ఉరికిచ్చి కొడతాం…
“ప్రశ్నిస్తే వదలం’
(కథనం).
అనంగనే దక్షిణ కాశీగా పేరు ఉండే. ఎప్పుడు సందడిగానే ఉంటది. ఓ దిక్కు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు. ఏవల భక్తి వాళ్లది. ఎవల బాధలు వాళ్ళయి. చెక్కపల్లి చౌరస్తా దాటి కొంచెం ముందుకు పోతే లడ్డు హోటల్. ఎప్పుడో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన కుటుంబం. ఇప్పుడు లడ్డు హోటల్ కూడా వేములవాడ జనజీవనంలో భాగమైపోయింది. లడ్డు హోటల్ లో కూసోని మావోడు ఆనంద్ కోసం ఎదురుచూస్తున్నా.
వాడు విలేఖరి వానితోని పని పడ్డది. మల్లారం దగ్గర ఉన్న ఆడ్నే ఉండు వస్తున్న అని చెప్పినుండే. ఎట్లాగూ వాడచ్చేటళ్లకు టైం పడుతుంది. మనసునా పట్టక అటు ఇటు చూసిన. చేతులు మారి మారి వచ్చిన న్యూస్ పేపర్ కనిపించింది. చూడంగానే ఉరికించి కోడుతం అన్న వార్తా కనిపించింది. మెల్లగా చదువు సరువు చేసిన. అడిగిన అడగక పోయిన బొచ్చేడు పనులు జేసినమ్. ఏ రాష్ట్రంలో నన్న రైతుబంధు ఇస్తున్నారా. కెసిఆర్ తిర్గా ప్రాజెక్టులు కటిండ్రా..అసోంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా ఉకునేది లేదు ఉరికించి కొడతాం అని వార్త కథనం సారాంశం.చదువుతుంటే ఎన్నో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నై. తెల్లారి లేవంగానే మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటోళ్లు ఇట్లా ఎందుకు అంటుండ్రని ఆలోచనల పడ్డా. వీళ్ళు గింత కోపానికి వచ్చుడెందో అర్థం కాలే. తిట్టినోళ్ళు సామాన్యులు కాదాయే. రైతుబంధు సమితి చైర్మనాయే ఎంత గట్టిగా మాట్లాడితే పెద్ద సార్ అంత మెచ్చుకుంటాడు అనుకున్నాడో ఏమో రైతు స్వరాజ్య వేదికోళ్లు చెబుతున్న లెక్కలు తప్పని సొంత లెక్కలు చెప్పుకొచ్చే. ఇవరికోసారి కూడా గిట్లే కోపానికి వచ్చిండు.మళ్లీ ఇప్పుడు గరం ఐతుండు. సమస్యలను అర్థం చేసుకొని పెద్ద సార్ కు చెప్పాల్సింది పోయి సమస్యలు చెప్పినొల్లను ఉరికించి కొడతా అంటుడు. ఇసుంటోళ్లకు పదవులు ఎట్లా ఇస్తారో ఎంత ఆలోచించినా అర్థం కాలే. ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నా ఎక్కడన్న యవుసం చేసేటోళ్లకు రైతుబంధు ఇస్తే మంచిదే. సారేమో పాస్ పుస్తకం ఉన్నోడికే ఇస్తాం అనే .ఎక్కడన్నా కిరాయికి ఉన్నోడికి ఇస్తామా ఓనర్లకే ఇస్తామని భాజప్త చెప్పే. కిరాయికి ఉన్నోళ్లకు ఎట్లిస్తం అని ఎక్కిరించే. 20 గుంటలో ఎకరమో 5 ఎకరాలు ఉన్నోళ్లకు ఇస్తే మంచిగనే ఉండు. వందల ఎకరాలన్నోడు ఎక్కడన్నా యవుసం చేస్తాడా. ఓ దిక్కు పెద్ద పెద్దోళ్లకు మంత్రులకు ఎన్నారైలకు రైతుబంధు పైసలు పడుతున్నాయని అందరికీ తెలిసిందే నాయే. ఇట్లా ఆలోచనలన్నీ నా చుట్టూ తిరుగుతున్నై.. మీదికేళ్లి చూస్తే రైతుబంధు, ధరణి పథకాలు మంచిగానే కొడుతున్నట్టు అనిపిస్తది. లోపలికి పోయి చూస్తుంటే తేడాగా కనిపిస్తుంది. పేపరు పక్కన పడేసిన.
