ఏకపక్షంగా ప్రజాతీర్పు. అనంత కార్పొరేషన్ మేయర్ పీఠం మాదే, అన్ని మునిసిపాలిటీల్లో వైసీపీ విజయం ఖాయం, టీడీపీకి నాటి పాపాలే.. నేడు శాపాలు, ఘోర ఓటమి తప్పదనే కుంటిసాకులు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన అనంత.
నగర పాలక, మునిసిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉండబోతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. అనంతపురం కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన మునిసిపాలిటీల్లోనూ వైసీపీ విజయం ఖాయమని అన్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కోర్టు రోడ్డులోని నెహ్రూ స్కూల్‌లో ఎమ్మెల్యే అనంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో చేపట్టిన సంక్షేమ పథకాలు, అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడతారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను 40 డివిజన్లలో పర్యటించానని, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే తమ పార్టీ పట్ల ఎంత ఆదరణ ఉందో అర్థమవుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరిగిన తీరు అద్భుతమన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతల వ్యవహార శైలి, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలే ఈ ఎన్నికల్లో వారికి శాపాలుగా మారబోతున్నాయన్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోబోతోందన్నారు. ఓటమిని ముందే గ్రహించే కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల నాడి తమకు తెలుసని, మునిసిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని తమ పార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.