అనంతపురం, ఫిబ్రవరి 20 :
త్వరలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని మారుతినగర్‌కు చెందిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే అనంత సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారన్నారు. వైసీపీ మద్దతుదారులకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టారన్నారు. అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మెచ్చి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరికలు జరుగుతున్నట్లు చెప్పారు. తప్పకుండా నగర పాలక సంస్థతో పాటు అన్ని మునిసిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. పార్టీలో చేరిన వారంతా వైసీపీ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో 35వ డివిజన్ కన్వీనర్ ప్రకాశ్‌రెడ్డి, నాయీ బ్రాహ్మణ సంఘం రాయలసీమ అధ్యక్షుడు నరసింహులు, కోశాధికారి విజయభాస్కర్, మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.