ఇంతట్లనే మావోని సోపతోళ్లు వెంకటేష్, శ్రీకాంత్ ఇద్దరు వచ్చిండ్రు. మావోనితోని తిరుగుట్ల వేములవాడలో ఉన్న విలేకరులు చాలామంది సోపతైండ్రు. నన్ను చూసుడు తోనే పలకరించిండ్రు. చాయి చేపుతుంటే ఇప్పుడే తాగిన అని చెప్పిన. వాళ్ల మందం చెప్పుకొని ముచ్చటల్ల పడ్డారు. సేవ్స్ అవినీతి మీద కాంగ్రెసొల్లు ధర్నా చేసిన వార్త స్క్రిప్టు కొడుతుండు వెంకటేష్. అయిపోగానే మొన్న జరిగిన ఎన్నికల గురించి నాతోని ముచ్చట్లు కలిపిండ్రు. ఎన్నికల రిజల్ట్ రోజు జరిగిన పరిస్థితులపై మాట్లాడుతున్నారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు డైరెక్ట్ ప్రకటించుకుంటే అయిపోద్ది కదా అన్నాడు వెంకటేష్. అట్ల ప్రకటించుకుంటే కదా కొందరు కోర్టుకు పోయి ఓట్ల దాకా తీసుకొచ్చిండ్రు. ఏమైంది నోట్లు పాయె ఓట్లు పాయె సీట్లు కూడా పాయె. ఇప్పుడు సహకారచట్టాలు ,ప్రజాస్వామ్యం అని మొత్తుకుంటే ఏమొస్తాధి. గుత్ప ఉన్నొందే గుర్రం అన్న సామేత విన్నవ్ కదా ఇప్పుడు అధికారంలో ఉన్నో ల్లదే చెల్లుతది అన్నట్టు. అని వెంకటేష్ చెప్పుకుపోతుంటే అట్లే బీరిపోయి చూసిన.
ఇంతట్లోనే మావోడు రానే వచ్చింది. నేను మెల్లగా లేచి మవోని బండిమీద కూసున్న. బండి కలెక్టరేట్ వైపు దూసుకుపోతుంది. సంగీత నిలయం దాటి ముందుకు పోతుంటే ములవాగు మీద కట్టిన చెక్ డ్యాం, వైకుంఠధామం ఓపెన్ జిమ్ ఇట్లా దృశ్యలన్ని మమ్మల్ని దాటుకుంటూ వెనక్కి వెలుతున్నై. బ్రిడ్జిని దాటుతుంటే ఓ పక్కకు ఇంకా పూర్తికాని బిర్జి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నమూన అన్నట్లు గా అనిపించింది. మావోడు అందుకున్నాడు . ఎమ్రా బ్రిడ్జిని బాగా చూస్తున్నావ్. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు ఎరకైతుంది. అది ఏ టైంకు కవాల్నో ఆ టైం కే అయితది అంతేగాని నువ్వు మాత్రం ఇక సప్పుడు చేయకు అని నవ్వుకుంటా అన్నాడు. ముచ్చట్లు పెట్టుకుంటా ముందుకు పోతున్నం. తిప్పాపూర్ బస్టాండ్ దాటి ముందుకు పోతుంటే కొత్తగా కట్టిన సర్కార్ దవఖాన కొంచెం ముందుకు ముందుకు పోతే మద్య మానేరు నిర్వాసిల కోసం ఏర్పాటుచేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు. అట్లా ముందుకు పోతుంటే అగ్రహారం దగ్గర ఓ దిక్కు కరిగిపోతున్న గుట్ట మరో దిక్కు కొన్ని పందల ఏకారాల భూమి కుంభకోణం మీద వచ్చిన వార్తలు చదివినట్టు యాదికొచ్చింది. ‘తేరువు’ను కోల్పోయి కాంక్రీట్ జంగల్ గా మారిన ఊరు ఎందుకో దర్జాగా వెలిగిపోతున్న ఆ బంగ్లాల చుట్టూ కనిపించని దుఃఖంమేదో నాకు లీలగా వినిపిస్తున్నట్లు అనిపించింది. 20 ఏళ్ల కింద ఈ ప్రాంతమంతా ప్రకృతి అందాలతో పలకరించేది ఇప్పుడు అభివృద్ధి పేరా ఆవిరవుతూ ధ్వంసంమైపోతున్న విషాద దృశ్యమై మిగిలినట్లు అనిపిస్తుంది. అట్ల ముందుకు పోతుంది పాలిటెక్నిక్ ముంగట వేసిన మిషన్ భగీరథ శిలాఫలకం కనిపించింది. గొప్పగా ప్రచారం చేయబడుతున్న భగీరథ పథకానికి అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లు నిర్వహణ ఖర్చులు భారంగా మారినట్లు నిపుణులు చెబుతున్నట్లు మావోడు ఓసారి మాటల సందర్భంగా అన్న ముచ్చట్లు యాదికొచ్చినయ్.
