చనిపోతే ఏంచేయాలో ఇందిరక్క రాసుకున్న కవిత్వం

క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయినా..

మంచి సందేశం ఇచ్చిన ఇందిరక్క

కవయిత్రి, గజల్, రచయిత్రి, శ్రీమతి “బైరి ఇందిర” క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయారు. ఆమె ధైర్యానికి భయపడి మృత్యువు కబళించింది. అయినా.. తాను చని పోయినా మంచి సందేశంను ప్రపంచానికి అందించింది బైరి ఇందిరక్క గారు.

చావు తప్పదని తెలిసీ కూడా తాను రాసుకున్న ఆ కవిత్వంలో ఎన్నో విషయాలు ఆలోచన చేసే విధంగా ఉన్నాయి. నమ్మిన సిద్దంతాలను ఇందిరక్క చావులో కూడా వదులలేదు.

మీకు జోహార్లు ఇందిర అక్క గారు ✊✊

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

—–+++—+++—
తాను చనిపోతే ఏంచేయాలో
ఇందిరక్క రాసుకున్న కవిత్వం

—-+++—+++—

నేను పోయినప్పుడు

నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది

మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్

పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను

దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ

పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా

పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది

నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి

మంగళవారమైనాసరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి

డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి

కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో

బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు

దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది

పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి

పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది

✍🏼Indira Bhyri

(నోట్: గతంలో కవి, జర్నలిస్ట్  సలేంద్ర (నిజామాబాద్) గారు కూడా చావు కవిత రాసారు.)

What to do if you die Poetry written by Indirakka
Comments (0)
Add Comment