Header Top logo

The life of Sirivennela సిరివెన్నెల జీవితం

పరిచయం

The life of Sirivennela
సిరివెన్నెల జీవితం

గేయరచయిత,నటుడిగా ‘సిరివెన్నెల’ కురిపించిన సీతారామశాస్త్రి..!!
తెలుగు పాటకు ఇక అమవాస్యేనా? ‘సిరివెన్నెల’ లేనట్లేనా?

సీతారామశాస్త్రి అంటే పాటలా బతికారు

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ నిజానికి సిరివెన్నెల ఆయన ఇంటిపేరు కాదు..” చేంబోలు” ఆయన అసలు ఇంటిపేరు.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో మే 20,1955 న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు.

డాక్టర్ చేయాలని తండ్రి కోరిక

మొదట టెలిఫోన్ ఎక్సెంజీలో ఉద్యోగంచేశారు.తన గురువు శ్రీ ‘వై. సత్యారావు’గారని ఆయన గొప్పగా చెప్పు కుంటారు. అలాగే భార్య ‘పద్మావతి’తన పాటలకు ఉత్తమ విమర్శకు రాలనేవారు. ఎంబీబీఎస్‌ చేయమని తండ్రి సలహా ఇస్తే,తనవల్ల కాదని
సినిమా బండెక్కారు సీతారామశాస్త్రి. పదో తరగతి వరకూ అనకాపల్లి లోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌,ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు.

దర్శకుడు త్రివిక్రమ్ అల్లుడు

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈయనకు అల్లుడు అవుతారు. ఈయన సోదరుడి కూతురుని త్రివిక్రమ్ పెళ్లాడా
రు. మరోవైపు సిరివెన్నెల కుమారుడు రాజా కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఆయనకు భార్య పద్మావతి, మరో కుమారుడు యోగేష్ ఉన్నారు.‌ సినీ పరిశ్రమకు‌‌ సిరివెన్నెల చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 లో పద్మశ్రీ తో సత్కరించింది.

సీతారామశాస్త్రి మంచి కవి

సీతారామశాస్త్రి మంచి కవి.కానీ కవిత్వం రాసిన దాఖలాలు లేవు. అయితే కవిత్వాన్ని ఒంపుకొని చిరకాలం గుర్తుండి పోయే ఆణి ముత్యాల్లాంటి పాటలు రాశారు. జన హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయారు. అయితే 300 పాటలతో ‘శివకావ్యం’ రచనలో నిమగ్నమై ఉన్నప్పుడు. ఆయన మనకు దూరంకావడం నిజంగా దురదృష్టం. ‘శివకావ్యం’ పూర్తయి వుంటే పాటలతో కూడిన కావ్య రచనకు ఆయనే ఆద్యుడయ్యేవారు.తెలుగు సాహిత్యంలో పాటల పూదోటలో ఓ సంపూర్ణ కావ్యం పరిమళించి వుండేది.

Death devoured by Sirivennela సిరివెన్నెలను కబళించిన‌ మృత్యువు..!!

పాటల రచయితగా…!!

పాటల రచయితగా సీతారామాశాస్త్రి అరంగేట్రం చేసింది. కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి ’సినిమాతో… ఆ తర్వాత ‘జైలుపక్షి,’ ‘ఆది దంపతులు’ ‘లేడీస్ టైలర్’ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు. గానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే 1986లో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “సిరివెన్నెల”సిమాలో అన్ని పాటలు (సింగిల్ కార్డ్) రాశారు సీతారామశాస్త్రి.‌ఈ సినిమాలో “విధాత తలపున ప్రభవించినది” అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం పదిలం చేసింది. ఆ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్టయి‌ సీతారామశాస్త్రి ఇంటిపేరు మారి “సిరివెన్నెల” గా స్థిరపడింది. బి.ఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగం మానేసి, పాటల రచయితగా సినీ ఇండస్ట్రీ లో అదృష్టాన్ని వెతుక్కున్నారు.

వంశీ మంత్రం!!

“సిరివెన్నెల” సినిమాలో అన్ని పాటలు హిట్ అయినా సినీరంగంలో నిలబడడానికి కొంత తడబాటు తప్పలేదు. సీతారామ శాస్త్రి క్లాసికల్ సినిమాలకు తప్ప మాస్/ కమర్షియల్ సినిమాలకు పాటలు రాయలేడని‌ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే సీతారామ శాస్త్రి ఆల్ రౌండర్ ప్రతిభను గుర్తించిన వంశీ తన లేడీస్ టైలర్ లో మాస్ సాంగ్స్ రాయించాడు అవి హిట్టవ్వడంతో,సిరివెన్నెల ఏ పాటలైనా రాస్తాడని పరిశ్రమ నమ్మింది.అప్పటి నుండి ‘సిరివెన్నెలసీతారామశాస్త్రి ఇక వెనక్కు తిరిగి చూడలేదు. శాస్త్రి గారి పాటలేక పోతే సినిమాయే లేదనే పరిస్థితి యేర్పడింది.ఓ వైపు అప్పటికే ఇండస్ట్రీలో ప్రభంజనంలా దూసుకుపోతున్న వేటూరి ని తట్టుకొని,సిరివెన్నెల తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఆయన అక్షరాలు పలకని భావం లేదుతెలుగు సినిమాల్లో‌ అద్వైతం నుంచి రొమాన్స్ వరకూ.. మేల్కొలుపు నుంచి హెచ్చరికల వరకూ ఆయన అక్షరాలు పలకని భావం లేదు. నిద్రపోతోన్న సమాజాన్ని నిగ్గదీసి అడిగారు. సురాజ్యం కాలేని స్వరాజ్య కాంక్షను హేళన చేశారు.. తోడు లేని నడక ఎడారిపాలే అని తేల్చివేశాడు. మురారి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గౌతమిపుత్ర శశాతకర్ణి స్వయంకృషి’‘స్వర్ణ కమలం’, సంసారం ఒక చదరంగం’, ‘శృతి లయలు,ఇంద్రుడు చంద్రుడు,నిన్నేపెళ్లాడతా, గాయం, అంతం,అల్లుడు గారు, క్షణ క్షణం, మనీ,సిందూరం, నుంచి త్వరలో రానున్నరాజమౌళి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాల్లో పాటలు రాశారు.సుమారు 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3 వేల పాటలు రాశారు.

సిరివెన్నెల పాటలు లేకుండా

ఇక త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్రదర్శకులు సిరివెన్నెల పాటలు లేకుండా సినిమాలు తియ్యమని భీష్మించే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. అలాగే అగ్ర సంగీత దర్శకులు సైతం పాటల విషయంలో సిరివెన్నెలకే అగ్రతాంబూలం ఇచ్చేవారు. సిరివెన్నెల పాటంటే ఓ రేంజ్ లో వుంటుందనేది సినీ ఇండస్ట్రీ నమ్మకం. ఆయన పాటలకు చెవులు కోసుకునే ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో వున్నారనడం అతి
యోక్తి కాదు.

ఆదిభిక్షువు వాడినేది కోరేది..?

సిరివెన్నెలలో సీతారామశాస్త్రి రాసిన పాట.. “ఆదిభిక్షువు వాడినేది కోరేది” అనే పాటలోని లోతైన తాత్వికతకు సాహిత్య పరిమళం తోడు కావడంతో సిరివెన్నెల కీర్తి ఆకాశాన్నంటింది. ఆతర్వాత శృతిలయలు సినిమాలోని “తెలవారదేమీ సామి” పాట సీతారామశాస్త్రి ప్రతిభను మరోసారి లోకానికి చాటింది.ఈ పాటకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి తెచ్చిపెట్టింది. కె.వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను జేసుదాసు కమనీయంగా పాడారు.అదే వరుసలో సీతారామ
శాస్త్రి పాడిన అనేక పాటలు ప్రేక్షకులను రసలోకంలో ఓలలాడించాయి. ఫలితంగా 13 నందులు ఆయన సొంతమయ్యాయి.

నటుడిగా…!!

సీతారామశాస్త్రికి గాయకుడు కావాలని వుండేది. అయితే ఆయన గొంతు పాటకు నప్పలేదు.రాంగోపాల్ వర్మ ‘ తన ‘గాయం ‘ సినిమాలో ఓ పాటలో సిరివెన్నెల చేత నటింపజేశారు. సిరివెన్నెల రాసిన.” నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని ” అన్న ఆ పాటను బాలు పాడగా,సిరివెన్నెల పైన చిత్రీకరించారు.నిజ జీవితంలో కాకున్నా వెండితెర మీద గాయకుడిగా కనిపించి తనకోరిక తీర్చుకున్నారు సీతారామశాస్త్రి. ఈ పాట రచనకు గాను‌ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం లభించడం విశేషం.

అవార్డులు.. రివార్డులు..!!

పాటల రచయితగా సీతారామశాస్త్రి గారు పొందిన అవార్డులు, రివార్డులు అన్నీ,యివన్నీ కావు. సిరివెన్నెల(1986) ‘విధాత తలపున’ శృతిలయలు (1987 ) ‘తెలవారదేమో సామీ’ స్వర్ణ కమలం (1988)- ‘అందెల రవమిది’.గాయం,(1993) ‘సురాజ్యమవ లేని.’శుభలగ్నం (1994) ‘చిలకా ఏ తోడులేక’శ్రీకారం(1995)’మనసు కాస్త కలత’సింధూరం(1997)’ అర్ధ శతాబ్దపు.’ప్రేమకథ.(1999) ‘దేవుడు కరుణిస్తాడని’.చక్రం(2005)’జగమంత కుటుంబం నాది.’గమ్యం ( 2008) ‘ఎంతవరకూ ఎందుకొరకూ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ (2013)’మరీ అంతగా.’.నంది పురస్కారం) ఇక దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులైతే సరేసరి..2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 2008గమ్యం, ‘ఎంతవరకు’2009, మహాత్మ ‘ఇందిరమ్మ’.ఇలా రాసుకుంటూ పోతే వివిధ సంస్థలు తలపున ఆయన పొందిన అవార్డుల జాబితా ఓ పేజీ అయినా చాలదు.

సీతారామశాస్త్రి పాటలా బతికారు

పాటంటే సీతారామశాస్త్రి… సీతారామశాస్త్రి అంటే పాటలా బతికారు. పాటే ఆయన లోకం పాటే ఆయన శ్వాస. పాట మినహా ఆయనకు మరో లోకం లేదు. పాటను ఇంతగా ప్రేమించిన వారు మనకు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో సిరివెన్నెల ముందుంటారు. సిరివెన్నెల లేని పాటను ఊహించడం కష్టమే. 30నవంబర్ 2021పాటకు చేదు దినం. శ్వాసకోశాల
వ్యాధి కారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనకు దూరమయ్యారు. ఇక పాటల పూదోటలో ‘పారిజాతం’ కనిపించక పోవచ్చు గానీ ఇప్పటివరకు ఆయన రాసిన పాటలు ఎన్ని సంవత్సరాలైనా మనల్నిఅలరిస్తూనే వుంటాయి. పాటల సిరివెన్నెల అలా కురుస్తూనే వుంటుంది. మనం తడుస్తూనే. (తరిస్తూనే) వుంటాం.!!

పల్లెల్లో కూడా మాయమైన పిచ్చుకా

ఎ. రజాహుస్సేన్, రచయత
(చిత్రం… మొహమ్మద్ గౌస్, హైదరాబాద్)

Leave A Reply

Your email address will not be published.

Breaking