Stone Age Poetry
రాతి యుగం (కవిత్వం)
కొన్ని వందల కళ్ళు
గుచ్చి గుచ్చి నన్నే చూస్తున్నాయ్
కామం పొరలు కమ్మిన కళ్ళతో.
కోరికల సెగతో కాలిపోతున్న తనువుతో..
నా భర్త చనిపోయినప్పుడు
చూడరానివి అవే కళ్ళు…
ఆకలితో అలమటిస్తూ ఉంటే
పలకరించరానివి అవే కళ్ళు…
నిలువ నీడలేక ఏకాకినై మిగిలినప్పుడు
ఓదార్చలేనివి అవే కళ్ళు ..
అప్పు తీర్చలేక పసిబిడ్డను
దొరవారి ఇంట చాకిరికి పెట్టినప్పుడు
చోద్యం చూసినవి అవే కళ్ళు….
పస్తులతో అలమటిస్తున్నప్పుడు
కనికరం చూపనివి అవే కళ్ళు.
రోగమొచ్చి ఆసుపత్రి పాలైనపుడు
ఎట్టున్నవని పలకరించ రాని అవే కళ్ళు…
అట్లాంటి దయమాలిన కళ్ళు..
జాలిచూపలేని ఆ కళ్ళు…
అవకాశం కోసం గోతికాడ నక్కల్లా
చూస్తున్నవి అవే కళ్ళతో…
నేడు చుట్టుముట్టి చూస్తున్నాయి ఆబగా..
మగాడి చూపుల వేట మృగాల వేటలా…
చేయని నేరానికి దొంగని చేసి
వివస్త్రగా నడిబజారున నిలిపిన నన్ను చూడ..
ప్రతి మగాడి కళ్ళకు చూపొచ్చింది.
మానవత్వం మంటగలిపిన మనుషులకు నడకొచ్చింది
నా దేహంలో ప్రతిఅణువూ సిగ్గుతో
అవమానంతో కుదించుకుపోతుంది.
వందల కళ్ళు ఆకాంక్ష గా చూపులు సంధిస్తుంటే..
ఇన్నాళ్లూ ఎన్నికష్టాల నడుమైనా పదిలంగా కాపాడుకుంటూ వచ్చిన నాలోని
గుప్తమైనవన్నీ.శోధిస్తుంటే…
మనసు విలవిల్లాడుతూ రోధిస్తుంది.
అడదానిలో అమ్మని చూడలేని సమాజం
వివస్త్రగా నాముందు నిలబడి ఉంది..
ఆశగా అణువణువు శోధిస్తూ వేధిస్తూ..
మనం మనుషులం అనే వివేకం మరచిన కళ్ళతో.
రాము కోలా
దెందుకూరు.9849001201.