కృష్ణా జిల్లా: అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రైతులు,పేదలు, మహిళలు, సామాజిక తరగతుల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నేడు సీఎం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం ఇంత త్వరగా పరిహారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్‌లో చంద్రబాబు.. ట్విట్టర్‌లో ఆయన కుమారుడు లోకేష్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, రూ.3,600 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుంది.చంద్రబాబు.. ఆయన తోక పార్టీలకు రాష్ట్రం సర్వనాశనం అయిన పర్వాలేదు. 29 గ్రామాలతో కూడిన అమరావతి ఉంటే చాలు. మిగిలిన ప్రాంతాలను పట్టించుకోకుండా తమ సామాజికవర్గానికి మేలు జరిగితే చాలనే రీతిలో నీచ రాజకీయం చేస్తున్నారు. డిసెంబర్ 25న రాష్ట్రంలోని 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేస్తాం. ఈ ఏడాది మార్చి 30 నే ఇవ్వాలని నిర్ణయించినప్పటికి 25కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల ద్వారా స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. సంక్రాంతి పండుగ రోజున ఎస్టీ,ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా 9,260 సబ్సిడీ వాహనాలను అందచేస్తామని’’ కొడాలి నాని తెలిపారు.