Varthanthi of Gopichand
గోపీచంద్ గారి వర్థంతి
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు !!
భౌతిక, ఆథ్యాత్మిక సిద్ధాంతాల సమన్వయమే
మానవ జీవితం!! తెలుగు సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం వుంది.సాహిత్యకారులు ఒకరికొకరు రాసుకున్న లేఖలు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆధారాలవుతాయి. గురజాడ, గిడుగు తదితర సాహిత్యకారుల లేఖల వల్ల అనేక విషయాలు వెలుగులో కొచ్చాయి. గురజాడ, మునిసుబ్రహ్మణ్యం రాసుకున్నఉత్తరాల్లో విలువైన సాహిత్య సమాచారం వుంది. అలాగే శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి వంటివారు రాసిన ఉత్తరాలు,ఇతరులు వారికి రాసిన ఉత్తరాలు సాహితీ శోభను వెదజల్లుతున్నాయి.
గోపీచంద్ రాసిన ఉత్తరాలు
ప్రముఖ కథకుడు, నవలా రచయిత, సినీదర్శకుడు,దార్శనికుడైన త్రిపురనేని గోపీచంద్ కూడా వివిధ విషయాలపై ఉత్తరాలు రాశారు. అయితే అవి తనకు తానే రాసుకున్నవి. పోస్టు చెయ్యనివి! గోపీచంద్ తన తండ్రి రామస్వామి చౌదరి నుండి భౌతిక వాదాన్ని నేర్చుకున్నాడు. దాంతోపాటే అరవిందుల ఆథ్యాత్మిక భావనను కూడా ఒంట బట్టించుకున్నాడు. అయితే భౌతిక వాదన,ఆథ్యాత్మిక భావనల్లో ఏది సత్యం? ఏదసత్యం? అన్నమీమాంస గోపీచంద్ ను వెంటాడింది. వేధించింది. దాని ఫలితమే ఆథ్యాత్మిక,భౌతికవాదాల సమన్వయంతో కూడిన “పోస్టు చెయ్యని ఉత్తరాలు.“ఏదో ఒక సిద్ధాంతంతో తృప్తి పడే రోజులుగా కనబడటం లేదు. ఈ రోజులు అన్ని సిద్ధాంతాల్లోని మంచిని ఏరుకొని, పోగుచేసుకొని, ప్రయాణం చేయాల్సిన రోజులుగా కనబడుతున్నాయన్న”జవహర్ లాల్ నెహ్రూ మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో ఆథ్యాత్మిక, భౌతిక వాదన కూడా సిద్ధాంతాల్నిమధించాడు. తరచి తరచి చూశాడు. చివరకు ఈ రెండూ అవసరమేనన్న అభిప్రాయానికొచ్చాడు. “ఈ రెంటిలోనూ కొంత వరకూ సత్యముంది. అందువల్ల ఈ రెండు కొంత మందిని సంతృప్తి పరుస్తున్నాయని ” గోపీచంద్ భావించాడు. (Varthanthi of Gopichand)
జంతువు నుంచి మనిషిని “సంస్కారం” వేరు చేస్తుంది
జంతువు నుంచి మనిషిని “సంస్కారం” వేరు చేస్తుందని, మనిషి జీవన విధానాన్ని సంస్కారమే నిర్ణయిస్తోందని గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. ఈ సంస్కారంభౌతిక, ఆథ్యాత్మిక మార్గాల వైపు పయనిస్తుండటం వల్ల ఈ రెండూ అవసరమేనని, వీటి మధ్య సమన్వయం సాధించగలిగితే మానవ జీవితం పరిపూర్ణమవుతుందని గోపీచంద్ ఓ నిర్ణయానికొచ్చాడు. భౌతిక వాదులు ఆథ్యాత్మిక వాదంలో కొందరూ ఈ ప్రపంచం ఒకే వస్తువు నుంచి పరిణామం చెందిందని ఒప్పుకుంటారు. అయితే భౌతిక వాదులు పదార్థం “అనాది” అంటారు! ఆథ్యాత్మిక వాదులు “ సర్వం ఆత్మే “ అంటారు. పరస్పర విరుద్ధమైన ఈ రెండింటినీ సమన్వయ పరచలేని సిద్ధాంతం తన ఆదర్శాన్ని కోల్పోతుంది. ఈ రెండు మార్గాలూ ఒకదానికొకటి ఆక్రమించుకోడానికి ప్రయత్నించడం కంటే ‘సహజీవనానికి ‘ ప్రయత్నించడం మంచిదని, అదే రాజమార్గమని గోపీచంద్ భావించాడు.
గోపీచంద్ అనుభవంలో
మనం మామూలుగా భౌతిక వాదంగా పరిగణించే సిద్ధాంతంలోనూ కొంత మంచి వుంది. వాడుకలో ఆథ్యాత్మిక వాదంగా వ్యవహరించబడే సిద్ధాంతంలోనూ కొంత మంచి వుంది. ఈ మాట చాలామందికి నచ్చకపోయినా గోపీచంద్ అనుభవంలో ఇదే సత్యంగా గోచరించింది. ప్రస్తుతం ప్రచారంలో వున్న ఆథ్యాత్మిక,భౌతిక వాదాలు రెండూ తీవ్ర పోరాటం వల్ల కలిగిన అలసటతో సొమ్మసిల్లి కూర్చున్నాయి. జయం ఏ ఒక్కదాన్నీ వరించలేదు.” అందువల్ల యే సిద్ధాంతానికైనా ఈ రెండు వాదాలే ఆధారాలవుతున్నాయని గోపీచంద్ తేల్చిచెప్పాడు. అరవిందుడు కూడా పాత సిద్ధాంతాల్ని నిర్మూలించ లేదు. అన్ని పాత సిద్ధాంతాల అవసరాలనూ నిర్వచించి, వాటిని సమన్వయ పరిచి , ఆ సమన్వయంద్వారా ఒక పూర్ణ సిద్ధాంతాన్ని సృష్టించాడు. నూతన. దృక్పథాన్ని కలిగించాడు. ఆథ్యాత్మిక వాదాన్ని, భౌతిక వాదానికి విరుద్ధ సిద్ధాంతంగా భావించకుండా ఈ రెండిటి సమన్వయంతో మాత్రమే మానవుడు ముందుకెళ్ళగలడని, అదే ఆచరణీయమైన అసలైన మార్గమని గోపీచంద్ నిర్థారించాడు. తాను కనుగొన్న సమన్వయ సిద్ధాంతాన్ని ఉత్తరాల రూపంలో మన ముందుంచాడు గోపీచంద్.
దాచుకోవలసిన ఉత్తరాలివి..
తెలుగులో ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తలను రేఖామాత్రంగా పరిచయం చేసిన మొట్టమొదటి తెలుగు రచయిత గోపీచంద్. ఎందరో ప్రాచ్య, పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తలను, భావవాదులను, భౌతిక వాదులను అథ్యయనం చేసిన గోపీచంద్. ఈ రెండు వాదనల్లోనూ నేటి ప్రపంచానికవసరమైన అనుసరణీయమైన అంశాలు, కొన్ని సవరించుకోవలసిన అంశాలున్నాయని, వీటిని సమన్వయ పరచడం నేటి చింతనాపరుల కర్తవ్యమని “ తన ఆలోచనలతోవపాఠకులపై చెరగని ముద్ర వేశాడు గోపీచంద్. పోస్టు చెయ్య లేకపోయినా పది కాలాల పాటు పదిలంగా దాచుకోవలసిన ఉత్తరాలివి ! (Varthanthi of Gopichand)
ఎ.రజాహుస్సేన్, రచయిత
చిత్రం: మొహమ్మద్ గౌస్, హైదరాబాద్