కరోనా మహమ్మారిపై మన దేశం ఇంకా పోరాడుతోంది. కేసుల సంఖ్య తగ్గముఖం పట్టినప్పటికీ.. ఇంకా పూర్తిస్థాయిలో వ్యాధి నుంచి బయటపడలేదు. ఈ కరోనా కల్లోలం నుంచి కోలుకోకముందే.. గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మ్యుకోర్మికోసిస్ (Mucormycosis) అనే అరుదైన వ్యాధి.. అహ్మదాబాద్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అహ్మదాబాద్‌లో ఇప్పటికే 44 మందికి ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది ఇప్పటికే మరణించారు. అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో మ్యుకోర్మికోసిస్ వ్యాధి బాధితులు ఆస్పత్రుల్లో చేరుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై పోరాడుతున్న సమయంలోనే ఈ వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. మ్యుకోర్మికోసిస్ వ్యాధికి గతంలో జైగోమైకోసిస్ (zygomycosis) అని పిలిచేవారు. ఇది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యుకోర్మిసెట్స్ (mucormycetes) అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది సంక్రమిస్తుంది. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. అక్కడి నుంచి కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు. వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా.. ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అజాగ్రత్త వహించినా.. ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై మ్యుకోర్మికోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశముంది.ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలి. కోవిడ్ పోయిందిలే అని నిర్లక్ష్యం వహించకూడదు. ముక్కును, కంటిని చేతులతో తాకకుండా జాగ్రత్తపడండి. ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా బయటపడవచ్చు. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే బీ అలర్ట్.. బీ కేర్‌ఫుల్..!