Yes This world is your abode Remember
ఈలోకం నీ విడిది…!!
అవును…
ఈ లోకం నీ విడిది
గుర్తుంచుకో…!
నువ్వెక్కడి నుంచి వచ్చావో
తిరిగి అక్కడికే వెళ్ళాలి…
అదే నీ శాశ్వత విశ్రాంతి మందిరం.
ఇక్కడి మెరుపులన్నీ ఆకర్షణే
ఇక్కడి మరకలన్నీ పాపాలే
లోకంలో వున్నన్ని నాళ్ళు …..
నేనూ..నావాళ్ళను కున్నవన్నీ
నీ తాపత్రయాలే సుమా !
దోచుకోవడం దాచుకోవడం
పంపకాలు అంపకాలన్నీ…
నీ పిచ్చి ..!
అంతా నీ చేతుల్లోనే వుందనుకుంటావ్ !
తీరా చూస్తే..
కళ్ళముందే అన్నీ …
సరసరా జారిపోతాయి.
ఇక్కడేదీ నీది కాదు..
ఈ సంగతి గుర్తించే సరికి
మంచం మీదుంటావు
తుది శ్వాస తీస్తూ…!
లెక్కలు పక్కలన్నీ
నువ్వే రాసుకుంటావు
కానీ…
అవన్నీ నీటి మీది రాతలే !
అసలు లెక్కలు రాసే వాడు వేరే.!
శ్వాస పీల్చే చివర్లో …..
జనన మరణాల లెక్కలేసుకున్నా,
ఫలితం శూన్యం.
కాళ్ళూ చేతులు నీ స్వాధీనంలో
వున్నన్ని నాళ్ళే….
నీ అస్తిత్వమైనా…
నీ అధికారమైనా….
అధికారం కాస్తా ఎడంగా జరిగితే…
నీ అసలు రూపం బయట పడుతుంది.
అనుకుంటాం గానీ,…
ఏవీ మన చెప్పుచేతల్లో వుండవు
పై వాడి వింత నాటకంలో….
నువ్వూ..నేను..మనందరం…
ఆటబొమ్మలమే…!
ఇక్కడ నువ్వో అతిథివి
ఈ లోకం నీ విడిది మాత్రమే..!!