Votes cannot be sold మా ఇంటి ఓట్లు అమ్ముకోము
Votes cannot be sold
మా ఇంటి ఓట్లు అమ్ముకోము
గిప్పుడు సోషల్ మీడియంతా హుజురాబాద్ ఉప ఎన్నికల లొల్లి. ఒక్కో ఓటుకు ఆరు వేలు నుంచి పది వేల దాకా ఇస్తుండ్రని కోడై కూస్తోంది. ఒక ఇంట్లో నాలుగోట్లుంటే ఇరువై నాలుగు నుంచి నలుపై వేలు. గా ఈటెల రాజేందర్ రాజీనామా చేసుడెందో గానీ హుజురాబాద్ నియోజక వర్గమంతా పండుగే పండు. ప్రతి రోజు తాగిపిచ్చుడు.. దావతులు ఇచ్చుడు. ఖర్చులకు పైసాలిచ్చుడు ఇవన్నీ కామనే అనుకో.
అగో పోలీసులు, ఎలక్షన్ అధికారులంతా ఉండగా ఓట్లకు గిట్ల పైసాలెట్ల పంచుతుండ్రు, దావతులెట్ల ఇత్తుండ్రనుకుంటుండ్రా.. ఎప్పుడన్న ఏ ఎలక్షనన్నా గీ డబ్బులు, దావతులు లేకుండా జరిగినయా జరుగలేవు గదా.. ఇప్పుడు గీ ఎలక్షన్ లు మన సీఎం కేసీఆర్ సార్ కు, బీజేపోళ్లకు చావో రేవో తెల్చుకునుడు లెక్కాయింది. ఓళ్లు ఓడిన ఇజ్జత్ కా సవాల్ అని తొడలు కొట్టుకుంటుండ్రనుకో. గివ్వన్నీ ఎప్పుడుండెటియే.. కానీ మీకు ఓ ఒక మంచి ముచ్చట చెబుదా.
ఓట్లు అమ్ముకోము.. ఇంటి ముందు ఫోటో
మా ఇంటి ఓట్లు అమ్ముకోలేము నీతిగా నిజాయితీగా Votes cannot be sold ఇంటి ముందు ఫోటో దిగి ప్లెక్సి పెట్టిన గీ పెద్దాయన పేరు ప్రవీణ్ కుమార్ సార్. హుజురాబాద్ సర్కార్ స్కూళ్లో చదువు చెప్పే గీ పంతులు ఫోటో మ్యాటర్ గిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితుంది.
గాళ్ల ఇంట్ల నాలుగోట్లున్నాయట. ఆ ఇంటికి ఓటుకు పైసాలిద్దామని వెళ్లిన పొలిటికల్ లీడర్ లు ఆ ప్లెక్సిని చూడంగానే చెప్పు తీసి కొట్టినట్లు అనిపించి ఎనక్కి తిరిగి వత్తున్నరట. సర్కార్ స్కూళ్లో పొరగాళ్లకు చదువు చెప్పేటప్పుడు ఇగురంతో ఎట్లా బతుకలో మత్తు మంచిగా చెబుతాడట గీ ప్రవీణ్ కుమార్ పంతులు.
అందుకే మా ఇంటి నుంచే మార్పు రావాలని గాళ్ల ఇంటి నుంచే నోటుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పుతుండట. నిజామాబాద్ కు చెందిన సోషల్ వర్కర్ కాసాల జైపాల్ రెడ్డి గీ ప్రవీణ్ కుమార్ సార్ పోటోను మత్తు వైరల్ చేస్తున్నడనుకో.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111