అవును, ప్రస్తుతం హిందువులు ప్రమాదంలో ఉన్నారు. అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు.
వ్యతిరేక పక్షంలో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా తేలిక. వారి నుంచి ఎదురయ్యే ప్రమాదాలు ముందుగానే పసిగడతాం కాబట్టి వాటినీ తప్పించుకునే వీలుంది. కానీ మనతోనే ఉంటూ, మనవారిగా ఉంటూ మన కోసమే ఉన్నామని నమ్మిస్తూ మన వేలితో మన కళ్ళే పొడుచుకునేలా చేసే గోముఖ వ్యాఘ్రాలను గుర్తించడం, వారి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోవడం అంత సులభం కాదు.
హిందువులకు శత్రువులు ఎవరు?
ముస్లింలా? ముస్లింలు ఈ దేశపౌరులుగా వందల ఏళ్లుగా ఉన్నారు. ఈ దేశంలో వేలాది గ్రామాలలో వందల ఏళ్లుగా హిందూ ముస్లిమ్స్ అరమరికలు లేకుండా సామరస్యంగా బతుకుతున్నారు. ఇంతకాలం లేని విధంగా ఇప్పుడే కొత్తగా వీరి వల్ల హిందూ మతం ప్రమాదంలో చిక్కుకునే అవకాశం లేదు.
క్రైస్తవులు కూడా అంతే. వారితో హిందూ మతానికొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఈ దేశంలో మెజారిటీ మతాన్ని ప్రమాదంలోకి నెట్టేసేంత శక్తి సామర్థ్యాలు ఈ రెండు మతాలకూ లేవు.
మరి హిందూ మతాన్ని ప్రమాదంలోకి నెట్టేసే కుటిల శక్తీ, అవసరం ఎవరికి ఉంది?
అదే హిందుత్వ!!!
ఇది ఆర్ ఎస్ ఎస్, వి హెచ్ పి వంటి అనేక వికృత రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నా దాని విషపు కోరలు చాచే శక్తి లేక గోతి కాడ నక్కలా పడి ఉండడంతో హిందూ మతానికీ, హిందూ దేవుళ్ళకు ప్రత్యేక రక్షణ కావాలన్న ఆలోచన అవసరం ఇంత కాలం ఈ దేశ ప్రజలకు ఏర్పడలేదు.
హిందుత్వ వేరు. హిందూ మతం వేరు.
మతస్థులు వేరు, మతోన్మాదులు వేరు.
ముస్లిం దేశాల్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు కనిపిస్తాయి. అంత మాత్రాన ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కానట్టే, హిందువులందరూ హిందుత్వ కారు. హిందుత్వ అంటే మతోన్మాద ఉగ్రవాదుల గుంపు అని ఇటీవలి కాలంలో వాళ్ళు అడుగడుగునా రుజువు చేసుకుంటున్నారు.
భక్తి మూఢనమ్మకమే అయినా..
అలాగే భక్తులందరూ బత్తాయిలు కాదు. భక్తి మూఢనమ్మకమే అయినప్పటికీ ఎంతోమంది భక్తి ద్వారా మనశ్శాంతి , ఉపశమనం పొందుతున్నారు. ఆనందం పొందుతున్నారు. పది మందికి సాయం చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు అనే నమ్మకంతో సమాజానికి తమ చేతనైనంత మంచి చేయాలని చూసే హిందువులే (అమాయక భక్తులు ) ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ‘అందరూ బాగుండా’లనే కోరుకుంటారు (మా నాన్న ఇలానే ఉండేవాడు) ఇతర మతస్థుల్ని ద్వేషించనంతవరకు ఎవరి వల్లా సమాజానికి హాని ఉండదు.
దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్లకు మనోభావాలు దెబ్బతినవు. దేవుడే చూసుకుంటాడనే దేవుడి మీద విశ్వాసం ఉంటుంది.
రెచ్చగొట్టటమే వాళ్ళ పని
కానీ హిందుత్వలో దేవుడి మీద ఎవరికీ నమ్మకం ఉండదు. మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే వాళ్లకు కావాలి.
అధికారంలోకి రావడానికి మతాన్ని రెచ్చగొట్టి ఎన్ని ప్రాణాలనైనా బలి పెడ్తారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలను వీళ్ళే విరగ్గొడతారు, దేవాలయాలు ధ్వంసం చేస్తారు. రథాలు దగ్ధం చేస్తారు. వీళ్ళే నాస్తికులతో కుమ్మకై దేవుళ్లను తిట్టించి ప్రజలు తన్నుకుని చస్తుంటే ఎంత ఎక్కువ ఘర్షణలు రేపగలిగితే అన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయని సంబరపడుతుంటారు. వీళ్ళు చేసే ఇలాంటి నీచ నికృష్టమైన పనిని ఇతర మతాల మీదికి నెట్టి నమ్ముకున్న ప్రజల్ని తడి గుడ్డతో గొంతులు కోస్తారు.
ఈ విష వలయంలో చిక్కుకుంటున్న అమాయక హిందువులు మెల్లి మెల్లిగా ద్వేషంతోనే పుట్టిన హిందుత్వ తమ బుర్రల్లోకి ఎక్కించిన విషంతో హిందూ మతం నుంచి పక్కకు తప్పుకుంటూ నెమ్మదిగా హిందుత్వలోకి జారిపోతున్నారు. ఇంత కాలం ‘ప్రేమ , శాంతి’ అని చెప్పుకునే హిందూ మతం స్థానాన్ని ‘చంపుతాం, నరుకుతాం’ అనే హిందుత్వ భర్తీ చేయనుంది.
హిందూ మతం అంతరించి హిందుత్వ మాత్రమే మిగిలే ప్రమాదం పొంచి ఉంది.
హిందూ దేవుళ్ళు పూజలకూ భక్తికీ కాకుండా రాజకీయాలకూ, స్వప్రయోజనాలకూ, విద్వేషానికీ, ప్రదర్శనకూ ప్రతీకలుగా హిందుత్వ ఉన్మాదుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.
అవును.. హిందూ మతం, హిందూ దేవుళ్ళు ప్రమాదంలో ఉన్నారు !
Vanaja Che, Writer