Ashta Dikpalakus in Brahmotsava service అష్ట దిక్పాలకులు
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సేవలో అష్ట దిక్పాలకులు
ఏడుకొండల స్వామికి తొలిసారిగా బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని; నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలని; తిరుమలలో పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారనీ; పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని ‘బ్రహ్మోత్సవాలు అంటున్నారని; పలు విధాలుగా బ్రహ్మోత్సవాల గురించి చెపుతుంటారు. బ్రహ్మాది దేవతలచే కీర్తింప బడే కోనేటి రాయని బ్రహ్మోత్సవాలు నేటికీ ఘనంగా కొనసాగు తున్నాయి. భారతావనిలో నారాయణ పర్వతంపై సౌరమాన కన్యామాస ఏకాదశి సోమవారం శ్రవణా నక్షత్రంతో కూడిన సిద్ధ యోగ శుభ సమయాన వైకుంఠ నాథుడు శ్రీనివాసునిగా అవతరించాడని పద్మ పురాణం చెపుతున్నది.
వేంకటేశ్వరుడు అర్చనామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. రవి కన్యామాసంలో ప్రవేశించిన తరువాత వచ్చే శ్రవణా నక్షత్రం రోజున అవబృద కార్యక్రమాన్ని నిర్ణయించుకుని దానికి తొమ్మిది రోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ధ్వజారోహణతో సకల దేవతలకు ఆహ్వానం పలికి, ధ్వజా వరోహణంతో ఆహ్వానితులైన దేవతలకు వీడ్కోలు పలికి ఉత్సవాలను ముగిస్తారు.
స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం.
బ్రహ్మాండ నాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాలలో తొలి దినం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా గరుడ కేంద్ర ప్రతిష్ట, కంకరణ ధారణ, ఆలయ ఆవరణంలోను, బయట, చుట్టూ అష్ట దిక్కు లలోనూ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సపరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్ట దిక్పాలకులు ఆహ్వానింప బడతారు. అనంతరం స్వామి వారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరకు చేరు కుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదుడు విమాన ప్రదక్షణలో ఉన్న మండపంలోకి చేరుకుంటారు. తదుపరి శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు ద్వజస్తంభంపై గరుడ ద్వజాన్ని (గరుడ పటాన్ని ఎగురు వేస్తారు) దీనితో ద్వజారోహణ కార్యక్రమం పూర్తి అవుతుంది.
అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుణ్య స్థలిలో ఎనిమిది దిక్కులలో కొలువై ఉండి, బ్రహ్మోత్సవాల విజయవంతంలో అష్ట దిక్పాలకులదే ప్రధాన పాత్ర. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అనేవి నాలుగు దిక్కులు. ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం అనేవి నాలుగు మూలలు లేక నాలుగు విదిక్కులు. ఈ ఎనిమిదింటిని కలిపి అష్ట దిక్కులని పేరు. ఈ అష్టదిక్కులకు పాలకులైన వారికి సంబంధించిన విశేషాలు…
అష్ట దిక్పాలకులకులలో ప్రథముడు ఇంద్రదేవుడు: ఇంద్రుడు దేవతలకు రాజుగా వేదాల్లో కీర్తించ బడ్డాడు. ఇతను తూర్పు దిక్కునకు అధిపతి. అదితి కుమారుడు. ఇతని భార్య శచీదేవి. ఆయుధం వజ్రం. వాహనం ఐరావతం. నివాసం అమరావతి పట్టణం. పాలసముద్రంనుండి పుట్టిన ఐరావతమనే ఏనుగును, ఉచ్ఛైశ్రవమనే గుఱ్ఱమును ఇతడు గైకొన్నాడు.
అగ్నిదేవుడు: అగ్ని పంచ మహాభూతాల్లో ఒకడు. ఆగ్నే యాధిపతి. తేజస్వి. సప్త హస్తములు, చతుశ్శృంగములు, ఏడు నాల్కలు, రెండు శిరములు కలిగి శుభ్రమైన చిరునవ్వులు “చిందించు స్వరూపం కలవాడు. ఇతని తండ్రిపేరు వైశ్వా నరుడు. తల్లి శుచిష్మతి. భార్య స్వాహాదేవి. ఆయుధం శక్తి. వాహనం పొట్టేలు. నివాసం తేజోవతి పట్టణం.
యమదేవుడు: యముడు పితృగణాధిపతి. దక్షిణ దిగ్భాగమున పరిపాలన ఇతనిదే. ఇతని తండ్రి సూర్యుడు. తల్లి సంజ్ఞాదేవి. భార్య శ్యామలా దేవి. ఆయుధం దండం. వాహనం మహిషం. నివాసం సంయమని పట్టణం.
నిరృతిదేవుడు: నిరృతి నైరుతి దిక్పాలకుడు. లోకాధి పతి. సత్పురుషుడు. కీర్తిమంతుడు. భార్య దీర్ఘాదేవి. ఆయుధం కుంతము. వాహనం నరుడు. నివాసం కృష్ణాంగన పట్టణం.
వరుణ దేవుడు: యజ్ఞ సమయాల్లో హవిర్భాగములను ఇవ్వడానికి ఆహ్వానింపబడే వరుణుడు పశ్చిమ దిక్పాలకుడు. జలాధిపతి. ఇతని తండ్రి కర్దమ ప్రజాపతి. భార్య కాళికాదేవి. ఆయుధం పాశము. వాహనం మొసలి. నివాసం శ్రద్ధావతి పట్టణం.
వాయు దేవుడు: వాయువు పంచ భూతాలలో ఒకరు. సర్వ వ్యాపకుడు. మహా బలవంతుడు. వాయవ్య దిశకు అధిపతి అయిన ఇతడు జీవకోటికి ప్రాణాధికం. ఇతని భార్య అంజనాదేవి. ఆయధం ధ్వజం. వాహనం జింక. నివాసం గంధవతి పట్టణం.
కుబేర దేవుడు: కుబేరుడు సకల దేవతాప్రియతముడు. ఉత్తర దిక్కునకు అధిపతి. ధనపతి. భాగ్యశాలి. కుబేరుని తండ్రి విశ్రవోబ్రహ్మ. తల్లి ఇలబిల. భార్య చిత్ర రేఖాదేవి. ఆయుధం ఖడ్గము. వాహనం గుఱ్ఱం. నివాసం అలకాపురి పట్టణం.
ఈశానుడు: సాక్షాత్తు ఈశాన్యాధిపతి పరమ శివుడు. జగదంబ పార్వతీదేవి ఇతని భార్య. ఆయుధం త్రిశూలము. వాహనం వృషభము. నివాసం యశోవతి పట్టణం. పార్వతీ పరమేశ్వరులకు ఆదిదంపతులని ప్రతీతి. శంకరుడు కోరినవారి కోరికలు కాదనకుండా నెరవేర్చడం చేత ఇతనికి బోళాశంకరుడని పేరు. మహాశక్తి మంతుడు. త్రిమూర్తులలో ఒకడు. సర్వస్వతంత్రుడు. భూత గణ సంసేవితుడై, తృటిలో భస్మం చేసేశక్తిగల మూడవ కన్నును కల్గిన ఇతడు లయకారకకర్త. కైలాసం ఇతని నివాసం. అష్టదిక్పాలకు లందరినీ కూడా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో స్మరించడం పుణ్యప్రదం.
రామ కిష్టయ్య సంగన భట్ల
రచయిత-9440595494