Header Top logo

Alisetti Prabhakar’s life సమరమే అలిసెట్టి ప్రభాకర్ జీవితం

Alisetti Prabhakar’s life
సమరమే అలిసెట్టి ప్రభాకర్ అంతిమ చిరునామా

జననం..వర్థంతి ఒకే రోజు.(జనవరి 12 వతేదీ)
బతికింది 39 సంవత్సరాలే…!!

మరణం ఆయన చివరి చరణం కాదు…!!
పావుశేరు బియ్యానికి కూడా ముఖం వాచేది..!!
దేవుడి గుళ్ళకు తాళాలెందుకు ? మనుషుల
మీద నమ్మకం లేకనా ?

లైఫ్ ని బ్యూటిఫుల్ పెయింటింగ్ గా మార్చుకో
కోడానికి అట్రాక్టివ్ కలర్ “ రెడ్ “.!!

గరీ “బోడి “ గుండు మీద మండే ఎండ లాంటిది
గవర్నమెంటు.!!

*అలిశెట్టి కవిత్వం మట్టివాసనతో పరిమళిస్తుంది!!

అలిశెట్టి జీవితం “ రాయని వీలునామా “..
ఆయన కవిత్వం “ చరిత్ర చెప్పని గణితం “ !!

మరణం నా చివరి చరణం కాదు…
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం
నా అశ్రు కణం కాదు

Alisetti Prabhakar's life

యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం

సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారధ్యం చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను హిట్లర్లూ హిరణ్య కశిపుల ధ్వంసం నేను ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం…అణ్వస్త్రం శత్రువు నా పాదధూళి “.

(మరణం నా చివరి చరణం కాదు )

సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమరమే తన అంతిమ చిరునామా “,గా బతికిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. నవతరంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కవి. సంపాదన కోసమో? పేరు కోసమో కాక,కేవలం ప్రజలకోసమే బతికిన కవి అలిశెట్టి ప్రభాకర్. తన కవిత్వాన్ని ప్రజలకోసం వదిలేసి,తను మాత్రం శాస్వతంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు .తన కవిత్వంతో మనముందు పునర్జన్మ ఎత్తాడు. Alisetti Prabhakar’s life

మూస ధోరణికి ముద్ర పడని కవి. అతని కవిత్వం కూడా అతని లాగే అతి నిరాడంబరంగా అంబరానికి దూరంగా, నేలమీద వుంటుంది. పాఠకులకు అర్థం కాని అలంకారాలు, గిలిగింతలు పెట్టే ద్వంద్వార్థాలు ,చమత్కారాలు ,ఏమీ లేని సాదా సీదా కవిత్వం. మరి అలిశెట్టి కవిత్వంలో వున్నదేమిటి?

కణకణమండే నిప్పుల కొలిమి,పేదలను పీక్కుతినే రాబందుల రెక్కల చప్పుడు, 💓 గుండె నిండా బాధ
కళ్ళనిండా నీళ్ళున్న నిరుపేదలు, సౌందర్య సౌధం , కాలి మిగిలిపోయిన బూడిద,తాడితులు,పీడితులు
వేశ్యలు..మోసపోయి అణగారిన జనం ఆర్తి.అలిశెట్టి కవిత్వంలో కవితావస్తువులు. మనసుంటే….మన కళ్ళముందే ఆయా పాత్రల నిలువెత్తు రూపాలు కనబడతాయి.

*”తను శవమై
ఒకరికి వశమై

తనువు పుండై
ఒకడికి పండై

ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై “(వేశ్య )

నిఖార్సైన ,నిక్కచ్చి కవిత్వానికి ఇంత కంటే ఉదాహరణ కావాలా? ప్రతీ పదం..ప్రతీ అక్షరం ఆచి తూచి కాకుండా సహజంగా అమరింది.ఎక్కడకూడా అవసరంలేని ఒక్క అక్షరం కూడా లేదు. క్షరం కానిది అక్షరమైతే… అలాంటి అక్షరాల పూజారి అలిశెట్టి. అక్షరాలను మండించడం, అన్యాయాల్నిఎండగట్టడం అలిశెట్టికి తెలిసిన ఒకే ఒక విద్య. అందుకే పేదవాడిగానే మిగిలిపోయాడు. జబ్బులతో పేదరికం గబ్బుతో అర్థాంతరంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.కవిత్వంగా బతుకుతున్నాడు.జీవితాన్ని జీవితంలాగానే ఆవిష్కరించిన సహజ కవిత్వం సామాజిక కవిత్వం అలిశెట్టిది.

Alisetti Prabhakar's life

*అలిశెట్టి జీవితం…!!
(12.1.1954 ….12.1.1993 )

కరీంనగర్ జగిత్యాల బిడ్డ అలిశెట్టి. కవిగాక ముందు చిత్రకారుడు.పత్రకల్లో పంగలకి,ప్రకృతి,సినీనటుల బొమ్మలు వేసేవాడు.జగిత్యాలలోని సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలో ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రభూమి దినపత్రికలో తొలి కవిత “పరిష్కారం “అచ్చయింది.

బతుకు తెరువుకోసం జగిత్యాలలో “ స్టూడియో పూర్ణిమ “ కరీంనగర్ లో “ స్టూడియో శిల్పి “,హైదరాబాద్ లో “ స్టూడియో చిత్ర లేఖ “ ను ప్రారంభించాడు ఫోటోగ్రాఫర్ గా ఎదిగాడు. అయితే ,డబ్బు సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వలేదు.పైసలు వెనకేసుకోలేదుకళ కళకోసం కాదు..ప్రజలకోసమంటూ నమ్మాడు.పనిలో పనిగా కవిత్వం రాస్తూ కవితా సంపుటాల్నివెలువరించాడు.

ఎర్ర పావురాలు..(1978), మంటల జెండాలు చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావివ(1989) సంక్షోభ గీతం (1990) సిటీ లైఫ్ (1992): అచ్చయిన కవితా సంపుటాలు. చిత్రం ఏమంటే జనవరి 12 వతేదీన జనం…మళ్ళీ అదేజనవరి 12 వతేదీన మరణం సంభవించడం చిత్రమే.(జననం..వర్ధంతి ఒకేరోజు ) తాను39 యేళ్ళుమాత్రమే‌ బతికాడు. మరికొంత కాలం బతికివున్నట్లయితే మహాకవి అయ్యేవాడే.దురదృష్టం .తెలుగు సాహిత్యం ఓ మంచి కవిని అర్థాంతరంగా కోల్పోయింది. 2016లో అనుకుంటా పదోతరగతి తెలుగు,ఇంటర్ ద్వితీయభాష వాచకాల్లో అలిశెట్టి కవితల్ని
పాఠ్యాంశాలుగా పెట్టారు.

శ్రీ శ్రీ గారు “ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరని “ ప్రశ్నిస్తే ? ”పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనావాడు చుడితేనే శ్రీకారం వాడు కడితేనే ఆకారం “ అని అలిశెట్టి చెప్పాడు
(పాఠ్యాంశ కవిత )

బాధితుల పక్షాన నిలిచి అక్షరాలను ఆయుధాలుగా మలిచాడు.ఆస్తిపాస్తుల నమ్మకం లేక,ఉన్న ఆస్తిని గొట్టుకున్నాడు.పేదరికంలో మగ్గాడు.ఇద్దరుపిల్లలు వాళ్ళగురించి కూడా ఆలోచించకుండా రాత్రింబవళ్ళు పేదలగురించి,బాధా సర్పదష్టులగురించే ఆలోచించేవాడు. కవిత్వంరాసేవాడు.పోరాడేవాడు.ఒక్కోసారి తినడానికి పావుశేరు బియ్యానికికూడా మొఖం వాచేదంటే అలాశెట్టి ఆర్థిక పరిస్థితిని ఊహించడం పెద్ద కష్టమేం కాదు.

కవిగా ఎంత క్రమశిక్షణ వున్నా ..వ్యక్తిగా కొన్ని బలహీనతలకు లొంగిపోయాడు.డబ్బునే కాదు. ఆరోగ్యాన్నీ దూరం చేసుకున్నాడు.ఓ వైపు పొగ..మరో వైపు ద్రవం..ఈ రెండూ కలగలిసి ఇంకో వైపు కోపం మనిషిని కుంగదీశాయి.మృత్యువు కాచుకుందని తెలిశాక కూడా జీవితాన్ని లక్ష్య పెట్టలేదు.చూస్తూ చూస్తూ వుండగానే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.తనకంటూ మిగుల్చుకున్నకవిత్వాన్ని మాత్రం‌ మన కోసం ఇక్కడే వదిలేశాడు.జయధీర్ గారు చెప్పినట్లు “ ప్రభాకర్ పునర్జన్మఅతని కవిత్వమే “..!!

”తెరవెనుక మృత్యువు
లీలగా కదలాడినట్టు
తెరలు తెరలుగా దగ్గు
గుండెల్ని పిండేస్తుంటే

తెగిన తీగెలు
సవరించడానికన్నట్టు
తెల్లవార్లూ పరిచర్యలు చేసే
నా భాగ్యమే
నా కన్నీళ్ళను తూచే
సున్నితపు హృదయత్రాసు

(హృదయత్రాసు )”
(భాగ్యం…అలిశెట్టి భార్య పేరు)

*దురదకూ గోకుడుకూ పుట్టేది కాదు. “ విప్లవం “.!!
దేవుడి గుళ్ళకు తాళాలెందుకు ?
మనుషులమీద నమ్మకం లేకనా ?ఇంత “ వైవిధ్యమున్న “ కవి అరుదుగా వుంటారు.

“ఎర్రపావురాలు “ అలిశెట్టి తొలి కవితా సంపుటి.‌ విచ్చుకోడానికి సిద్ధంగా వున్న మొగ్గలో పరిమళ సాంద్రత కాస్తంత తక్కువగానే వుంటుంది.ఓ సారి మొగ్గ విచ్చుకున్నాక పరిమళం‌ గుప్పుమంటుంది. అలాగే అలిశెట్టి కవిత్వం కూడా తొలి దశలోఔత్సాహిక కవులందరిలాగానే కవిత్వం కాస్తంత పలచగానే వుండింది. కొత్తగా కవిత్వం రాసే నవకవులకు ఇది సహజం కూడా.అయితే అప్పటికే తన కవిత్వం ఎవరి కోసం రాస్తున్నాడో? ఎందుకోసం . రాస్తున్నాడో ఓ స్పష్టమైన అవగాహన వుంది. ఏ కవైనా తాను ఎవరి పక్షం వహించాలో ‌ముందేతేల్చుకోవాలి. కవితా తను తాడిత,పీడిత, శ్రామిక పక్షమని నిర్ద్వందంగా ప్రకటించుకున్నాడు. అలాగే కవిత్వం రాశాడు.చివరి శ్వాస వరకూ రాస్తూనే వున్నాడు. Alisetti Prabhakar’s life

*విప్లవం….!!

“ఎర్ర పావురాలు “ కవితా సంపుటి శీర్షికగా పెట్టడంలోనే తన కవిత్వ జెండా..అజెండా ఏమిటో స్పష్టంగా చెప్పాడు

”దురదకూ
గోకుడుకూ
పుట్టేది కాదు విప్లవం

ఎన్నాళ్ళ నుంచో
పాతిపెట్టబడిన
రగిలే ఒక అగ్ని కణం
తాళ లేక ఒకనాడు
నెత్తురు విత్తనమై మొలకెత్తి
రేపటి సంగ్రామానికి
పెద్ద ఎత్తున
ఆయత్తమయ్యే సత్తా !!” (అంకురం )

నెత్తురు విత్తనం “ ఓ గొప్ప ప్రయోగం.శ్రీశ్రీ లాంటి మహాకవి కూడా ఈ ప్రయోగం జోలికి పోలేదు.

అలిశెట్టి ప్రయోగాల్లో ఇదో గొప్ప ప్రతీకాత్మక ప్రయోగం! విత్తనానికి మాత్రమే మొలకెత్తే లక్షణంవుంటుంది. విత్తనం మొక్కైమొలిచి, పెరిగి పెద్దై చెట్టై ఓనాటికి సమాజంలో ఎన్నాళ్ళనుంచో పాతిపెట్టబడిన ఒకనాటికి నెత్తురు విత్తనమై మొలకెత్తి రేపటి సంగ్రామానికి పెద్ద ఎత్తున ఆయత్తమయ్యే “ సత్తా “నే విప్లవం అంటాడు అలిశెట్టి. విప్లవాన్ని గురించి ఇంతకంటే ఎవరైనా ఏం చెబుతారు.!! ఈ కవి నాస్తికుడు.దేవుడి కంటే మనిషే. ముఖ్యమని నమ్మేవాడు.!

Alisetti Prabhakar's life

“వందసార్లు
దేవుడి దర్శనం
చేసుకునే బదులు
ఒక్కమారు
గారడి ప్రదర్శన చూడు
అక్కడి వృధా మొక్కులకంటే
ఇక్కడి ఒక్క ట్రిక్కన్నా
నీ మెదడ్లోకెక్కొచ్చు “ ( దర్శనాలు )

దేవుడి వృధా మొక్కులకంటే,గారడీ వాడి ట్రిక్కన్నా నేర్చుకోవడం మేలనడం అలిశెట్టి నాస్తికతకు అద్దం పడుతుంది.అంతేనా? దేవుళ్ళ మీద కూడా ‘ సెటైర్లు వెయ్యడానిక్కూడా ఈ కవి వెనకాడడు.

”దేవుడు తమ గుళ్ళకి రాత్రిళ్ళంతా
తాళాలు వేసుకుంటున్నారెందుకో
బహుశా మనుషుల మీద నమ్మకం పోయిందేమో “
(నిర్మొహమాటం )

అంటూ దేవుడి శక్తినో కూడా ప్రశ్నిస్తాడు.నిజంగా దేవుడే వుంటే..ఆయనకే మహిమలుంటే రాత్రిళ్ళు తన గుడికి తాళాలెందుకు? బార్లా తెరిచి వుంచొచ్చుకదా ! అన్నది కవి ఎత్తిపొడుపు.

సామాజిక స్పృహ..!!

అలిశెట్టి సామాజిక కవి. మనిషే దేవుడు.సమాజమే దేవాలయం గా భావించేవాడు.భావకవుల్లా ప్పుడూ నేల విడిచి సాముచేయలేదు.

‘‘ఈ తరం ,ఇదే ధరిత్రి పైన
ఆకలి చిలుము పట్టి
ఎన్ని అస్తిపంజరాలు
కుళ్ళి కృశించి పోతున్నాయో
నీ హృదయం మైక్రోస్కోపుతో
ఒక్కసారి పరిశీలించు ’’.!! …( చిలుం )

ఆకలి బాధ తెలిసిన వాడు కాబట్టే పేదల ఆకలిని కవిత్వం చేశాడు.ప్రతీ మనిషి తనహృదయాన్ని తట్టి సాటి పేదవాడి ఆకలిబాధను గమనించమంటున్నాడు ‘.ప్రకృతి శిశిరం కాదు.సమాజ శిథిలం చూడమంటున్నాడు. ప్రశ్న “ అనేకవితలో కొమ్మల్ని కాండాల్ని ,వేర్లను మధ్యతరగతి, సంపన్నులు,పేదలు, శ్రామికులకు ప్రతీకలుగా తీసుకున్నాడు.కొమ్మలు,కాండాలు బయటవుంటూ అహంభావం ప్రదర్శిస్తుంటే ? చెట్టుకు ఆధారమై,కాపాడే వేర్లమాటేమిటి ? అంటూ ప్రశ్నిస్తాడు.

పేదోళ్ళ పాట్లను ఎలా చెబుతున్నాడో చూడండి.

‘‘బజారులో
నిత్యావసర వస్తువు
వాడికి
అందని పాదరసం
అందుకే
వాడి గుడిసెలో
కాదు కాదు
ఆ గుండె గదిలో
మండుతోంది భాస్వరం ’’.!

బాధలకు మండుతున్న గుండెలు అనడానికి మండుతోంది “భాస్వరం “ అనడం కవి ప్రతిభకు నిదర్శనం. భాస్వరానికి త్వరగా మండే స్వభావం వుంది! “నువ్వో విత్తనానివి. మొలకెత్తే ముందు అలిసిపోయి చచ్చిపోకు. చచ్చిపోతూ బలవంతంగా మొలకెత్తకు లోలోపలే సమాధివైతే సయించదు మట్టికూడా..! వెలుపలికి కుతూహలంగా చొచ్చుకొస్తే…ఆకాశమంత ఎత్తున చూస్తావు.” అంటాడు.కానీ ఈ కవి మాత్రం సరిగా మొలకెత్తకముంద చనిపోయాడు.

గుండె మంటల వేడిసెగలే
“మంటల జెండాలు “ (కవితా సంపుటి)

అలిశెట్టి జీవితం “ రాయని వీలునామా “ ఆయన కవిత్వం “ చరిత్ర చెప్పని గణితం “ ఈ సంపుటిలో అన్నీ మినీకవితలే. అప్పటికి మినీ కవిత్వం ఓ ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది.మరో ముఖ్య విషయమేమంటే పత్రికలు కూడా స్థలాభావం వల్ల చిన్న కవితలనే ప్రోత్సహించడం అలిశెట్టి చేత చిట్టి (మినీ కవితలు రాయించింది.)మినీకవిత్వం..

వికాసం అని ఎవరైనా పరిశోధన చేస్తే ఈ విషయాన్ని తప్పక ప్రస్తావించాలి ) ఎందుకోగానీ.. అలిశెట్టి “మినీ “ కవిగా క్లయిమ్ చేసుకోశలేదు.మినీ కవిత్వ ఉద్యమంలో కూడా పాలుపంచుకోలేదు.అయినాపదికాలాలకు సరిపడ. “ మినీకవితలు “ రాశాడు.అందులో ఎన్నో ఆణిముత్యాలు. కొటేషన్లుగా కోట్ చేసే కవితాపాదాలకైతే లెక్కేలేదు.శ్రీశ్రీ గారి తర్వాత ఇలా ఎక్కువ గా కోట్ చేయబడిన కవి అలిశెట్టి ప్రభాకర్ అనడంలో ఎటువంటి సందేహమే లేదు.!

“శూన్యంలో నిశ్శబ్దంలా
నిశ్శబ్దంలో సమాధుల్లా
బతక్కండి

జ్ఞాపకాల రసి పుండ్లని
గోకటమే వ్యాపకంగా
చావకండి
నాతో రండి
సహనం సాహసం నిప్పుల మీద
కాలాన్ని ఫలంగా వండుకుందాం ! (నాతోరండి )

ఓ పక్క పేదరికం,మరోపక్క నైరాశ్యం ..అయినా ఆత్మవిశ్వాసం వీడని వ్యక్తిత్వం అలిశెట్టిది. “ జ్ఞాపకాల రసి పుండ్లు “ అన్న పదం వినడానికి అంత బాగోకున్నా..ఈ సందర్భంలో ఎంతో యాప్ట్ గా వాడాడు.” జ్ఞాపకాల రసి పుండ్లని గోక్కుంటూ. కూర్చోవడం కంటే సాహసంగా పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకుసాగుదాం “అన్న కవిభావన ఎంతో గొప్పది. స్ఫూర్తిదాయకం.

నీ శ్రమ ఫలం
నీ సమక్షంలోనే పాతిపెట్టబడ్డ
విత్తనం
దాన్నే డబ్బుగా పెంచి
దక్కించుకున్న వాడిదే పెత్తనం.

(చెమట వ్యాపారం )

పెట్టుబడిదారీ వ్యవస్థ స్వార్థపు వలయాల్నిఛేదించడానికి అలిశెట్టి చివరి శ్వాసవరకు పోరాడాడు.

శ్రీశ్రీ గారు

ఈ రాణీ ప్రేమపురాణం/ ఆ ముట్టడికైన ఖర్చులు / మతలబులూ,కైఫీయతులూ/ ఇవికావోయ్ చరిత్ర
పాఠం “ అన్నారు.!.( దేశచరిత్రల “ )

అలిశెట్టి “ చరిత్ర గురించి ఏమంటున్నాడో? ఎలా అంటున్నాడో చూడండి.

”చరిత్ర
వడ్డీ వ్యాపారస్తుడి
ఇనప్పెట్టెలోంచి పుట్టిందా?

లేక
వర్థమాన సినీతార
చనుమొనల్లోంచి మొలిచిందా?

లేక
రాజకీయ నాయకుడి
టోపీ కింద పొదగబడిందా
కాదు

చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం
చరిత్రకు చెమటబొట్టే ఆధారం
చరిత్రకు ఆకలే ప్రేరణ !! (చరిత్ర )

అలిశెట్టిలో వున్న గొప్ప గుణం ఒరిజినాలిటీ. తనకన్నా సీనియర్ల , లేకసమకాలీనులప్రభావం
ఏమాత్రం తనపై పడకుండా జాగ్రత్తపడ్డాడు! స్వయం భానుడికి ఇతర వెలుగెందుకు?

ఈ వృక్షం
నువ్వు ఉరి పోసుకోడానికి
వినియోగింపబడ్డది కాదు
స్వయం కృషిని
శాఖోపశాఖలుగా
విస్తరింప జేసుకొమ్మని “!!

ఇంత కంటే వెన్నుతట్టి భరోసా ఎవరివ్వగలరు.ఎవరు ఆత్మ విశ్వసాన్ని నింపగలరు

పేదలకోసం ఇంతగా క్షోభపడిన కవి వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.శ్రీశ్రీ కూడా “అంతేలే పేదలబతుకు
లు అశ్రువులే నిండిన కుండలు “ అన్నాడు.అలిశెట్టి ఇంకాస్త లోతుకు పోయి ఏమంటున్నాడో చూద్దాం.

“*ఇంత అన్నం ముద్దకోసం
కడుపే
దొక్కుపోయిన చిప్పలాగై
అరుస్తోంటే
ఈ బతికున్న అస్తిపంజరాన్ని
పోస్ట్ మార్టమ్ చేసినా
పేగుల్లో ఒక్క మెతుకూ
దొరికేట్టు లేదు

(ఊరవతల పారెయ్యండి )

ఈ కవి కవిత్వం పేగుల్నితెంచుకొని బయటకు వస్తుంది.ఎక్కడా చిన్ని కల్పనకు కూడా చోటుండదు.

”చురకలు “ కవితాసంపుటి.!!

సమకాలీన సమాజానికి అలిశెట్టి పెట్టిన తొడపాశం ఈ “చురకలు “.ఇవి ద్విపాద కవితలు.!

రాజకీయ నాయకుడి టోపీ అంటే ….?

“ఎన్నికల్లో
ఓట్లడుక్కునే చిప్ప’’ అంటాడు.

రాజకీయ నాయకులు చేసే శంకుస్థాపనలను ఎలాపోల్చాడో చూడండి.

*ప్రగతి వెంట్రుకలు మొలవని బట్టతల “!! అట. మబట్టతల పై వెండ్రుకలు ఎలా మొలవ్వో..అలానే శంకుస్థాపనలు వేసిన బండలకు మోక్షం కలగదు.

ఎన్ని డిగ్రీలుంటే.. ఏం లాభం? ఓ ఎమ్మెల్యేకు బామ్మర్ది అయితే చాలు.. అవకాశాలు దానంతటవే తన్నుకొచ్చేస్తాయి.
గుడి గురించి ఏమన్నడో చూడండి.

‘‘శనివారం అదొక షోరూం ’’!!

శనివారం గుడికి వెళ్ళడం ఆనవాయితీ. ఆరోజు గుడి జనంతో రద్దీగా వుంటుంది.షోరూంలకు జనం సరదాగా పోతారు. మరి గుడికి? రెండూ ఒకటే అంటున్నాడు. తిరుపతికెళ్ళొచ్చి గుండు తీరిగ్గా గాట్లు లెక్కబెట్టుకోవడం “ ఇది అందరిఅనుభవం లోని విషయమే.

వార్తాపత్రికల గురించి అలిశెట్టి సటైర్ చూడండి..!!

”మానభంగాలు,మర్డర్ కేసులే
వార్తా పత్రికలకు పుష్టికరమైన ఆహారం”!! ( పుష్టి )

తెల్లారే లేచి ఆబగా వార్తాపత్రికలు తెరిస్తే…మర్డర్లు మానభంగాలు,నేరాలు,ఘోరాల దర్శనమే తప్ప పాజిటివ్ వార్తలు భూతద్దంలో చూసి వెదికినా మచ్చుకు కూడా కనిపించవు.

అలిశెట్టి రాజకీయ కవిత్వం….!!

అలిశెట్టి రాజకీయాన్ని,రాజకీయ నాయకుల తత్వాన్ని కాచి వడబోశాడు.అక్షరాలతో .రాజకీయ రాక్షసత్వాన్ని,రాజకీయ నాయకుల అరాచకత్వాన్ని కళ్ళ ముందు నిలిపాడు.ఇలా రాస్తే ఏమవుతుందో? వాళ్ళేమైనా చేస్తారేమో?రాజ్యం కళ్ళెర్రజేస్తుందేమో? అన్న ఆలోచనగానీ,భయం కానీ లేకుండా తన మనసులో వున్నది వున్నట్లు రాశాడురాజకీయపు నగ్న
స్వరూపాన్ని కళ్ళ ముందు నిలిపాడు.

*”అయిదేళ్ళకోసారి
అసెంబ్లీలో మొసళ్ళు
పార్లమెంటులోకి
తిమింగలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషంకాదు
జనమే ..
ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం
విషాదం “!!

