Header Top logo

Black money worth crores of rupees hidden abroad

Black money worth crores of rupees hidden abroad

విదేశాలలో దాచుకున్న కోట్ల రూపాయల బ్లాక్ మనీ

నాలుగు రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. ప్రముఖమైన వార్తే కానీ, ఎందరు పట్టించుకున్నారో తెలియదు. వికీలీక్స్ – పనామా పేపర్స్ – పాండారా పేపర్స్ ద్వారా, వేల వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని విదేశాలలో దాచుకున్న వందలాది మంది, వేలాది మంది భారతీయుల గురించి మనం చదువుతూ ఉంటే, నేను చెప్పబోయో వార్తా వ్యవహారం చాలా చిన్నదే అనుకోండి. కానీ, ప్రభుత్వ ఉద్యోగ వర్గం నుండి, వారు చదువుకున్న నైతిక విలువల నుండి చూస్తే, చాలా పెద్ద విషయం- వ్యవహారం కూడా!

మనం పెద్దపెద్ద అవినీతుల గురించి వినీవినీ, కొన్ని అవినీతులను పట్టించుకోవడం లేదు. అవి చాలా చిన్నవి అనుకుంటున్నాం. అవినీతి ఎక్కడ ఎలా ప్రారంభం అవుతుంది? అది ఎక్కడికి చేరుతుంది..?

అవినీతిని ప్రారంభంలోనే ప్రశ్నించకపోతే, అది విదేశాలలో బ్లాక్ మనీగా చేరుతుంది!

‘సందట్లో జేబు దొంగలు’ అన్నట్టుగా, బయట ఏవో గొడవలు జరుగుతూ ఉంటే, లోపల కొందరు వ్యక్తులు తమ తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. లోపల అంటే? ప్రభుత్వాల లోపల అని!  ఎటువంటి వ్యక్తులతో ప్రభుత్వాలు నిండుతున్నాయి?

ఇంతకూ వార్త ఏమిటి అంటే?

పొరుగు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, ఓ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని , తిరిగి తన సలహాదారుగా నియమించుకున్నది.అక్షరాలా నెలకు రెండున్నర లక్షల రూపాయల జీతం, ఇతర అలవెన్సులు , ఇటు రాష్ట్ర రాజధానిలో,అటు ఢిల్లీలో నివాస సౌకర్యం, సిబ్బంది,ప్రత్యేక హోదా వగైరా కల్పించారు. మీ సంగతి ఏమో కాని, నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు నెలకు‌ నాలుగు వేల రూపాయల పెన్షన్ మరి.అది చాలు అనుకున్నాను.సరిపోతున్నది.

ఇక ఆ వార్త వింటే,ఆశ్చర్యంగా ఉండదూ?!

కేవలం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రమే మాట్లాడటానికి పరిమితం అవుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఉండి ఉండవచ్చు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు? ఎంత డబ్బు పెన్షన్ల రూపంలో ఇస్తున్నారో- దాన్ని‌ పుచ్చుకుంటున్నవారు తిరిగి సమాజానికి ఏమి చేస్తున్నారో..?

పొలాలలో రెక్కలు ముక్కలు చేసుకుని, జీవిత కాలం అంతా ధాన్యాన్ని పండించి,దేశానికి అన్నం పెట్టే రైతుల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. వారికి‌ ఇలా నెలనెలా పెన్షన్లు ఇవ్వడం లేదు కద? ఇవ్వవచ్చు కద..??

ప్రభుత్వంలో పనులు చెయ్యడానికి ఉద్యోగ వ్యవస్థ ఉంటుంది. దాన్ని నడపడానికి ఎన్నికలలో గెలిచిన రాజకీయ పార్టీ తాలూకా వ్యవస్థ ఉంటుంది. ఇటు రాష్ట్ర వ్యవహారాలను , అటు కేంద్రప్రభుత్వంతో నడపవలసిన వ్యవహారాలను కూడా , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గమూ ,దాన్ని నడిపే రాజకీయ పార్టీ చూసుకోవాలి. మళ్ళీ అదనంగా ఈ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను భారీ మొత్తాలలో డబ్బు ఇచ్చి సలహాదార్లుగా నియమించుకోవడం ఏమిటి?

ఎవరి డబ్బును , ఎవరికి దార పోస్తున్నారు?అవసరమా..??

ఒకప్పుడు- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు- సత్యం కంప్యూటర్స్ కుంభకోణం జరిగింది. ఇప్పుడు చాలా మంది మరిచిపోయి ఉండొచ్చు. ఆ కుంభకోణం బయట పడగానే, అందులోంచి ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా తప్పుకున్నాడు. అతనికి ఆ కంప్యూటర్ సంస్థ గౌరవ వేతనంగా , నెలకు మూడు లక్షల రూపాయలు ,ఇతర అలవెన్సులు‌ ఇచ్చేవారట- అతను IAS అధికారిగా పనిచేసిన రోజుల్లో  , మన తెలుగు వాడైన మాజీ ప్రధానమంత్రి దగ్గర ,కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ధార్మిక‌ గ్రంథాలను కూడా రచించాడు.రిటైర్ అయిన తరువాత ,ఆ ప్రైవేటు కంపెనీలో చేరారు! పని చెయ్యడానికి కాదు,అధికారంలో ఉన్నప్పుడు సదరు కంపెనీకి చేసిన లోపాయి కారి సేవలకు ప్రతిఫలంగా. IAS వాళ్లకైనా ‘ సామాజిక స్పృహ’ గురించి ,వారి చదువుల్లో చెప్పరా? చెప్తారనే నేను భావిస్తున్నాను. కానీ, కొందరు చివరికి‌ ఇలా అవుతున్నారు? ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలు అలాగే అయ్యాయి. వాటిని అనుసరించి, దాని ఉద్యోగ వర్గం- రిటైర్డ్ ఉద్యోగ వర్గమూ! అందరూ కాదనుకోండి.కొందరికి మినహాయింపు ఉంటుంది.

ఓ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పెన్షన్ ఎంత ఉంటుంది? నాకు తెలియదు కానీ, ఓ రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ కు , సుమారు యాబై వేల రూపాయల వరకు రావడం నాకు తెలుసు. ఆ లెక్కన ఆ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి , ఎంత పెన్షన్ ఉంటుంది? అది తీసుకుంటున్నందుకు కూడా , ఆయన సమాజానికి ఏదో ఒకటి ఉపకారం చెయ్యాలి.

నిజానికి, మనం ఆలోచిస్తే, పెన్షన్ కూడా ఒక జీతం వంటిదే! ప్రభుత్వం ఇస్తున్నది అంటే, అది సమాజపు సొమ్ము! ప్రజలందరి ఉమ్మడి రెక్కల కష్టం! ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువుల మీద, ప్రజలు కొనే వస్తువుల మీద, ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తాయి. వ్యవసాయ మార్కెట్లలో రైతులు అమ్మే , ప్రతీ కిలో ధాన్యం మీద కూడా ప్రభుత్వం పన్ను  వసూలు చేస్తుంది.

పెన్షన్ తీసుకుంటున్న ప్రతీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కూడా, ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనాలి.అది నైతిక ధర్మం!

నైతిక ధర్మాల్ని కూడా, చట్టాలుగా మార్చాలి!

Thummeti Raghothama reddy

తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రచయిత

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking