“నరం లేని నాలుక’’
నిజంగానే నరం లేని నాలుక
నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది..!!
శబ్దాన్ని పుట్టిస్తుంది..!!
మెలికలు తిరుగుతూ..
మడతలు పడుతూ..
నాల్గు దిక్కులూ..
చక్కర్లు కొడుతుంది..!!
పుకార్లు పుట్టిస్తుంది..!
షికార్లు కొట్టిస్తోంది..!
అంతాతానై పలుకుతూ…
మాటల మంత్రగాడిని
తలపిస్తుంటుంది…!!
నోరు అదుపుతప్పితే
కల్లోలమే…!!
ఆ పలుకే బంగారమయితే..
బ్రహ్మాండమే..!!
కాళ్ళు జారినా పరవాలేదు..
గానీ..నోరు జారితే
వెనిక్కి తీసుకోలేమన్న
నానుడి లోకవిదితమే..!!
షడ్రుచులెరిగిన నాలుక…!
వసపిట్టలా మాటలు నేర్చిన నాలుక..!
మౌనానికి విముక్తి కల్గించే నాలుక…!
మధురభాషణంతో మనఃశాంతినిచ్చు నాలుక..!!
నాలుక రణరంగాన్ని సృష్టించగలదు..
ఆనందాన్నీ అందరికీ పంచగలదు..
అగాధమైనా..అద్భుతమైనా
నాలుక కే సాధ్యం!!
మౌనతపస్సుకు ఆ నాలుకే
ఓ..విజయపతాకం..!!
ఆత్మీయతకు ఆలవాలం
నాలుక…!
విరుపుమాటల్తో పోట్లు
పొడిచేదీ ఆ నాలుక…!
ఆ మాటకు సాటిలేదు…
ఆ ఘనతకు తిరుగులేదు…
జిహ్వ చాపల్యం…
ఓ అనిర్వచనీయ
అనుభవైక రసకందాయం..!!
గాయకుడి గళానికి
నాలుకే ఓ స్వరాయుధం..!!
కవి నాలుకే సరస్వతీ నిలయం..!!
ఆనాలుక లేని జగతి అంతా
నిశ్శబ్ద ప్రణవనాదం..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801