The story of our mother
మా అమ్మ తాళిబొట్టు కథ
మా ఇళ్లలో తాళి ఆచారం లేదు. పెళ్లిలో నూటొక్క పోగుతో చేసిన తాడును మెడలో కడతారు. పెళ్లవగానే తీసేస్తారు. మా అమ్మ పల్లెనుండి టౌనుకొచ్చింది. కొత్త కాపురం.. ఇరుగు పొరుగు అంతా కొత్త. మా నాన్న చిన్నప్పుడే వాళ్ళమ్మ, నాన్న చనిపోయారు కాబట్టి మా అమ్మకు అత్తమామలు లేరు.
అమ్మ మెడలో తాళి లేదు
రకంగా మంచీ చెడ్డా చెప్పేవాళ్ళూ లేరు, అరిచి గోలపెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో అమ్మ, నాన్న ఇద్దరే ఉండేవాళ్ళు. అమ్మ మెడలో తాళి లేదు. అది ఆ వీధిలో చర్చనీయాశం అయింది. ఇరుగూ పొరుగూ అడగడం మొదలు పెట్టారు, నీకు తాళి ఎందుకు లేదు అని. మా సంప్రదాయంలో తాళి లేదు, పెళ్లిలో నూటొక్క పోగు కట్టి తీసేస్తారు అని అమ్మ చెప్తే ఆశ్చర్యపోయారట, అదేమిటీ.. హిందువుల్లో ఇలా కూడా ఉంటారా అని. అంతటితో అయిపోలేదు.
నువ్వు ఆయన భార్యవేనా..?
మెల్లగా.. నీకు తాళి లేదు, నువ్వు ఆయన భార్యవేనా, ఇంకేమైనానా అని అడగడం మొదలు పెట్టారట. వాళ్లేదో ఈమెను తేడాగా చూస్తున్నారని అనిపించేదట. మా అమ్మ ఇక ఆ హింస భరించలేక నాన్నకు చెప్పి బంగారంగడికి పోయి తాళిబొట్టు బిళ్ళ కొనుక్కుని తన గొలుసుకు సెట్ చేయించుకుంది. మామూలుగా తాళి అనబడే గొలుసుకు రెండు గుండ్రటి బిళ్ళలుంటాయి కదా, మా అమ్మ వేసుకునే గొలుసుకు ఒకటే బిళ్ళ ఉండేది. నీకు ఒకటే ఎందుకుంది అని ఆడిగితే ఈ స్టోరీ చెప్పింది. The story of our mother
అమ్మ చెప్పిన కథ..
రెండు బిళ్ళల్లో ఒకటి పుట్టింటి నుండి, ఒకటి మెట్టినిండి నుండి వస్తాయట కదా, ఆ గోడవేదో నాకు సరిగ్గా తెలీదు. మా అమ్మ మాత్రం తనకు పుట్టింటివాళ్ళు మెట్టింటివాళ్ళు పెట్టలేదు కదా, తనకు తానే తెచ్చుకుంది కదా, అందుకని ఒకటే బిళ్ళ అని చెప్పింది. ఓహో.. ఇంత కథ ఉందా అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో గాని లక్ష్మీదేవి బొమ్మ ఉండే ఇంకో బిళ్ళను కూడా తన గొలుసుకు ఎక్కించుకుంది. రోజూ రాత్రి అది గుచ్చుకోకుండా శుబ్బరంగా దాన్ని తీసి పక్కన పెట్టి పడుకుంటుంది.
నాకు చిన్నప్పుడే అర్థమైంది
నాకు మాత్రం చిన్నప్పుడే ఒకటి ఫిక్స్ అయింది. సంప్రదాయాలు, ఆచారాలు అంటే ఇంట్లో మూసిలోళ్లు, ఇరుగు పొరుగు వాళ్ళు పెట్టే టార్చర్ తప్ప మరోటి కాదని. అలాంటి అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయ్ మరి నాక్కూడా. కానీ పరాయి మతం వాళ్ళు, అదీ పెద్ద మందబలంతో ఉన్నవాళ్లు ఆ మందకు భిన్నంగా ఉన్నవారిని చుట్టుముట్టి హింసించే అనుభవం నాకు లేదు. అది ఎంత భయానకంగా ఉంటుందో బాధితులకే తెలుస్తుంది. ఆచారాల్లోని హేతుబద్ధత గురించి ఎంతైనా మాట్లాడవచ్చు గాని ఒక మైనారిటీ సమూహం మతం కారణంగానే తోడేళ్ళ మందలో చిక్కుకున్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వాళ్లకు అండగా నిలబడాల్సిందే. The story of our mother