=====================
సామాన్యుడు జరిగిపోయిండు
=====================
అవును, ఒక సామాన్యుడు జరిగిపోయిండు. బాపు ”గడ్డం రామస్వామి” సామాన్యుడే…
బాపు కట్టం జేసుకొని బతికేటోడు. నలుగుర్ని మోసం జేసుడు తెలువనోడు. నాలుగు రాళ్ళు ఎన్కేసుకునే లౌక్యం తెలువనోడు. రేపటి గురించి ఆలోచించడం తెలువని పాతకాలం మనిషి నా బాపు. ఈ పూటకుంటే సాలనుకునే సామాన్య మానవుడు. ఈ స్థితికి చేరడానికి కొందరు తపస్సులు, సాధనలు చేస్తరట! కనీ ఆ తపస్సులు, సాధనలు తెలువని సాధారణ బతుకీడ్చిన సామాన్యుడు బాపు.
ఏనాడూ ప్లాట్లు కొనాలనో, బిల్డింగులు కట్టుకోవాలనో ఆశపడ్డోడు గాదు. తన బతుకు ఎట్లుంటే గదే బతుకనుకున్నడు. రాత్రంతా వానవరుపులకు రేకులు కూలిపోతుంటే మమ్మల్ని తల్లి కోడి లెక్క కాపాడుకున్నడు. తాను నెట్టుకొచ్చిన కట్టానికి, సుఖానికి తేడా తెలువని సామాన్యుడు బాపు.
అట్ల బతుకుడు తప్పో, ఒప్పో బాపుకు తెలువది. బాపు బుద్ధి బాపుది. రాజకీయాలల్ల బోయి పెద్దిర్కం జేసుడు బాపుకు రాదు. మనిషి, మనిషి మీద పెత్తనం జేయవచ్చుననే మాయామర్మం తెలువనోడు బాపు. ఇంటి ముందల బండ మీద కూసున్నా, బంగారు సింహాసనం మీద కూసున్నా తేడా తెలువని ‘అమాయకుడు’. అందుకనే బాపు సామాన్యుడు.
“మంచిగ బతుకాలె కొడుకా”, నలుగురికి మంచి జేయాలె, నలుగురికి సాయం జేయాలె” అని జెప్పిండు తప్ప మంచిగ సంపాయించుకోవాలని ఏనాడూ జెప్పలే. నారాయణలనో, చైతన్యలనో సదివిపిచ్చి డాక్టర్నో, ఇంజినీర్నో చేద్దామని కలలు గనని సామాన్యుడు బాపు. అజ్జిరం నా ఫీజుల కోసం ఇంటి కప్పు కోసం తెచ్చిన రేకులను అమ్మబెట్టినా మారు మాట్లాడనోడు. దేన్నీ కోరుకోవడం కానీ, దేన్నీ కాదనడం రాని సామాన్యుడు బాపు.
సమస్త జీవరాసుల లెక్కనే మనిషి బతుకుతడు, పోతడనుకున్నడే తప్ప, తన ముద్రలేవో వేసుకోవాలని తెలువనోడు, ఎచ్చులు లేనోడు. శాలువలు కప్పించుకోవడం, పూలదండలు ఏయించుకోవడం తెలువని వట్టి సామాన్యుడు బాపు.
నలుగురికి హితబోధలు చేయడం రాదు, ప్రవచనాల పత్తాకు ఏనాడూ పోలేదు. మంచో, చెడో… తన మనసు చెప్పినట్టు నడిశిండు. కలో, గంజో ఉన్నది తిన్నడు. చీమలకు కూడా హాని చెయ్యకుండ బతికినోడు బాపు.
నాయకులు, మేధావులు… నలుగురికి నాలుగు మాటలు చెప్పే కవులు, రచయితలు… శానా పెద్ద మనుషులున్న దేశంల ఒక సామాన్యుడు జరిగిపోయిండు.
మతం, సంస్కృతి.. వారసత్వం.. ఇసొంటి గొప్ప మాటలు ఆయనకు అసల్కే తెలువవు. కని వేల ఏండ్ల కెల్లి తరతరాల సామాన్యులు బతుకుతూ వస్తున్న సామాన్య జీవనానికి, మనం నిర్మించుకున్న తాత్విక ధారకు వారసుడు బాపు. అచ్చమైన, స్వఛ్చమైన సామాన్యుడు బాపు. మనిషి జీవనం, గొప్పతనం మనం కోరుకున్న వాటిలో లేదని తెలిసో తెలువకనో… తను కోరుకున్నట్టు బతికన సామాన్యుడు బాపు.
సామాన్యుడు, బాపు గడ్డం రామస్వామి, మానకొండూరు జరిగిపోయిండని ఏ పేపర్ల రాదు. టీవీ హెడ్ లైన్స్ లల్ల జెప్పరు. ఆయన గురించి ఏ పుస్తకం రాదు. అందుకే బాపు సామాన్యుడు.
ఆయన జీవితం ఆదర్శప్రాయమని ఈ లోకం నమ్మదు. ఇటువంటి జీవితాన్ని ఈ కాలం మనుషులు కోరుకోరు. వాళ్ళ గొప్పతనపు పట్రీలతోని కొలువలేని సామాన్య జీవితమతనిది. ఏది గొప్పతనమో, ఎట్ల బతుకుతే గొప్పనో తెలుసుకొని బతికిన గొప్పోడు కాదు బాపు.
అందుకే బాపు సామాన్యుడు.
ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు.
కని, గడ్డం రామస్వామి ఈ దేశంల ఉన్న కోట్ల మంది సామాన్యులకు ప్రతీక.
దేశం అంటే ఈ సామాన్యులే.
భారతీయత అంటే బాపు బతికిన బతుకే.
అందుకే ఒక సామాన్యుడు జరిగిపోయిండని కన్నీళ్లతో రాస్తున్నా.
బాపు గడ్డం రామస్వామికి నివాళిగా….
గడ్డం సతీష్, జర్నలిస్ట్
99590 59041