Header Top logo

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు: నారాయణకు బెయిలు మంజూరు

  • వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన పోలీసులు
  • నారాయణపై అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి
  • వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు
పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో నిన్న ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అనంతరం చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. 
అయితే, ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.

బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking