Survivors of the poor
పేదల ప్రాణాలు
సినతల్లి
గుడిసె తలాపుల మీద నెత్తిబెట్టి
చిన్నదానికి పెద్ద దానికి జడిసిపోయి
బిక్కుబిక్కుమంటూ పాణాన్ని పంటికింద బిగవట్టి
గుండె రాయిజేసుకొని
బతికే ఎందరో సినతల్లుల దేశమమ్మ.
చేయని నేరానికి
సేతులకు సంకెళ్లు వేసి
కంట్లో కారంబోసి ఎముకల్ని నుజ్జుజేసి
మూత్రం తాగించి
తలకిందులుగా వేలాడదీసి
పేదల ప్రాణాలు దీసిన అడిగేటోడు లేడమ్మ.
ఇక్కడ నోరున్నవాడిదే రాజ్యం తల్లి
పేరున్నవాడితే పెత్తనమమ్మ
ఇది డబ్బున్నోడి కాలికింద సమాధయ్యే
విచిత్ర దేశం తల్లి
ఇది బీదలు పుట్టే భూమి కాదు
పుడితే గిడితే
హక్కులకు స్వేచ్ఛ కు
ఆమడ దూరం బతుకుతూ సావాలి తల్లి.
మన ఊపిర్లకు ఉరి తాళ్లు అల్లినరు
చూపులను కత్తులతో పొడిసినరు
నడకలను నరికేసి
ఆలోచనలకు పగ్గాలేసి
మనిషిని నిర్భందించిన రాజ్యం తల్లి ఇది.
మన బత్కులు అంటరానివి
మన పేర్లు పలకలేనివి
మన చరిత్రలు చెరిపేసినవి
మనం రేపటి కోసం కంఠాలను కత్తులుగా నూరాలి తల్లి.
పోలీసులు, లాయర్లు, పత్రికలు
కోర్టులు, అధికార బలగమంత
బలిసినోడు ఎట్ల ఆడిస్తే అట్ల ఆటాడే ఆటబొమ్మలమ్మ.
ఓ సినతల్లి
నీ కొడుకుల్ని నీ భర్తలను గుంజలకు కట్టేసి
నిన్ను లంజలుగా చిత్రించిన
కండ్లారా చూసిన
కలం కదిలించలేని కవులున్న దేశం తల్లి ఇది.
ఈ దేశంలో రాజ్యాంగమనే రక్షణ కవచం
లేకపోయింటే
నీలాంటి సినతల్లుల జాడ జానెడంత కూడా
కనిపించ కపోయేది తల్లి