Success of farmers రైతుల విజయం

Success of farmers
రైతుల విజయం

ఈ విజయం మట్టిది. మట్టిని నమ్ముకున్న రైతన్నది.!!

ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఉద్యమానికి కేంద్రంలోని మోడీ సర్కారు తలవొంచింది. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్నాయని దేశవ్యాప్తంగా రైతులు గట్టిగా వ్యతిరేకించారు. నిరసన తెలిపారు. ఉద్యమిఃచారు. ఎముకలు కొరికే చలిలో, ఎండల్లో, వేసవి వడగాడ్పుల్లో సైతం ఆందోళన చేశారు. అయినా కేంద్రం దిగిరాకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. చిట్ట చివరకు చేసేది లేక కిందకు దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను శాశ్వతంగా వెనక్కు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ రెండు చేతులు జోడించి, రైతులకు క్షమాపణలు చెప్పి మరీ కేంద్ర నిర్ణయం ప్రకటించారు.

దేశచరిత్రలోనే ఇది తొలిసారి…!!

భారతదేశ చరిత్రలో కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలను ఇలా వెనక్కు తీసుకోవడం ఇదే ప్రథమం.అలాగే దేశం ప్రధాని చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రజలకు, క్షమాపణలు చెప్పడం కూడా ఇదే మొదటిసారి. ఆ రకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓ సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది. ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఎందరో రైతులు ఈ ఉద్యమంలో బలిదానాలు చేశారు. 60 మందికి మించి రైతులు మరణించారు. ఇటీవల ఓ కేంద్రమంత్రి కుమారుడు రైతులపైకి కారును నడిపి, రైతుల మృతికి కారణమయ్యాడు. గత రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రైతు సంఘాల పిలుపు మేరకు(26 జనవరి,2021)ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. Success of farmers

ఎముకలు కొరికే చలిలో ఆందోళన

ఢిల్లీ బహదూర్ గర్ -టిక్రి సరిహద్దులో ఉన్న రైతుసంఘాల ప్రతినిధులతో పాటు, ట్రాక్టర్ ర్యాలీ కి ఉత్తర భారత రైతాంగం, యువకులు,ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. రైతుల ప్రదర్శన.. ఆందోళనతో ఎముకలు కొరికే చలిలో కూడా ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. రైతులపై లాఠీ చార్జీ జరిగింది. ఎంతో మంది రైతులు గాయపడ్డారు. ఒకరిద్దరు మరణించారు.

ఎన్నికలే కారణమా?

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మోదీ ప్రభుత్వం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయం వెనుక,ఉత్తర ప్రదేశ్ లో రానున్న ఎన్నికలే కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రైతు వ్యతిరేకత వల్ల బిజెపి విజయావకాశాలకు దెబ్బతగిలే అవకాశం ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ సమాచారం. ఈమేరకు పార్టీ భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ప్రతిపక్షాల నైతిక విజయం…!!

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఓ రకంగా ప్రతిపక్షాలకు నైతిక విజయమనే చెప్పాలి. ఈ చట్టాలను పార్లమెంటు లో నాటకీయంగా ఆమోదించి నిన్నటి నుంచీ, కాంగ్రెస్ తో సహా కొన్ని ప్రధాన ప్రతి పక్షపార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.మమతా బెనర్జీ లాంటి వెతలు కేంద్రంపై తిరుగుబాటు కూడా ప్రకటించారు. ఇక ఆంధ్రా సిఎం కేంద్రానికి మద్దతు పలుకగా, తెలంగాణలో కెసియార్ తొలుత వ్యతిరేకించి, ఆ తర్వాత సైలెంట్ అయి పోయారు. తిరిగి నిన్ననే హైదరాబాద్ లో రైతు చట్టాలకు, రైతులు పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా భారీ ప్రదర్శన నిర్వహించారు..స్వయంగా కెసియార్ ఈ ధర్నాకు నాయకత్వం వహించడం విశేషం. కెసియార్ అదృష్టం కొద్దీ ఆ మర్నాడే కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడం యాదృఛ్ఛికమే అయినా… కెసియార్ కు రైతుల్లో ఎంతో కొంత మైలేజ్ ను తెచ్చి పెడుతుందనడంలో అనుమానం లేదు. Success of farmers

ఈ నేపథ్యంలో కొన్ని కవితలను చూద్దాం..!!

నాగటిశిలువతో
తన వీపు తానే
దున్నుకునే ఏసుక్రీస్తు
ఈ రైతు….!!

ఆర్కే!!

రైతు గురించి ఇంతకంటే మించిన నిర్వచనం ఏముంటుంది? నాగేటి శిలువతో…తన వీపుని తానే దున్నుకునే ఏసు క్రీస్తు ఈనాటి రైతు.‌ అంటున్నారు రాజ్ కుమార్ బుంగా..!!

“పొలం తడిసేది…
రైతు చెమటతో….,

పంట పండేది…
రైతు కంట నీటితో…,

ఆ చెమటకు…
ఆ కన్నీటికి….
విలువేది…?

రైతు….

కష్టాల శిలువ మోస్తున్న క్రీస్తు..!
(శేషేంద్రకు క్షమాపణలతో)

*ఎ.రజాహుస్సేన్..!!

రైతు ఎంత కష్ట పడ్డా చివరకు మిగిలేది శూన్యం. కష్టపడి పండించిన పంటను కూడా కొనే నాధుడు లేక రైతన్నా పడుతున్న వెతలు అన్నీఇన్నీ కావన్నది నా అభిప్రాయం.

చరిత్రకారులరా… సిద్ధం కండి!!

సరి కొత్త అధ్యాయం మొదలైంది
ప్రపంచానెక్కడా కనని వినని

“కిసాన్ రిపబ్లిక్ డే పరేడ్”

డొక్కలెండి బీడు బడ్డ
భూముల ఆకలి దీర్చ
కార్పొరేట్ కలుపుమొక్కల
కుత్తుకలు దెంచ
ట్రాక్టర్ నాగళ్ల
నినాదమై కదులుతున్నది

సింఘు నుండి సింఘు సరిహద్దుకు
అరవై మూడు కిలో మీటర్లు
టిక్రి నుండి టిక్రి సరిహద్దుకు
అరవై రెండు పాయింట్ ఐదు కిలో మీటర్లు
ఘాజిపూర్ నుండి ఘాజిపూర్ సరిహద్దుకు
అరవై ఎనిమిది కిలో మీటర్లు

చిల్లా,షాజహాన్ పూర్
సున్హెదా జుర్హెదా సరిహద్దులు

లక్షన్నర ట్రాక్టర్లు
ట్రాక్టర్ కి ఐదుగురు
చేతుల్లో రైతు జెండాలు
వీపుకు సద్దిమూట
ప్రశాంతమైన మనస్సుతో
అద్భుతమైన క్రమశిక్షణతో
ప్రపంచమా ఇటు చూడని
ఘర్జిస్తున్న నినాదాలు

రైతు దిగ్బంధంలో

ఢిల్లీ ప్రతీ గల్లీ
విశ్వం నలు మూలల
తాకిన స్ఫూర్తి

రైతు వ్యతిరేకులారా
జర జాగ్రత్త…
ఆ పరేడ్ నిశ్వాస కు
మీ శ్వాశ ఆగొచ్చు

ఇది ఆరంభమే..సుమా.!అంటున్నారు
కవిఅమృతరాజ్.!!

కాగా…”జైకిసాన్” అంటున్నారు..
కవి రౌతురవి..!!

పల్లవి: రైతన్నలారా
ఓ రగల్ జెండల్లారా
పోరు దండం పెడతాం
తోడునీడగ వుంటాం
గజ్జెకట్టి డప్పుకొట్టి
గళం విప్పుతాము
జైకిసాన్ అంటున్నం
జెండాలెత్తుతాము

చరణం: గల్లీ నుండి ఢిల్లీ దాకా
మీ పోరుకు సలాములే
మీ త్యాగం దేశమంతా
రగిలించేను జ్వాలలే

ఆ నల్లనీ చట్టాలు
లాఠీలు తూటాలు
రైతన్న! నీ కాలిగోటిని
కదిలించలేవులే

తెలంగాణా తేభాగా
పోరాటపు దారుల్లో
జలియన్ వాలాబాగు

మట్టికే వారసులు

కనివిప్పు కావాలి
భరతజాతికి నేడు
మతం ముసుగులోన
సాగుతున్న అక్రమాలు

కోట్లమంది శ్రమను దోచి
కొద్దిమంది గాదె నింపే
అంబానీ అదానీల
గులాములను తరిమికొట్ట

కన్యాకుమారీ మొదలు
కాశ్మీరం చివరివరకూ….

జైకిసాన్ అంటున్నరు
పోరు జేయమంటున్నరు..!!

రైతులు పట్ల సానుభూతి

కలవారంతా ఈ రైతు పోరుబాటకు మద్దతు ఇచ్చారు. ఫలితంగా రైతు పోరాటం విజయవంతమైంది. కేంద్రం కొమ్ములు వంచింది. మో షా.. లు మంకుపట్టు వీడేలా చేసింది. మట్టిని నమ్ముకున్న రైతన్నలకు ఆలస్యంగానైనా మంచి జరిగింది. నిజంగా ఇది సుదినం. అయితే.. ఈ ఉద్యమంలో నష్టపోయిన, అసువులు బాసిన రైతన్నలకు,వారి కుటుంబాలకు ఏమిస్తే రుణం తీరుతుంది..??
జై జవాన్…!! జై కిసాన్….!! Success of farmers

ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్

Success of farmers / zindhagi.com / yatakarla mallesh / prime minister modi / politics / raithu freedom / raithu udyamam / trs / congress /
Comments (0)
Add Comment