పోలిట్ బ్యూరోకి గల్లా రాజీనామా..
సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టిడిపి పొలిటో బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం రాజీనామా చేసిన గల్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె చాలా కాలంగా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఆమె అటు చంద్రగిరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న గల్లా చివరకు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం సంచలనంగా మారింది.
గల్లా అరుణకుమారి అంటే కేవలం పొలిట్ బ్యూరో సభ్యురాలు మాత్రమే కాదు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు తల్లి కూడా. అటువంటి ఆమె పార్టీలో అత్యున్నత నిర్ణాయక వేదికైన పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిందంటే మామూలు విషయం కాదు. రాజీనామా చేయకముందే ఈ విషయమై తల్లీ, కొడుకుల మధ్య చాలా రోజులుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తొందరలో గల్లా జయదేవ్ కూడా టీడీపీకి రాజీనామా చేసేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసేసి బిజెపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే ముందుగా గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో సభ్వత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. అంటే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే అరుణకుమారి తగిన వేదికను రెడీ చేస్తున్నట్లు అనుకుంటున్నారు. ఏదేమైనా తల్లీ, కొడుకులు చంద్రబాబుతో సఖ్యతగా అయితే ఉండటం లేదన్న విషయాన్ని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మరి అరుణకుమారి రాజీనామా వ్యవహారంపై పార్టీలోనే నేతల మధ్య చర్చల జోరందుకున్నాయి.