The sari is a feminine shade చీర ఒక స్త్రీత్వపు ఛాయ

The sari is a feminine shade

చీర ఒక స్త్రీత్వపు ఛాయ

ఆది దేవి అమ్మవారి నుంచి అతి సామాన్య అప్పలమ్మ వరకు అందరికీ ప్రతీక. ఆరేడు గజాల వస్త్రాన్ని అందంగా, సృజనాత్మకంగా ఒంటికి చుట్టి చీరగా మలచిన తీరు ఒక మహా అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా శతాబ్దాలుగా వన్నె తగ్గని ఫ్యాషన్ చీర కాక మరోటి లేదు. నేత చీర, నూలుచీర, పవర్లూమ్, హండ్లూమ్ ఏదైనా సరే ఇప్పుడు చీర అంటే ఒక ఆర్ట్ పీస్. చేతితో embroidery చేసినా, మగ్గం ఉపయోగించి చేసిన పని కావచ్చు, మిషన్ మీద చేసిన మిషన్ వర్క్ కావచ్చు చక్కని క్రాఫ్ట్ చీర.

చీరంటే స్త్రీల మనోభావాల ప్రతిబింబం

దారాలు నేసి చేసే వస్త్రం కాదు చీరంటే… చీరంటే స్త్రీల మనోభావాల ప్రతిబింబం. అందుకే రకరకాల ప్రింట్స్ లో ఆకర్షిస్తాయి. కళాకారుడి కాన్వాస్ కి ఎంత మాత్రమూ తీసిపోని చిత్రం. దారాలతో ముడులు వేసి టై అండ్ డై చేసినా, బ్లాక్స్ ఉపయోగించి బ్లాక్ ప్రింట్ చేసిన, కుంచెలు వాడి కలంకారీ బొమ్మలు చిత్రించినా, technology వాడి digital print చేసినా సరే కళకు నిలువెత్తు రూపం. అందుకే అంటాడు కవి. సరికొత్త చీర ఊహించాను.

చీర మీద మమకారం చంపుకోలేరు

సరదాల సరిగంచు నేయించినాను అని స్త్రీ కట్టుకున్న చీర, పాదాలు తాకే కుచ్చిళ్ళు ఆమె నడకలో భాగమై హొయలు పోతాయి. ఒంటిపై జారే చీర చెంగు ఎన్ని హృదయాలలో గిగింతలు రేపుతుంది? ఎన్ని మనసులు కొల్లగొడుతుంది? ఎన్ని మోడ్రన్ సొబగులు ఊరిస్తున్న చీర మీద మమకారం చంపుకోలేరు భారతీయులు. ఎవరి డ్రీమ్ గర్ల్ అయినా సరే చీరలోనే కనిపిస్తుంది. ఇది ఎన్నో కలల కలనేత వన్నెల రాశికి సిరి జోత.

చీర హుందాతనం
చీర శృంగారం
చీర కళ
చీర కల
చీర ప్రేమ
చీర లాలన
చీరంటే ఒక డ్రెస్ కాదు… చీరంటే ఒక ఉద్వేగం… మనసును తాకే ఉల్లాసం. అమ్మ పవిట కొంగు పోయిన తరానికి ఒక కల్పవృక్షం. కొంగున ముడేసిన చిల్లర నుంచి, మనసు కలత బారి కళ్ళు చెమ్మగిల్లితే కన్నీరు తుడిచే ఆత్మీయ స్పర్శ వరకు
ఎన్నని చెప్పగలం? ఏమని వర్ణించ గలం? ప్రపంచ స్త్రీలకు భారతీయ సంస్కృతి అందించిన గొప్ప కానుక చీర.

డిసెంబర్ 21 ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా చీర కట్టే ప్రతి స్త్రీకి, చీరలో తన స్త్రీ నీ ఆరాధించే ప్రతి పురుషుడికి శుభాకాంక్షలు.

Happy world saree day

– భవాని, సీనియర్ జర్నలిస్ట్

The sari is a feminine shade / Happy world saree day / zindhagi.com / yatakarla mallesh
Comments (1)
Add Comment
  • రచన

    సూపర్ గా రాసినవే