అట్లా ముందుకు పోతుంటే రగుడు చౌరస్తా వచ్చింది. ఫస్ట్ బైపాస్ , సెకండ్ బైపాస్. మధ్యలో కెళ్ళి సిరిసిల్ల కామారెడ్డి రోడ్డు. మరో దిక్కు కలెక్టరేట్ కు పోయే రోడ్డు కలెక్టరేట్ స్వాగతం పలుకుతున్న కమాన్ . కమానుకు కుడివైపున మెరిసిపోతున్న అధికార పార్టీ ఆఫీసు ఫంక్షన్ హాల్ అన్నీ కలిపి ఉన్న పెద్ద నిర్మాణలు. అట్ల ముందుకు పోతుంటే చంద్రవంక చెరువులో మోల్చినట్టు గంభీరంగా కనిపిస్తున్న కలెక్టరేట్ సముదాయం. మా బండి ముంగటికి పోతున్నది. బండిని కలెక్టరేట్ ముందు పార్క్ చేసి వారి నువ్వు బండికాడ్నే ఉండు. నేను విషయం తెలుసుకోని వస్తానని లోపలికి పోయిండు. అప్పుడు ఒకరు ఇప్పుడోకరు వచ్చిపోతున్నారు. చేసేదిలేక బండి కాడ నిలబడి ఓసారి చుట్టూ చూసిన. పెద్ద జాతీయ జెండా చుట్టూ ఉన్న పరిస్థితులలో సంబంధం లేనట్టు రెపరెపలాడుతుంది. రకరకాల మొక్కలు. మొక్కలకు నీళ్లు పడుతున్న సిబ్బంది. కలెక్టరేట్ ముందు కూసోని దిగులుగా దిగులుగా చూస్తు వేరువేరుగా ఉన్న రెండు మనుషుల కాంస్య విగ్రహాలు. ఆ విగ్రహాలను చూస్తుంటే ఎందుకు నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది. నాలో నేనే నవ్వుకున్నా. లడ్డు హోటల్ లో చదివిన వార్త యాదికి వచ్చింది. మల్ల ఆలోచనలు అటు దిక్కు పోయినాయి. రైతు స్వరాజ్య వేధికొల్లు చేసిన సర్వేల విషయం సోషల్ మీడియాలో చూసిన. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితుల మీద చెప్పిండ్రు. రైతుల మేలుకోసమే వందల కోట్ల రైతుబంధు ఇస్తున్నామని సర్కారు చెప్పబట్టే. అవి ఏవ్వల జేబులకు పోతున్నాయో ఇప్పుడు సర్వే తోని అందరికీ తెలిసే. తెలంగాణ రాష్ట్రంలో 35 40% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు. ప్రతి ముగ్గురి లో ఒక కౌలు రైతు ఉన్నాడని నివేదిక చెప్పబట్టే కెసిఆర్ వచ్చిన 8 ఏళ్ల 7వేల మంది పైగా రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికల ఆధారంగా లెక్కలేసి చెప్పిరి. కిరాయికున్నోల్లకు మేము ఎట్లా రైతుబంధు ఇస్తాం అన్న కేసీఆర్ సార్ మాటలు యాదికొచ్చి నుందే. కాళీ భూములకు రైతుబంధు దొబ్బెటోళ్లు భూములు కౌలుకు ఇచ్చుకొని రైతుబంధు క్రాప్ లోన్లు తీసుకొని అవి కౌలు రైతులకే అప్పులు ఇచ్చేటోళ్లు సర్కారుకు కనిపియ్యక పోవుడెందో ఎంత ఆలోచించినా సమాజ్ కాపాయే. రైతుల కంటే కౌలు రైతులకు కష్టాలు ఎక్కువ. దగ్గర దగ్గర 30 లక్షలకు పైనే కౌలు రైతులు ఉన్నట్లు నివేదిక చెప్పబట్టే. అప్పట్లో కేంద్రం కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన భద్రత కార్డులు ఇట్ల అనేక విషయాలు నివేదిక లో చెప్పినుండిరి. 40% పైగా రైతుబంధు సాగు చేస్తున్న వాళ్లకు కాకుండా పాస్ పుస్తకాలు ఉంటే చాలు వాళ్ళ ఖాతాలకు పోవట్టే. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే భూమి కౌలుకు తీసుకుంటే పండించిన ధాన్యం డబ్బులు కూడా ఆఖరికి భూములున్నోని ఖాతాలనే పడవట్టే.. నిజంగా సాగు చేసి అన్నం పెడుతున్న కౌలు రైతుల గురించి సర్కార్ కు ఎందుకు పట్టకుండా పోయినట్టు. రైతుబందో బంధువుల బందో సమాజ్ కాకుండా ఆనిపించింది. అంతెందుకు నా పరిస్థితి కూడా అంతేనాయే. రంగారావు దొర దగ్గర మూడు ఎకరాలు కౌలుకు తీసుకుంటి . అన్ని ఆయన ఖాతాల్నిబడే
మిత్తి అసలు కౌలు అనుకుంటా లెక్కలు చెప్పు కొచ్చే. మల్ల కష్టాలు తిరిగి తిరిగి రావట్టే. ఇవన్నీ కండ్ల ముందు తిరుగుతున్నై. మనసంతా కనిపించని దుఃఖం ఏదో పోయినట్లు అనిపించింది.
ఇంతట్లోనే మావోడు ఆఫీసులకెళ్ళి రానే వచ్చింది. వారి సార్ తోని మాట్లాదిన. కోర్టుకు పోవుడు తప్ప వాళ్ల చేతిలో ఏమీ లేదని చెప్పిండు. నీ భూమి సంగతి తేలే వరకు ఉన్న ఎకరం కూడా పోయేటట్టు ఉన్నది అని నవ్వుకుంటా అన్నాడు. నీ ఒక్కనికే కాదు ఇప్పుడు ధరణి సమస్యలపై పది లక్షల పైన ఫిర్యాదులు ఉన్నట్లు అధికారికంగానే లెక్కలు చెబుతున్నాయి. అనుకుంటా బండి తీసిందు. తరతరాలు గా సాగు చేసుకుంటున్నా భూమి నాలుగేకరల్లో ధరణి దెబ్బకు ఒక్క ఎకురమే ఉన్నట్టు చూపియబట్టే .అప్పటిసంది అధికారుల తిరగనే వాడితి.. చేసేదేమీ లేదా బండిమీద కూర్చున్న. వారి నువ్వేం రండి పడకు వేములవాడ మన సొపతోల్లు వకీళ్లు ఉన్నారు. ఏవలోఒకళ్ళతో మాట్లాడి చెప్తా పోయి కలువు అనుకొచ్చిండు. అట్లా ముచ్చట్లు చెప్పుకుంటా తిరుగు ప్రయాణం ఐతున్నం. హుందాగా నిలబడిన బహుళ అంతస్థుల కలెక్టరేట్ భవనం ముందు దినంగా కుసున్నట్టున్న ఆ కాంస్య విగ్రహాలు ఎందుకో నన్నే గోసోలే చూస్తున్న చూపులు మనసును మేలిపెడుతున్నట్టు అనిపించింది. అట్లా కలెక్టరేట్ నుండి బయటపడి ముందుకు సాగుతున్నం. కలెక్టరేట్ కమాన్ ముంగాట భారీగా మోహహరించిన పోలీసులు పొడు రైతులకు హాక్కుపత్రాలు ఇవ్వాలని జరుగుతున్న ఆందోళన .రైతులు పోలీసులతోని వాదనకు దిగుతున్నారు. పోలీసులు రైతులను, నాయకులను వాహనంల్లోకి ఎక్కించి తీసుకుపోతున్నారు. మావోడు నన్ను చూసి చూసినావురా ఇప్పుడు గిట్లనే నడుస్తుంది అని నవ్వుకుంటా అన్నాడు. నాకెందుకో లడ్డు హోటల్లో చదివిన వార్త యదికొచ్చింది ఉరికిచ్చి కొడతం అని అంత గట్టిగా ఎట్లా చెప్పిండ్రో ఇప్పుడిప్పుడే సమజైతుంది. ప్రశ్నిస్తే వదలం అన్నట్టున్న ఇక్కడి పరిస్థితులు పరిష్కారం కోసం ఎక్కడ వెతకాల్నో అన్న ఆలోచనలు నా చుట్టూ ముసురుతున్నై…..
(పేర్లు కల్పితం పరిస్థితులు యదార్థం)
ఆల్లె రమేష్,జర్నలిస్ట్.
సెల్.9030391963.
పొద్దుగాల.17.01.2023