవర్లలో తానొక్కడే పరమ పవిత్రుడని, మిగిలిన వారంతా కామాంధులని రచయిత చక్రధర్‌ అభిప్రాయం. ఈ సంఘటన జరిగి ఉండవచ్చు. కాదనలేం. కాని పురుషులందు పుణ్య పురుషుడు అనలేదు వైతాళికులు. పుణ్య పురుషులు వేరయా అన్నారు. ఇక్కడ తానొక్కరే పుణ్య పురుషునిగా చూపించుకునే యత్నం తన వరకూ మంచిదే కావచ్చు. కాని ఓ డ్రైవర్‌ కమ్యూనిటీని బోనులో నిలబెట్టేందుకు చేసే ప్రయత్నంగా భావించాలి.

ఇక రెండో వ్యాసం… మోహరాగం. తన గ్రామంలో ఓ పెద్దాయనకు సాయం చేసేందుకు గుంటూరు ఆసుపత్రికి వచ్చిన కోమలి అనే సాధారణ రైతు భార్యతో ఆటోలో ఆమె ఊరు వెళ్లడం. కోమలి అభ్యర్ధన మేరకు ఆ అర్ధరాత్రి ఆ ఇంట్లోనే ఉన్న రచయిత కోమలి అందాలను కళ్లతోనే తినేయాలనుకోవడం, ఇవేవీ పట్టని కోమలి రచయితకు అతిధి మర్యాదలు చేయడం ఇదీ వ్యాసం. ఇదీ జరిగిన ఘటనే. అర్ధరాత్రి తనను దింపడానికి వచ్చిన ఓ అమాయకపు పల్లెటూరి రైతు భార్యని ఆటో డ్రైవర్‌ ” ఆ చూపు” చూడడం… పుణ్య పురుషులు వేరు కాదు…. అసలు దొరుకుతారా అనే అనుమానమే కలుగుతుంది.

చివరిగా…. ఇంటి పేరు మారినా… సొంత పేరు ఒకటే అయిన కారణంగా గోవిందరాజు చక్రధర్‌ రాసిన అనేకానేక పుస్తకాలు నేను రాసినవే అనుకుని చాలా మంది నాకు ఫోన్‌ చేసి అభినందించే వారు. నేను ఆ అభినందనలను కాస్త సిగ్గు పడుతూనే ఊ అనకుండా… కాదు అని కూడా అనకుండా స్వీకరించాను. గొప్ప రచయిత గుడిపాటి వెంకటచలం మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానానికి ముందుమాట రాస్తూ ” ఎవరి నుంచి దొంగిలించామో వాళ్లని క్షమించడం కష్టం” అంటాడు. గోవిందరాజు చక్రధర్ కూడా ఈ ముక్కామల చక్రధర్‌ని క్షమించడం కష్టం.

ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్టు

– విశాలాంద్ర సౌజన్యంతో…

సెల్ : 99120 19929

Leave A Reply

Your email address will not be published.

Breaking