మా చేపల చెరువును మాకిప్పించండి
అదనపు కలెక్టర్ ను కోరిన నామాపూర్ ముదిరాజులు
జగిత్యాల, ఫిబ్రవరి 20 : నామాపూర్ చేరువులో చేపలు పెంచుకొని జీవిస్తున్నామని, మా గ్రామ సర్పంచ్ చేపలను పట్టించి అమ్ముకొన్నాడని, హైకోర్టులో కేసు గెలిచినా తీర్పును పాటించడం లేదని చర్యలు తీసుకోవాలని మత్సకార ముదిరాజులు కలెక్టరును కోరారు. సోమవారం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నామాపూర్ చేరువును మత్సశాఖ ద్వారా లీజ్ కు తీసుకొని చేపలను పెంచుకుంటూ 30 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి మమ్ములను చేపలను పెట్టుకోకుండా అడ్డుకొని బెదిరించాడన్నారు. గత ఏడాది మే నెలలో సర్పంచ్ కొందరు చేపలను పట్టే వారితో చేపలను పట్టించి 15 లక్షలకు అమ్ముకొన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అన్యాయంపై హైకోర్టులో కేసు వేయగా గత డిసెంబర్ 13 న మాకు అనుకూలంగా తీర్పువచ్చిందన్నారు. అలాగే సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవని, కోర్టు తీర్పు అమలు కావడం లేదని సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజులు అదనపు కలెక్టరును కోరారు. చెరువుపై తిరిగి మాకు ఉపాధిని కల్పించాలని మత్సకార ముదిరాజులు బొజ్జ శ్రీనివాస్, పులి నర్సయ్య, దండు రవి, నీలి శ్రీనివాస్, రవి, గంగాధర్, కొమురయ్యలు ఉన్నారు.