Header Top logo

చైనా స‌రిహ‌ద్దుల్లో ప్ర‌జ‌లు గ్రామాల‌ను ఖాళీ చేస్తోన్న వైనం

చైనా స‌రిహ‌ద్దుల్లో గ్రామాల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ఖాళీ చేస్తూ వేరే ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. శాంతి మంత్రం జ‌పిస్తూ చైనా మ‌రోసారి భారత సరిహద్దుల వ‌ద్దకు కొన్నేళ్ల నుంచి సైనికులను త‌ర‌లిస్తూ, అక్క‌డ మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధి చేసుకుంటూ, కొత్తగా గ్రామాలను సైతం నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, ఉత్త‌రాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నులు అంతంత మాత్ర‌మే జ‌రుగుతున్నాయి.

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఉత్తరాఖండ్‌లో పిథోరాగఢ్‌ జిల్లాలో చైనా-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న 59 గ్రామాలను ఖాళీ చేశారు. జల్‌ జీవన్‌ మిషన్ ఈ మేర‌కు ఓ నివేదిక సిద్ధం చేసింది. పిథోరాగఢ్‌ జిల్లాలో ప్రస్తుతం 1,542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారని స్ప‌ష్టం చేసింది.

ఇదే జిల్లాలో మూడేళ్ల క్రితం అక్క‌డి గ్రామాల సంఖ్య‌ 1,601గా ఉండేదని వివ‌రించింది. కొన్ని గ్రామాల్లో పూర్తిగా మ‌నుషులే క‌న‌ప‌డ‌ట్లేరు. మూడేళ్లుగా తాము ఇంటింటి సర్వే చేపట్టామ‌ని జల్‌ నిగమ్‌ అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయ‌ని చెప్పారు. ఇక మైగ్రేషన్‌ కమిషన్‌ డేటా ప్ర‌కారం… పిథోరాగఢ్‌ జిల్లాల్లోనూ 41 గ్రామాల్లో 50 శాతానికిపైగా ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మ‌రోవైపు, స‌రిహ‌ద్దుల్లో చైనా గ్రామాల‌ను నిర్మిస్తూ త‌మ ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తోంది.
Tags: China, India, Uttarakhand

Leave A Reply

Your email address will not be published.

Breaking