మన ప్రజాప్రాతినిథ్య చట్ట సభల్లో రౌడీలు,గూండాలు దుష్టులు, దుర్మార్గులు, రౌడీలు, కేడీలు. ఆర్థికనేరగాళ్ళు వెన్నుపోటుదార్లు, రేపిస్టులు,పన్నులు,రుణాల ఎగవేత దారులకు కొదవే లేదు.అది అసెంబ్లీ కావచ్చు, శాసనమండలి కావచ్చు,లోక్ సభకావచ్చు,రాజ్యసభ కావచ్చు.

ఫోరమ్ ఏదైనా…అక్కడ వుండేవాళ్ళలో ఎకచకువమంది తోడేళ్ళు,మొసళ్ళు, తిమిఃగలాలకంటే తకచకువేం కాదు.నిజానికి వాళ్ళ తప్పుకంటే వాళ్ళకు ఓట్లేసి గెలిపించి పంపుతున్నఓటర్లదే తప్పు ఓటర్లు జలాశయాలుగామారితే..మొసళ్ళు,తిమింగలాలు చేరక సాధు ప్రవృత్తిగల వాళ్ళు చట్ట సభల దరిదాపుల్లోకి కూడా రాలేరు కదా!…ప్రజాస్వామ్య “ఖూనీ “ రాగానికి పల్లవి,చరణాలు ప్రజలే అన్నది అలిశెట్టి నిశ్చితాభిప్రాయం Alisetti Prabhakar’s life

మరో కవితలో నాయకుల హామీలను గురించి ఏమంటున్నాడో చూద్దాం.!

వెన్నెముక తప్ప అంతాక్షేమమ.చూస్తుండగానే బోడిగుండుమీద వెంట్రుకలు మొలిచి ఉంగరాలు తిరగటమెంత అబధ్ధమో? ఎన్నికల్లో ‌‌వాగ్దానాలంతఅబద్ధ మంటాడు.గరీ “బోడి “ గుండు మీద మండే ఎండ లాంటిది గవర్నమెంటు అన్నది అలి
శెట్టి అభిప్రాయం. ప్రభుత్వాలుమారినప్పుడల్లా.. ప్రజలు నష్టపోవడం ఆనవాయితీగా మారింది.ఈ పాత..కొత్త ప్రభుత్వాల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు.పిల్లికి చెలగాడం (కొత్త ప్రభుత్వం ఎలుకకు ప్రాణ సంకటం (పాత ప్రభుత్వం!) ఆ తీరేందో మీరే… చూడండి.

‘‘పాత ప్రభుత్వాల్లో
చితికిపోయిన
ప్రజలు…
కొత్త ప్రభుత్వాల్లో
*”చితి “ కి
పోకుంటే చాలు”

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ తంతు బాగా నడుస్తోంది.అక్కడి ప్రజలు ప్రత్యక్షసాక్షులు.,పాత ప్రభుత్వం “రోత,” ..కొత్త ప్రభుత్వం “ కోత “ మధ్య రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు.రాష్ట్రం. (అ) రాజకీయంగా ‘చితి ‘కి పోతోంది.

మంత్రులకు చురక ఎలా పెట్టాడో చూడండి.!

‘‘రోజుకో
వాగ్దానాల
మృత శిశువుని
ప్రసవించే ప్రభుత్వానికి
మంత్రులే
మంత్రసానులు ’’!!

ఓటరు మహాశయుడ్ని ఏమంటున్నాడో చూద్దాం.

‘‘రాక్షసంగా ఎదిగిన
ఎన్నికల పాదాల
కింద
నువ్వెప్పుడూ
చీమవేరా!
ఓటరూ..!”

ఎన్నికల్లో నలిగిపోయేది ఓటరు. ఎదిగిపోయేది రాజకీయ నాయకుడు.అంతిమంగానష్టపోయేదీ ఓటరే ! రైళ్ళయినా. రాజకీయాలైనా.. పట్టాలు తప్పితే జనానికే జీవన్మరణ సమస్య. Alisetti Prabhakar’s life

అలిసెట్టి సిటీ లైఫ్ కవితలు..!!

1987నుండి 1993 వరకు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో “సిటీ లైఫ్ “ పేరుతో అలిసెట్టి ప్రభాకర్ ఎన్నో చిన్న కవితలు రాశారు. ఆరోజుల్లో వీటిని “మినీ “ కవితలన్నారు.నగరజీవనంలోని “నరకాన్ని “ కళ్ళకు కట్టినట్లుచూపాడు అలిశెట్టి. నగరంలోని కాలుష్యం గురోంచి ఏమంటున్నాడో చూడండి.

‘‘ఆధునిక మానవుడు
అన్యమనస్కంగా
పీల్చే నశ్యం
కాలుష్యం …!!

కాలుష్యం కోరలకు నగరజీవి ఎలా బలైపోతున్నాడో ఈ చిట్టి కవితలో చూపించాడు.

