రాయదుర్గం మండలం, బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన టిడిపి సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ , బాధితున్ని పరామర్శించిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బోమ్మకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్న ను శనివారం కిడ్నాప్ చేసిన సంఘటన దుమారం రేపింది. కర్ణాటక ప్రాంతమైన కూడ్లగి సమీపంలో ఉన్న ఇంటి దైవాన్ని దర్శిచుకునేందుకు రాయదుర్గం నుండి శనివారం మొలకల్మురుకు బస్సులో బయలుదేరి వెళ్ళాడు. మొలకల్మురులో ఆటో కోసం ఎదురుచూస్తుండగా అకస్మాత్తుగా తన ముందు ఒక కారు వచ్చి ఆగి ముఖానికి మాస్క్ లు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు తనను కార్ లోపలికి లాక్కున్నారని బాదితుడు తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితకబాదారని చెప్పారు. మత్తులో నుంచి మేల్కొన్నాక
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించారని వాపోయాడు. మద్యం తాగాలని బెదిరించడంతో కొంచెం తాగి కారులో వాంతి చేసుకున్నానని తెలిపారు. ఆ సమయంలో మల విసర్జన కోసం వెళ్లాలని బతిమలాడి కారునుండి బయటకు వచ్చి
కిడ్నాపర్ల వల నుంచి తప్పించుకుని ఆదివారం తెల్లవారుజామున బోమ్మకపల్లి గ్రామానికి చేరుకున్నానని సర్పంచ్ అభ్యర్థి భర్త ఈరన్న తెలిపారు. బాధితున్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మండల కన్వీనర్ హనుమంతు ఇతర నేతలతో కలసి ఆదివారం ఉదయం బొమ్మక్కపల్లికి వెళ్లి పరామర్శించారు. కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు లేని విషసంస్కతిని ప్రవేశపెట్టిందని విమర్శించారు. దౌర్జన్యాల ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని కిడ్నాపులు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజామద్దతు ఉందని చెప్పే అధికారపార్టీ కిడ్నాప్ లకు, బెదిరింపులకు ఎందుకు దిగుతోందని నిలదీశారు. ప్రజలు గమనించాలని కోరారు.