Why man is changing today
నేడు మనిషెందుకు మారుతున్నాడు
వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడు కాదు
కుటుంబమనే పునాది నిర్మించుకుని
అనుబంధాలు,ఆత్మీయతలను
అల్లికగా చేసుకుని
నైతిక విలువలను పేర్చుకుని
ప్రపంచమనే సౌధాన్ని నిర్మించుకున్నాడు
మనిషంటే మహోన్నతుడప్పుడు
ఇప్పుడు…
నగరాలన్నీ కుగ్రామాలైనవేళ
వేషమును, భాషను మార్చి
నాగరికతల ముసుగులో మనసుచచ్చి
మనిషి మృగంగా మారుతున్నాడు
కుచించుకుపోతున్న మనసులతో
అహంకారాన్ని అడుగు అడుగులో మోసుకుంటూ
స్వార్థానికి రంగులద్దుకుని
మానవత్వాన్ని మరిచిపోతూ
అనుబంధాలను తాకట్టుపెడుతూ
ఆప్యాయతలను మూలన పెడుతూ
వింత పోకడలతో మనిషి నేడు గంతులేస్తున్నాడు
మనిషి సృష్టించిన సాంకేతిక పరిజ్ఞానం
ఆ మనిషినే శాసిస్తోంది
కాలం చేసిన మాయలో
క్షణం తీరికలేని పరిస్థితులను కల్పించుకుని
బ్రతుకు పుస్తకంలో చివరిపేజీ చదువుతున్నాడు
గాలి మారలేదు
మనిషిని బ్రతికించుటలో
నీరు తీరు మారలేదు
బ్రతుకుకు ఆధారమై నిలుచుటలో
నిప్పు మారలేదు
నీడనిచ్చే చెట్టు మారలేదు
సృష్టిలోని ప్రతిదీ తమ స్వభావాన్ని మార్చుకోలేదు
యధాతథంగా అన్నీ కొనసాగుతున్నాయి
విషాన్ని చిమ్ముతూ
నేడు మనిషెందుకు మారుతున్నాడు
ఆర్థిక అసమానతలు
మనిషి మనిషికీ మధ్య దూరాన్ని పెంచుతున్నాయి
ఆత్మ విమర్శ అవసరమిప్పుడు
సమాజమంటే మానవసంబంధాల మిళితం
కృత్రిమ సంబంధాలు నశించి
కుటుంబ బంధాలు పెరగాలి
అప్పుడే శాంతి, సంతోషాలతో
మనిషి స్థిరంగా జీవించగల్గుతాడు
మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442