What is the Flag salute జెండా వందనం తంతురా…

What is the Flag salute
జెండా వందనం తంతురా…

ఇవాళ జండా ఎగరేస్తారు.
మిఠాయిలు పంచుకుంటారు.

కులం పట్టింపులు మరిచిపోరు
మత ఆచరణ విడిచిపెట్టరు.

రిపబ్లిక్ ని గుర్తించడం అంటే
వీటికి భిన్న మైనదని గుర్తించరు.

చిన్నోడా
ఇదంతా ఒక తంతు రా.
నీతిమంతుని వేలేసి లంచగొండులకు
కొందరికి సర్టిఫికెట్లు ఇచ్చేసి
చిన్నపిల్లల డాన్సులు కొన్ని చూసేసి
గుండీకి వుండే ప్లాస్టిక్ జెండాని తీసేసి
గుండెల్లో లేని సమానత్వాన్ని జెండాగా ఎగరేసి
ఈరోజుని
అలా గడిపేస్తార్రా.

అడ్డదిడ్డమైన భావజాల ముక్కలన్నింటినీ
దేశంగా నిలబెట్టి
ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబెట్టిన
దేశం జెండాని గురించి తలచుకోకుండా
నడిరోడ్డు మీద ఆయన విగ్రహం మీద జరిగే
దాడిని సైతం ప్రశ్నించకుండా
జండా ఎగరేస్తారు చూడూ
చిన్నోడా…
అటువంటి వాళ్లు చెప్పు దెబ్బలకు అర్హులే లేరా.

పురిట్లోనే ఆడపిల్లని చంపే
ఘన సంస్కృతి పుట్టలు పెట్టిన ఇక్కడ
ప్రతి ఆడపిల్లకీ హక్కులు కల్పించిన
ఆ మహామనిషి
ఏ ఆడపిల్లలకి గుర్తొస్తున్నాదంటావూ?

హక్కులు, హక్కులూ అని
అరుస్తున్న జెండాల్లో
ఎక్కడన్నా
ఒక్క చోట అయినా
ఆయన బొమ్మ కనబడుతుందా చిన్నోడా,

ఇదొక ఫార్స్ రా చిన్నోడా,
జరగనివ్వడమే
చూస్తూ ఉండటమే.

రవికుమార్ నూకతోటి

What is the Flag salute / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment