Header Top logo

రైతుల ఆందోళన: రంగంలోకి మోదీ

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. ఇప్పటికే రెండు సార్లు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ అన్నదాతలతో సంప్రదింపులు జరపగా.. చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. మరికొద్ది గంటల్లో రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు జరపనుండగా.. తాజాగా ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఈ ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో ప్రధాని సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. రైతు సంఘాలు లేవనెత్తుతున్న అంశాలు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన వైఖరిపై ప్రధానితో మంత్రులు మాట్లాడుతున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొద్ది రోజులుగా దిల్లీ శివారుల్లో ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ అన్నదాతల నిరసన ఉద్ధృతమవడంతో గత మంగళవారం, గురువారం కేంద్రం వారితో చర్చలు జరిపింది. కొత్త చట్టాలపై వివరణ ఇచ్చింది. అయితే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించడంతో ఆ సంప్రదింపులు ఫలించలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం మరోసారి కేంద్రం అన్నదాతలతో చర్చలు జరపనుంది. దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత కేంద్రం చర్చలు జరపడం ఇది మూడోసారి.

నూతన చట్టాలతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు నేడు పార్లమెంట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అన్నదాతల నిరసనకు మద్దతు పెరుగుతోంది. విపక్షాలతో పాటు విదేశాల నేతలు కూడా రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే రైతుల ఆందోళనలో విదేశీయుల జోక్యంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కెనడా హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది..

Leave A Reply

Your email address will not be published.

Breaking