Pro. Endluri Sudhakar Sir ఎండ్లూరి సుధాకర్ సార్ కు వీడ్కోల్
Farewell to Pro. Endluri Sudhakar Sar
ఎండ్లూరి సుధాకర్ సార్ కు వీడ్కోల్
అక్కడికి చేరుకునేసరికి ఇంకా ఎవరూ రాలేదు. “అదిగో ఆవిడ అమ్మ. ఒక్కొక్క కొడుకూ ఇట్లా పోతుంటే ఎలా తట్టుకుందో అర్థం కావట్లేదు” గుమ్మం దగ్గర నిలబడ్డ తల్లిని చూపించి చెప్పింది మెర్సీ. వో అరగంట తర్వాత అంబులెన్స్, ఒక నల్లని జిప్ బాగ్ ని మోసుకొచ్చింది. వో బల్లమీద ఆ బాగ్ ని పెట్టాం. ఒక్కొక్కళ్ళూ వస్తున్నారు, బాగ్ ఓపెన్ చెయ్యండి అని అడుగుతున్నారు. లేదు ఓపెన్ చెయ్యటానికి వీల్లేదు. చెబుతూ నిల్చుందా అమ్మాయి. వచ్చే పరిచయస్తుల పలకరింపులు, పరామర్శలు బాగ్ వైపు వో నిర్లిప్తపు కన్నీళ్ల చూపులు..
బాగ్ మాత్రం కదలకుండా నిద్రపోతూ..
బాగ్ మాత్రం కదలకుండా హాయిగా నిద్రపోతూ చూస్తోంది. మధ్యాహ్నం అయ్యింది. జనం వస్తూనే ఉన్నారు. బాగ్ మీద పూల మాలలు వేస్తూ నమస్కారం చేస్తున్నారు. ఎవరో మనిషిని గురించి మాట్లాడుతున్నారు. అతనిచ్చిన చైతన్యం గురించి, జాతికోసం అతని కొట్లాటను గురించీ చర్చిస్తున్నారు. బాగ్ ఎవ్వరినీ పట్టించుకున్నట్టు లేదు. సాయంత్రమైంది… అరుణాంక్ నేనూ బాగ్ మీద ఉన్న గ్లాస్ కేస్ ఎత్తామ్, డేవిడ్ వచ్చి బాగ్ ఓపెన్ చేసాడు.
ఆ సంచీ లోపల…. అతను నిద్రపోతున్నాడు
ఏనాటి దుఃఖపు కలనో కంటున్నట్టు
కలలో ఏ రాక్షసుడితోనో పోరాడుతున్నట్టు
అవిశ్రాంతపు మొహంతో కనిపించాడు..
అందరూ అతన్ని చూసి, అతని మొహాన్ని చూసి తప్పుకున్నారు. కొందరు అతన్ని తాకాలని ప్రయత్నించారు. మళ్లీ రెండోసారి అతన్ని ఎత్తుకున్నాం. కొత్తగా మెరిసిపోతున్న పెట్టెలో పడుకోబెట్టాం. అరుణాంక్ కోట్ కప్పాడు, సెంట్ చల్లాడు. పూల మాల వేసారెవరో… అలకరించబడ్డ కవి నవ్వుతున్నట్టు అనిపించింది. పుట్టుకనుంచీ ఇప్పటిదాకా ఇదిగో ఇట్లా నిద్రపోవటానికి కూడా ఇంత కొట్లాడానో చూడండి రా. అన్నట్టు. పెట్టెని భుజాలకి ఎత్తుకున్నాం ఒక్కొక్క అడుగు వేస్తుంటే…
నాకు షుగర్ వచ్చినప్పుడు
నెల కిందట చెప్పిన మాటలే మళ్లీ చెబుతున్నాడతను. “నాకు షుగర్ వచ్చినప్పుడు… నన్ను కుట్టిన దోమకూడా తేనెటీగై ఎగిరిపోయింది.. ఫలానా కవి ఉర్దూలో ఇట్లా అన్నాడు, ఆ గాథా సప్త శతిలో ఈ మాట చూడు.గుండెలు కదిలినట్టనిపించే దుఃఖపు కేక. అప్పటివరకూ నిబ్బరంగా ఉన్న మానస.. ఇప్పుడు భళ్ళున బద్దలైంది. నాన్న కోసం పెట్టెని పాతి పెట్టారు.
“జోహార్ ఎండ్లూరి సుధాకర్ సార్..”
అరిచారెవరో… అందరూ జోహార్లు చెప్పారు. చీకటి పడుతోంది. అందరూ తిరుగుముఖం పట్టారు.
రేపు అతని సమాధి మీద ఏ మొక్కా మొలవకపోవచ్చు, అతని పేరు చెక్కిన సమాధి ఫలకం కోసం ఏ పిల్లవాడూ వెతకటానికి రాకపోనూ వచ్చు… అయితే అతన్ని, అతని అక్షరాలనీ, అతని ప్రేమ పూర్వక చూపునీ ఈ నేలమీద అతని గుర్తుల్ని ఎన్నటికీ చూస్తూనే ఉంటాం…. ఓ నల్లద్రాక్ష పందిరికింద అతను రాసిన అక్షరాలనీ చదువుతూనే ఉంటాం….. ఇదిగో మళ్లీ తెల్లారింది. అతను గుర్తొస్తూనే ఉన్నాడు.