- మహీపాల్ రెడ్డిపై సీబీఐ ఎంక్వైరి జరిపించాలి.
- భూముల ఆక్రమణలపై పూర్తి విచారణ చేయాలి.
- అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మేల్యే కుటుంబ సబ్యులపై చర్యలు తీసుకోవాలి.
- బీజేపి సీనియర్ నేత, మాజీ ఎమ్మేల్యే నందీశ్వర్ గౌడ్ ప్రధానికి ఫిర్యాదు.
కలంగళం, ప్రతినిధి: టీఆర్ఎస్ సర్కార్ అండతో తన కుటుంబ సభ్యులను అడ్డంపెట్టుకుని భూ ఆక్రమణలకు పాల్పడుతున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలపై బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రధాని నరేంద్రమోడీకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమాలు పాల్పడుతున్నారని ప్రధానికి వివరించారు. ఆయన చేస్తున్న అక్రమాలు రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనకు అద్దం పడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు పత్రాన్ని మోదీకి అందించారు . ప్రధాని మోదీ శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో నందీశ్వర్ గౌడ్ మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు . పఠాన్ చెరు ప్రాంతంలో స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి , అతని సోదరుడు ప్రభుత్వ , ప్రైవేట్ భూముల ఆక్రమణ , కబ్జాలకు పాల్పడుతున్నారని మోడీకి తెలిపారు . అధికారం చేతిలో ఉందని నియోజకవర్గంలో వేల కోట్ల కుంభకోణం చేశారన్నారు . ఆయన చేస్తున్న అవినీతి , అక్రమాలపై సీబీఐ చేత పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .
నియోజకవర్గంలోని చెరువులు , కుంటలు , వక్ఫ్, దేవాలయం , స్మశాన , ప్రైవేటు భూముల , ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మోడీకి వివరించారు . ప్రభుత్వ అధికారుల అండదండలతో భూమి యజమానులను బెదిరించి బలవంతంగా భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని నందీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు . ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూ ఆక్రమణలు , కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రధానికి వివరించారు . భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు .
దేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గా కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా నందీశ్వర్గాగౌడ్ మోదీకి పాత కేసు వివరాలు వెల్లడించారు . ఆయన చేసిన అక్రమాలపై గతంలోనే ఓ కేసులో కోర్టు శిక్ష విధించగా రాష్ట్ర ప్రభుత్వ అండతో ఇంకా ఎమ్మెల్యే కొనసాగుతున్నారని మోదీకి వివరించారు . సీబీఐ విచారణ ద్వారా అక్రమాలు బయట పెట్టి చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు నందీశ్వర్ గౌడ్ తెలిపారు . ఈ విషయంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని నందీశ్వర్ గౌడ్ వివరించారు.