మన నగరాలు నరకానికి నకళ్ళు.. నగర జీవితం రంగుల కల కాదు..కళ్ళముందు కనిపించే ఖెయాస్ నగరంలో అటు పూరిళ్ళూ..ఇటు భవంతులూ సిటీలో జరిగే పెళ్ళి ఊరేగింపు (బారాత్ ) లో

“గుర్రమ్మీద వెలిగే
పెళ్ళి కొడుకుల్నే కాదు
పెట్రో మాక్స్ లైట్ల కింద
నలిగే
పేద తల్లుల్ని చూడు “

నగరంలో సంపన్నుల పెళ్ళిళ్ళలో “బారాత్ “ తప్పనిసరి. బారాత్ సాగినంత దూరం కూలమ్మలు పెట్రో మాక్స్ లైట్లను నెత్తిన పెట్టుకొని నడుస్తూనే వుంటారు.ఈ విషయాన్నేఅలిశెట్టి వ్యంగ్యంగా చెబుతున్నాడు.బారాత్ లో మనం చూడాల్సింది గుర్రంపై వున్న పెళ్ళికొడుకుల్నే కాదట…ఊరేగింపులో పెట్రోమాక్స్ లైట్లను నెత్తిన పెట్టుకునే పేద తల్లుల్నికూడా చూడమంటున్నాడు. సంపన్నుల అంతస్తులు సిమెంటుతో పైకి లేస్తాయి.

‘‘అంతస్తులు
ముస్తాబయ్యే వేళ
దట్టంగా పట్టించేది
సిమెంటే ..!!”

ఆలాగే సిటీలో … గుడిసెలే మేడల్ని కడతాయి. అయినా మేడలే గుడెసెల్ని కొడతాయి.స్లమ్స్ ను, మక్తాలను (పేదలు గుడిసెలేసుకొని వుండే మురికి వాడలు ) ప్రభుత్వంకూలుస్తుంది. అక్కడ అంతస్తులు లేస్తాయి.వాటిని కట్టేది కూడా …ఈ గుడిసెల్లోని కార్మికులే.

శ్రీ శ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల గురించి ప్రస్తావిస్తే… అలిశెట్టి ఏమంటున్నాడో చూద్దాం..!

‘‘పాలరాయి
రక్తం పీల్చేస్తుందనడానికి
ఒకే ఒక
చారిత్రక నిదర్శనం
తాజ్ మహల్ ’’!!

తాజ్ మహల్ లో పాల రాయే కాదు.దానికింద శ్రామికుల కష్టం కూడా వుందంటున్నాడు పాలరాయి శ్రామికుల రక్తం పీల్చింది.తాజ్ మహల్ గా చరిత్రలో నిలిచిపోయిందట.

‘‘గంటల తరబడి
చక్కెర కొరకు
క్యూలో నిలబడే
చీమలు
ప్రభుత్వాన్ని కుట్టలేవు
తట్టలేవు..!!”

చౌకడిపోల్లో (రేషన్ షాపుల్లో ) చక్కెరకోసం గంటల తరబడి నిల్చుండే చీమలు (పేదలు ) ఎప్పుడూ ప్రభుత్వాన్ని కుట్టలేవు!..తట్టలేవు.చలిచీమల చేత సర్పము చావదా సుమత అంటూ… సుమతీకారుడు చెప్పినా ఇక్కడ మాత్రం మినహాయింపు.రేషన్ కోసం నెల నెలా చౌకడిపోల ముందు గంటల తరబడి వేచివుండే పేదోళ్ళు ప్రభుత్వాన్పి నిలదీయలేరు. ప్రశ్నించనూ లేదు.

సూర్యుడే…..అతని ముఖచిత్రం !!
నిజమైన ప్రజాకవి….అలిశెట్టి ప్రభాకర్..!!

కొంత మంది కవుల దగ్గర “ సరుకు “ (కవిత్వం) లేకపోయినా,ప్రమోషన్ తో,పైరవీలతో వెలిగిపోతారు. కొంతమంది దగ్గర అసలు సిసలు సరుకున్నామరుగున పడిపోతారు.కాళోజి అలిసెట్టి,చెరబండరాజు ఈ కోవలోకి వచ్చే “ప్రజాకవులు. జనంతో కలిసి,జనం గాధలే తమ బాధలుగా అనుభవించి కవిత్వంరాశారు.కవిత్వం అంటే పైకి చూడ్డం కాదని కవుల చూపు ఎప్పుడూ నేల మీదే వుండాలనే తత్వం వీరిది. Alisetti Prabhakar’s life

ప్రతిభా వ్యుత్పత్తులన్నీ వుండీ కూడా మరుగున పడ్డ కవి అలిశెట్టి ప్రభాకర్. ఈ కవి భావావేశంకట్ట తెగిన వరదగోదావరి.ఒక్కో కవిత ఒక్కో ” మాస్టర్ పీస్.”కవిత్వం ఇలానే రాయాలి. అసలుకవిత్వమంటే ఇదే ‘ అనేరీతిలో రాశాడు. నిజమైన కవిత్వానికి “ రోల్ మోడల్ “ గా నిలిచాడు.

‘‘ఎన్నెన్ని
గాయపడిన ఉదయాల్ని
సంకలనంగా కూర్చినా

ఎవరెవరి
బాధామయ గాధల్ని
ఈ కలంతో జాలు వార్చినా

మిత్రుడా !
‌ నిరంతరం
సూర్యుడే నా ముఖచిత్రం ’’!!

పేదల బాధలు చూసి ప్రతీ ఉదయం గాయపడుతూనే వుంది.ఆ గాయపడిన ఉదయాల్నిసంకలనంగా మార్చడం, బాధామయగాధల్ని తన కలంతో చిత్రీకరించడం అలిశెట్టి దిన కృత్యం. అందుకే సూర్యుడే తన ముఖచిత్రం అంటున్నాడు. సూర్యుడు విప్లవానికి సంకేతం.అన్యాపదేశంగా “విప్లవం “ తన “ ముఖచిత్రం “( ఆదర్శం ) అంటున్నాడు.ఓ కవి అంకిత భావానికి,నిబద్ధతకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి?

‘‘పారదర్శకంగా కురుస్తున్న
రక్తవర్షం
చెమటనదిగా
రూపాంతరం చెంది
ప్రవహించడం
మీరెపుడైనా చూశారా ?

హరిత హరితంగా
నల్ల రేగడి నేలమీద
సృజియించిన
నాగళ్ళ లిపిని
మీరెపుడైనా చదివారా ?

కవిత్వంలో ఆకాశ కుసుమాలు,పండు “సలసల క్రాగే చమురా ? ఉష్ణరక్త కాసారం “ అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానం లో….అలిశెట్టి అందుకు ఏమాత్రం తీసిపోకుండా..పారదర్శకంగా కురుస్తున్న వర్షం చెమట నదిగా రపాంతరం చెంది ప్రవహిస్తోందంటాడు. కష్టజీవుల రక్తం చెమట నదిగా మారి ప్రవహించే దృశ్యాన్ని ఆవిష్కరించాడు.అంతేనా? నల్ల రేగడి నేలమీద ఆకుపచ్చదనాన్ని పులిమిప రైతు నాగళ్ళ లిపిని చదవ మంటున్నాడు.

కవిగా తన బాధ్యతేమిటో తెలిసిన వాడు అలిశెట్టి. సమాజమే క్షేత్రంగా అక్షరాలే విత్తనాలుగా,పేదల కన్నీరే నీటిగా పారించి,వాళ్ళ బాధల ఎరువు వేసి కవిత్వ సేద్యం చేశాడు. అందుకే అలిశెట్టి కవిత్వం మట్టివాసనతో పరిమళిస్తుంది.అతని కవిత్వ పంట పేదల కళ్ళల్లో ఆశల పూలు పూయిస్తుంది. భవిష్యత్తుకు చూపుడువేలై కొత్త దారి చూపిస్తుంది. Alisetti Prabhakar’s life

‘‘పిడికెడు మట్టిని
మైదానం చెయ్యగలిగిన వాన్ని
పిడిబాకును
కరవాలంగా మార్చలేనా

అనంతాకాశ క్షేత్రంలో
అక్షరాన్ని
సూర్యబింబంగా నాటగలిగిన వాన్ని
ఒక పోరాట కెరటాన్ని
యుద్ధ నౌకగా
తీర్చి దిద్దలేనా

చిందించిన నెత్తుటితో
చీకటి కోణాలన్నీ వెలిగించగల
యోధున్ని
గుండె.. గుండెకీ మధ్య
విప్లవ వారధుల్ని
నిర్మించలేనా ..” అంటున్నాడు.

ఖబద్దార్… కాచుకో.. శ్రమజీవులు ఒక్కటై తిరగబడతారు.వివ్లవ సైన్యమైనిన్ను మట్టుబెడతారంటూ.. పెట్టుబడిదారులను,శ్రమైక సౌందర్యాన్ని దోచుకుతినే బడాబాబులను హెచ్చరిస్తున్నాడు.విప్లవ శంఖాన్ని పూరిస్తున్నాడు.

‘అక్షరం కాలం చేతుల్లో ఎదిగి చరిత్ర భుజస్కంధాలకంది వచ్చే ఆయుధం ‘ అంటాడుఅలిశెట్టి. ధాన్యపు గింజ వొలిస్తే.. రైతు అస్తిపంజరం రాలిపడేదయనీయ దృశ్యాలు అలిశెట్టి కవిత్వంలో అడుగడుగునా వున్నాయి. జీవితాంతం కన్నీటి చారికనే కాలిబాట మీంచి నడుస్తున్న బాటసారికి వీడ్కోలు పలుకుతున్నాడు స్వచ్ఛందంగా స్వేచ్ఛాగాలులు పీల్చేందుకుమట్టి పొరని చీల్చుకొచ్చినమొక్కలా..మొక్కవోని సాహసంతో నిలవాలంటాడు అలిశెట్టి. Alisetti Prabhakar’s life

అలిశెట్టి పేదల బాధల్ని దగ్గరగా చూశాడు. తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశాడు.ఆయుధాన్ని అథ్యయనం చేశాడు.శ్రమ జీవుల స్వేదబిందువుల్నిఅపహరించే దోపిడిని అథ్యయనం చేశాడు.

బ్యాలెట్ పెట్టెనూ… బూటకపు ప్రజాస్వామ్యాన్ని అథ్యయనం చేశాడు.జ్వలించే అక్షరమయ్యాడు. ప్రజల గుండె గుండెకూ మధ్య వారథి కట్టాడు సూర్యుడ్ని ముఖచిత్రంగా చేసుకొని ముందుకు… నడిచాడు.ప్రజల కోసం కవిత్వం రాశాడు.ప్రజల కోసం బతికాడు. ప్రజాకవియై ప్రజల నాలుకలపై నిలిచాడు.!!

అలిసెట్టికి అక్షర నివాళులతో…!!

Abdul-Rajahussen-write

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking