మీడియా ప్రతినిధులపై దాడి దుర్మార్గం
– దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలి
– జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి
– ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్
అమరావతి, మే 19: విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన పాశవిక దాడిని తీవ్రంగా దుర్మార్గమైన చర్య అని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) , ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APUWJ) ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నాయకులు పేర్కొన్నారు. మేరకు IJU స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి డీ. సోమసుందర్, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఐవీ. సుబ్బారావు, చందు జనార్ధన్, APEMJA రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శివ యేచూరి, మురళీ మోహన్ లు ఒక ప్రకటనలో ఖండించారు.
ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా నడి రోడ్డుపై, ప్రజల సాక్షిగా జర్నలిస్టులపై హత్యాయత్నం చేసే అధికారాన్ని అవినాష్ రెడ్డి అనుచరులకు ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు. సమాచార సేకరణకు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధి శశి, హెచ్ఎంటివి ప్రతినిధి రత్నకుమార్ లపై రక్తం చిందే విధంగా అతని అనుచరులు భౌతిక దాడికి దిగడంతో పాటు ఏబీఎన్ వాహన అద్దాలను, హెచ్ఎంటివి కెమెరాలను ధ్వంసం చేయడం సహించారనిదన్నారు.
అవినాష్ రెడ్డి కనుసైగల మేరకే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. గౌరవప్రదమైన పార్లమెంటేరియన్ పదవిలో ఉన్న అవినాష్ రెడ్డి ఇలాంటి అప్రజాస్వామిక దాడులు చేయించి ఆ పదవికి మచ్చతెచ్చారని వారు ధ్వజమెత్తారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన దుండగులపై, దీనికి కారకుడైన వై.ఎస్.అవినాష్ రెడ్డిపైన, ఆయన అనుచరుల పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల పై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయని, జర్నలిస్టులకు రక్షణ కరువవుతోంది అని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు కటిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.