This is the story of our village
ఇదీ మన పల్లె కథ
పల్లె కదా…
ఇదీ..మన పల్లె కథ
బతుకు భారమై, చిద్రమై
ఒంటరై, శాపమై
గుండె పగిలే ముందు
పెట్టే గోస కదా…
ఆకలి కేకలు పెట్టినా
వినేవాళ్ళు ఎవ్వరూ లేరు
పొగిలి పొగిలి ఏడ్చినా
నీ కంటనీరెవ్వరూ తుడవరు..
నీ విలాపం, నీ విషాదం
నీ పక్కటెముకల మూల్గులు
మాకు శ్రావ్యమైన సంగీతం
సంకురాత్రి సంబరాలు
అంబరాన్నంటాయి చూడలేదా..
కోళ్లకు కట్టిన కత్తులు
ఓట్ల కోసం ఎత్తులు, జిత్తులు…
తలసిరి ఆదాయాలు, స్థూల ఉత్పత్తులు
రివ్వున దూసుకెళుతున్న జీవన ప్రమాణాలు
ఈ బాష అర్ధం కావటం లేదా
అన్నం మెతుకు లేక అల్లాడుతున్నావా..
అయితే, అక్కడే పడి చావు…
అసలు నువ్వెప్పుడో
ఎక్కడికో వలసెళ్ళావ్…
నీ భౌతిక దేహంతో మాకేం పని..
అగ్గిపుల్ల అప్పిచ్చే వాడు
కూడా దొరకటం లేదా..
రానున్నది ఎండాకాలమే
భగభగ మండే భానుడే
నిన్ను నిలువునా దహించేస్తాడు..
అప్పటిదాకా అక్కడే
ఆ సమీప శ్మశానంలోనే
నిర్జీవంగా పడి ఉండు..
(ఈ దేశంలో కొన్ని వేల గ్రామాలు ఇలాగే ఉన్నాయ్.. వాటిలో ఎక్కువ దళితులు నివసించే గ్రామాలే. మరి, కోటానుకోట్ల రూపాయల నిధులు ఎటు పోతున్నాయ్…?)