- అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేది ఎవరు?
- అక్రమాల్లో చైర్మన్ కుటుంబ సభ్యుల పాత్ర ఎంత?
- నిబంధనలను పాతరేస్తున్న అధికారులు
- అమీన్ పూర్ లో ఇష్టానుసారంగా నిర్మాణాలు
- అనుమతుల్లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు
- కన్నెత్తి చూడని అధికారులు
- కంచె చేను మేస్తున్న వైనం
నగర శివార్లలోని మున్సిపాలిటీలు , కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హడావిడిగా కూల్చివేసిన అధికారులకు ప్రజా ప్రతినిధుల ఆక్రమణలు కనిపించడం లేదా ? అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఒక రూలు , సామాన్యులకు ఒక రూలా? అంటూ మండిపడుతున్నారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కనిపించవా ?
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు , భూకబ్జాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరానికి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ కావడంతో సహజంగా అమీన్ పూర్ లో భూముల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అలాగే ఈ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు,చెరువులు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని అదునుగా తీసుకున్న మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు,అనుచరులను బినామీలుగా పెడుతూ, నకిలీ పత్రాలను సృష్రించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్నాడనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు జోక్యం చేసుకొనేందుకు భయపడుతున్నారని వినికిడి. అదే విధంగా భవన నిర్మాణాలలో కూడా మున్సిపల్ చైర్మన్ తన అధికారాన్ని వాడుకొని , అనుమతులు అవసరం లేకున్నా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అమీన్ పూర్ లోని కొన్ని ప్రాంతాలలో రెండు ఫ్లోర్ లకు అనుమతి ఉన్నప్పటికీ ఐదు , ఆరు ఫ్లోర్లు నిర్మిస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
పలుకుపడి ఉంటే పనులు జరుగుతాయి
మున్సిపాలిటీ పరిధిలో సామాన్యులకు వర్తిస్తున్న నిబంధనలు , ప్రజాప్రతినిధులకు వర్తించడం లేదు. పలుకుబడి ఉంటే పనులు జరుగుతాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . మున్సిపల్ చైర్మన్ పలుకుపడితో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి . రెసిడెన్షియల్ పరిమిషన్ తో కమర్షియల్ నిర్మాణాలు , సెట్ బ్యాక్స్ లేకుండా ఐదు అంతస్థుల నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. కానీ సామాన్యుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న అధికారులు … ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అనుచరుల విషయంలో చూసి , చూడనట్లు వ్యవహరిస్తూ విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఆగడాలను అడ్డుకొనేది ఎవరు ?