Header Top logo

ఏపీకి బీరుట్ తరహా ముప్పులేదు: గౌతమ్ సవాంగ్

  • లెబనాన్ రాజధాని బీరుట్ లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు
  • వందలమంది మృతి
  • ఏపీలో పరిస్థితిపై జిల్లాల ఎస్పీలతో సవాంగ్ సమీక్ష

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీస్థాయిలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో వందల మంది మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, భారత్ లోనూ అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెన్నైలో ఉన్న ఈ ప్రమాదకర పదార్థాన్ని తరలించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయంలో అనుసరించాల్సిన చర్యలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ, బీరుట్ తరహా ముప్పు ఏపీకి ఉండబోదని భావిస్తున్నామని అన్నారు. అయితే, అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయంలో కఠినంగా వ్యవహరించదలిచామని తెలిపారు. లైసెన్సు లేని వారు అమ్మోనియం నైట్రేట్ తయారుచేయడం నిబంధనలకు విరుద్ధమని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయాలంటే అనుమతి తప్పనిసరి అని సవాంగ్ వివరించారు. అనుమతి ఉన్న గిడ్డంగులలోనే అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేయాలని, లైసెన్స్ దారులకు మాత్రమే సరఫరా చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, నిబంధనలు పాటించనివారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడవద్దని జిల్లాల ఎస్పీలకు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking