There are endless stories అంతులేని కథలెన్నో…

There are endless stories
అంతులేని కథలెన్నో…

బాధాతప్త హృదయపు గవాక్షం తెరిచి చూస్తే
ఇంకిపోయిన కన్నీరు
అంతులేని కథలెన్ని చెప్పునో

వెన్నంటి ఉండే నీడకూడా
వెన్నుపోటుకు కత్తులు నూరుతోంది
ఎప్పుడూ చూసే చీకటైనా
నేడెందుకో భయపెడుతోంది
వాకిట నడిచే విషపు నవ్వులు
కోరలు చాచి ఆవురావురుమంటున్నాయి

చూరునుంచి జారే వానచినుకు
చిరు నవ్వులతో నేలరాలుటకు
ఎన్ని చమటచుక్కలు దారపోసిందో,
అడుగు అడుగులో నెత్తుటి మరకలు

దూరపు కొండల్లోని నునుపును చూస్తూ మురిసిపోతున్నావు
నీలోని కోరికలు నిన్నెక్కడికో లాక్కెల్తాయి
గాజు పరదాలను తాకుతూ నువ్వు
పగిలిన ప్రతిబింబాలను ముద్దాడుతూ తను

నువ్వెల్లేది
నిశ్ఛల స్వర్గం కాదది
నిభిడాంధకారాన్ని అలుముకున్న మెఱుపు స్వప్నం

మెత్తని కత్తులతో అవతల ఒక వేటగాడు
వెలుతురును మింగేసే చీకటిలా,
మృత్యువాసన సమాయత్తమౌతోంది
శబ్ధాన్ని కప్పేస్తూ నిశ్శబ్ధం హంతకిగా మారింది

జీరబోయిన గొంతుతో కన్నీరు
బోరు బోరున ఏడుస్తోంది
జ్ఞాపకాల శిథిలాలను పేర్చుకుంటూ..

మచ్చరాజమౌళి
దుబ్బాక
9059637442

There are endless stories / maccha rajamouli/ zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment