Header Top logo

మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్నది వీరేనంట!

పంజాబ్ లో నిన్న ప్రధాని మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై ఆగిపోయింది. ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. ఏడు కిసాన్ యూనియన్లు డిసెంబర్ 31న భేటీ అయ్యాయని… ప్రధాని పర్యటన సందర్భంగా భారీ నిరసన తెలపాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పింది.

మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని విధుల్లో పెట్టామని పంజాబ్ అడిషనల్ డీజీపీ చెప్పారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరింపజేశామని తెలిపారు.

ఇంకోవైపు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఈ ఘటనపై స్పందిస్తూ… జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. మోదీపై దాడి చేయాలనే పరిస్థితులు అక్కడ చోటు చేసుకోలేదని చెప్పారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లన్నీ కేంద్ర ఏజెన్సీల చేతుల్లోనే ఉంటాయని.. ఆయన భద్రత విషయంలో పంజాబ్ పోలీసుల పాత్ర చాలా తక్కువని అన్నారు. వాస్తవానికి ఫిరోజ్ పూర్ లో మోదీ ర్యాలీకి 70 వేల మంది వస్తారని కుర్చీలు వేయించారని… అయితే అక్కడ 700 మంది కూడా లేకపోయేసరికి… మోదీ వెనుదిరిగి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
Tags: Narendra Modi, BJP Convoy, Bharatiya Kissan Sangh

Leave A Reply

Your email address will not be published.

Breaking