Header Top logo

Rajababu Jayanti on October 20 సినీ ఆర్టిస్ట్ రాజబాబు జయంతి

cine artist Rajababu Jayanti on October 20

నవ్వుల రారాజు రాజబాబు అక్టోబర్ 20న రాజబాబు జయంతి

పుణ్యమూర్తుల అప్పలరాజు అనగానే ఎవరా అని ఆలోచించ వచ్చు. రాజబాబు అంటే హాస్య నటునిగా తెలియని తెలుగు వారుండరు. రేలంగి, రమణారెడ్డి తరవాత అంతకు మించిన ప్రేక్షక ఆదరణ పొందిన నటునిగా గుర్తింపు పొందారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప హాస్య నటుల్లో ఒకరు రాజబాబు. రెండు దశాబ్దాల తక్కువ వ్యవధిలో ఆయన శిఖర స్థాయిని అందుకున్నారు. దాదాపు 600 చిత్రాల్లో నటించిన రాజబాబు.. తెలుగు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. అప్పట్లో ఆయన దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఒకరు. రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో విరామం లేకుండా పని చేసిన ఘనత ఆయనది.

rajababu cine artisr2తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్య నటునిగా వెలిగిన రాజబాబు (అక్టోబరు 20, 1935 – ఫిబ్రవరి 14, 1983) “శతాబ్దపు హాస్య నటుడి”గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమా మహేశ్వర రావు, రవణమ్మ. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చు కోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయునిగా కొద్దికాలం పని చేశారు. ఉపాధ్యాయునిగా పని చేసేటప్పుడే నాటకాలలో పాలుపంచు కొనేవారు. రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడారు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు సంతానం కలిగారు.

ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహ పరిచారు. దాంతో చెప్పా చెయ్యకనే  ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్య నటుడు అడ్డాల నారాయణ రావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవారు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణ రావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత”తండ్రులు-కొడుకులు”,”కులగోత్రాలు”,”స్వర్ణగౌరి”,”మంచి మనిషి” మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు. మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే “కుక్కపిల్ల దొరికిందా”, “నాలుగిళ్ళ చావిడి”, “అల్లూరి సీతారామరాజు” మొదలగు నాటకాలు వేశారు.

జగపతి ఫిలింస్… వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం  “అంతస్తులు” చ్రిత్రంలో నటించి నందుకు గాను మొట్ట మొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. ఇక వెనక్కు తిరిగి చూసుకో వలసిన అవసరం లేకుండా వరుసగా నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాలలో నటించారు. ఆకాశ రామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్య హరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పక తప్పదు. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు – రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.రాజబాబు తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమా లలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.

rajababu cine artisr3సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవారు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టిన రోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించారు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామ కృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయి పేటలో భూమి ఇచ్చారు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. దాని పేరు కూడా ఆయన పేరు మీదే “రాజబాబు జూనియర్ కళాశాల”గా ఉంది.

వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్ట మొదటి హాస్య నటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందారు. “చెన్నై ఆంధ్రా క్లబ్బు” వారు వరుసగా ఐదు సంవత్సరాలు “రోలింగ్ షీల్డు”ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందారు.రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు, ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయ్యారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికి తీర్చలేనిది.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల

9440595494

1 Comment
  1. K V Ramana says

    Nice article sir

Leave A Reply

Your email address will not be published.

Breaking