లంకంత కొంప సిన్నవోయింది

‘లంకంత కొంప..’

అంటున్నడేంది? గతంల ‘అగ్గిపెట్టంత రెండు రూములు’

అని రాసే గదా? అని మీకు డౌట్‌ గొట్టొచ్చు. అవును… మాది ‘లంకంత కొంపే…’!

నేను మూడు, చెల్లె ఒక్కటో తర్గతి సదువుతున్న రోజులు..

గూనె పెంకలతోని ఓ సిన్న ‘సాయమాన్‌’. ‘సాయమాన్‌’ అంటే ఓ గ్యాపకం యాదికొచ్చింది. ఆ సాయమాన్‌కు తాళమంటె ఎట్లుంటదో తెల్వది.

బెడమే ఆ సాయమాన్‌కు మేడం. సాయమాన్‌ ముందు రేకులకు ఓ ఉట్టి, ఆ ఉట్టి మీద ఓ సద్దిగిన్నె మా కోసం పెట్టే బంజరికి వొయ్యేది అజ్జిరం. సద్ది సాయమాన్లనే వెట్టొచ్చు.. కనీ.. ఆ సాయమాన్‌ బెడం తీసుడు మాకో గండం.

మజ్జాన్నం బడి నుంచి ఇంటికి వచ్చిన నేను తలుపు కింది నుంచి పైకి లేవడ్తే బెడం లూజ్‌ అయ్యేది. అప్పుడు బెడం తీసేది చెల్లె. అట్లా ఓ సారి చెల్లె బెడం తీసుడు ఆల్ష్యమైతే నాకు వశపడక, తలుపు బరువు భరించలేక కిందికిడ్సివెట్టిన.

అంతే బెడంల ఇర్కి చెల్లె ఏలు కమ్లివోయింది. రౌతం నల్లగ గడ్డకట్టింది. అప్పట్నుంచి ‘మీకు బెడం తియ్యస్తలేద’ని ఉట్టిమీన్నే సద్ది వెట్టిపోతా అని జిజ్జు మీద గూసున్నది అజ్జిరం. చెప్పింది జేసిసూపెట్టుడు అజ్జిరానికి సిన్నప్పటి నుంచే అబ్బిందటా.

ఆ సాయమాన్లనే కొన్నొద్దులు మా బతుకులనిగ్గుకొచ్చినం. వానగొడ్తే మట్టిగోడలు నాని ఓ దిక్కు కమ్మగా వాస్తనొస్తుండె. ఇంకోదిక్కేమో ఆ వానకు గోడలేడ కూల్తయోనని భయపడ్తుంటిమి. మొగులురిమితే సాలు బాపు పక్కకు నేను, అమ్మ పక్కకు చెల్లె… గజగజా వణుక్కుంటూ వొయ్యి నుల్కమంచంల నత్కేటోళ్లం.

మా మంచాల కింద బూరు నిక్కవొడ్సుకొని వాడ కుక్కలో దిక్కు, బిక్కుబిక్కుమని సూస్కుంటా పిల్లులో దిక్కు నత్కేటియి. మా ముడ్లకు కుక్కల వీపులు తాకినాకొద్దీ అటీటు జరిగేటియి గని, కుయ్యిమనకుండా సప్పుడ్దేక ఉండేటియి. మేం గూడ వాటినేమనకవోతుం. ఓ సారి గిట్లనే వాన జోరు గొడ్తా ఉంటే కుక్కలు సాయమాన్లకు సొచ్చినయి.

సాయమాన్లకొస్తున్న కుక్కల్ని ‘హడి.. హడి..’ అని నేను ఎల్లగొట్టిన. అంతే… బాపు కోపానికచ్చిండు. ‘కుక్కల్ని అట్లా ఎల్లగొట్టద్దు బిడ్డా..’ మనకూ సలివెట్టినట్లే వాటిగ్గూడా సలివెడ్తది. అందుకే మనకాడికొచ్చి జాగుంటయి’ అని జెప్పవట్టిండు.

అప్పట్నుంచి ఎప్పుడు వానగొట్టినా కుక్కలు, పిల్లులు మా సాయమాన్లనే సొత్తుండె. ఓ సారి నాకు డౌటొచ్చి ‘ఔను బాపు… ఈ కుక్కలు, పిల్లులు.. మనదగ్గర్కే ఎందుకొస్తయే..?’ అనడిగితే ‘వాటికి పొక్కిలి అంటే ఇట్టంరా… నున్నగుంటే మనలెక్కనే వాటిగ్గూడ నచ్చయని జెప్పేది.

ఆ సాయమాన్‌ను జూసి ఇంటికొచ్చిన సూట్టాలు మొకం మీదనే తిట్టి మర్లిపోయిన సందర్భాలున్నయి. కనీ ఆ సాయమాన్‌ను మా నోట ఏనాడూ ఒక్క మాటన్లేదు. ‘సాయమాన్‌ అయితేంది, మర్రిమాను అయితేందిరా నీడనీచ్చేదేదైనా గొప్పదేరా’ అన్జెప్పేటోడు బాపు.

ఎన్కపక్కలకెళ్లి ఊర్సుడు వొయ్యి వాన ఇసురుడు షురూ అయింది. సాయమాన్‌ తరుగుతున్నా కొద్దీ ముందటికి రేకులు పెరుగుకుంటొచ్చినయి. ఆఖరికి సాయమాన్‌ సూద్దామన్నా కానరాకుంటైంది. గోడలు కూలి గుండ్రంగైతే… గూనెపెంకలు బొత్తల వడి నిండినయి. మొత్తానికి మా సాయమాన్‌ బతుకమ్మై గూసుంది.

ఆ బతుకమ్మను జూసుకుంటూ రేకులళ్ల బతికినం. ఆ రేకులళ్లనే మా బతుకులు వానకు నానినయి. ఎండకు ఎండినయి. మొత్తానికి ఆ రేకులళ్లనే మా బతుకులు తెల్లారినయి.
*
2003ల అనుకుంటా.. బతుకమ్మను నిమజ్జనం జేసి, పాత రేకులమ్ముకొని కొత్తింటికి ముగ్గువోసినం. కరెస్టు చెప్పాల్నంటే బంజారాహిల్స్‌ ఇండ్లల్ల ఉండే ఒక్కో బాత్రూం అంత సైజు ఉంటదా ముగ్గువోసిన ఇళ్లు.

కనీ దాన్ని పూర్తిజెయ్యడానికి మాకు ముత్తాతలు కనవడ్డరు. నలుగురం రెక్కలు ముక్కలు జేస్కొని కట్టవడితేగానీ ఆ ఇల్లు పూర్తి గాలే. 2003ల మొదలైన ఇల్లు 2011లనుకుంటా పూర్తయింది. ఇప్పుడైతే ముగ్గువోసిన డేటు కూడా తిరిగొస్తలేదు. అప్పుడే ఇండ్లళ్లకు వోతర్రు. ఆ గోడల్ని కరెస్టు నీళ్లన్న తాగనిస్తర్రో లేదో.. నీళ్లంటే గుర్తుకొచ్చింది..

మా ఇంటికి నీళ్లు వట్టడానికి మేం పడని కట్టం లేదు. బాపు సైకిల్‌ రొప్పుతా ఉంటే హ్యాండిల్‌కు రెండు బకీట్లు, దండేనికి రెండు బకీట్లు… సీటు మీదో బిందె, క్యారెల్‌కు రెండు బకీట్లు…

వట్టుకొని బాపు ముందువోతా ఉంటే నేను ఆయన ఎన్కవొయ్యేది. రోజు రెండు మూడు కిలోమీటర్లు మాకిదే సర్కస్‌ ఫీట్లు. పాట్లు పడేటోళ్లకు ఫీట్లో లెక్కనా? మాకూ గంతే…!

అంత కట్టవడి కట్టుకున్న ఈ ఇళ్లంటే బాపుకు మస్తిష్టం. సాయమాన్‌, రేకులు, వరుకులళ్ల తెల్లారిన మా బతుకులకు ఈ ఇళ్లే మాకు లంకంత కొంప. అందుకే ఈ ఇంటిని బాపు ఐనంగా జూసుకున్నడు.

ఒక్కనాడు గూడ ఈ ఇంటినిడ్సిపెట్టి ఉండలే. బాపు మాటే మాకు ధైర్నం. బాపంటే మాకు భరోసా. తాగో, తడిపో ఆ ఇంట్లనే ఉంటుండె గనీ, ఒగని జోలికి వోకపోతుండె బాపు. ఎవరన్నింటికస్తే ఉత్తగ మాత్రం ఎల్లగొట్టకవోతుండె. ముక్క లేకపోయినా సరే గని పెగ్గు మాత్రం తప్పక వోత్తుండె.

రామన్నింటికి వోతె ముక్క లేకున్నా సుక్క మాత్రం దొర్కుతదనే ఆశ మస్తు మందికి ఉంటుండె. నలుగుర్కి వెట్టిన జేతే గని నల్గుర్ని సాపిన జేతు కాదు బాపుది. భాజాప్తా నడింట్ల గూసుండి, అదే ఇంట్ల నలుగురి చెయ్యి కడ్గిపిచ్చిన చరిత్ర బాపుది. రాత్రి పది గానియ్యి, పన్నెండు గానియ్యి ఎటన్నవోతే సాలు పొద్దుగూకేసరికి ఇళ్లు జేరుతుండె బాపు.

ఆయనుంటే ఇల్లే కాదు, వాడ మొత్తానికి ధైర్నం. ఆయన సరాయిస్తే సాలు దొంగోడు సదురుకుంటుండె. అసొంటిది ఇరువై రోజులాయె బాపు ఇంటికి రాక. మొన్న నాత్రిళ్ల అజ్జిరానికి ఫోన్జేత్తే ‘బాపు ఇంకా రాకపాయెనేమురా’ అని మర్శిపోయి అడిగింది కండ్లళ్లకెళ్లి నీళ్లు వటవటా రాలినయి.

ఒంటరైన చిలుక కండ్లళ్ల మెరిసింది. బాపు లేక లంకంత కొంప సిన్నవోయింది. బాపు మళ్లా రాకపోతడా అనే జీవి మాత్రం నాకు ఇంక గుంజుతనే ఉన్నది. బాపు రాకపోతడా…? ‘నా కొడుకు రాజే…’ అని అజ్జిరవ్వకు జెప్పకపోతడా…?

– గడ్డం సతీష్‌, జర్నలిస్ట్

99590 59041

The bustling house is now empty / gaddam sathees / zindhagi.com
Comments (0)
Add Comment