కేసీఆర్ దొర గారు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి: విజయశాంతి

  • తెలంగాణలో కామాంధులు రెచ్చిపోతున్నారు
  • ఎన్ కౌంటర్ జరిగినా.. పోలీసులంటే భయం లేకుండా ఉంది
  • మహిళలు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారు

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయని… ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. వరుస ట్వీట్లతో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తనను కలచి వేసిందని ఆమె అన్నారు.

మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెపుతున్న మాటలు… నీటి మీద రాతలే అనే విషయం తేలిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నో పోరాటాల తర్వాత సాధించిన మన తెలంగాణలో ఆడబిడ్డలపై ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతుండటం కలచి వేస్తోందని ఆమె అన్నారు. ఏడాది క్రితం జరిగిన దిశ ఘటనను మరువక ముందే… అలాంటి మరో ఘటన జరగడం దారుణమని  చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని అత్యున్నత అధికార యంత్రాంగం కొలువుండే కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన జరగడం ఆందోళనకరమని చెప్పారు.

మహిళల రక్షణ కోసం ఏమైనా చేస్తామని చెప్పే ప్రభుత్వ ప్రకటనలన్నీ బూటకమే అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతోందని విజయశాంతి అన్నారు. దిశ ఘటనలో పోలీసుల తూటాలకు దుండగులు హతమైనప్పటికీ… పోలీసులంటే భయం లేని రీతిలో కొందరు రెచ్చిపోతున్నారని ఆమె చెప్పారు. కామాంధులు ఈ రీతిలో రెచ్చిపోతున్నారంటే… తెలంగాణలోని చట్టాల అమలు ప్రభావం ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. మహిళలు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారనే విషయాన్ని కేసీఆర్ దొర గారు ఇప్పటికైనా గ్రహించాలని అన్నారు.

Comments (0)
Add Comment