She did not work with her mind
ఆమె తనువో అవసరాల అంగడి
ఆమె నవ్వులు పరిమళాలు పూయవు
ఆమె ఆనందాలు ఇంధ్ర ధనుస్సై మెఱియవు
ఆమె ఆలోచనలు శూన్యానికి అతీతము
ఆమె నిర్ణయాలు చచ్చిపడివున్న శవాలతో సమానము
ఆమె నివాసము
క్షణ క్షణం ఒత్తిడికి గురిచేసే కత్తుల కుటీరము
మొత్తంగా ఆమె జీవితం
విధి పేర్చిన కాష్ఠంలో కాలుతున్న పూలవనం
ఆమె మనసుతో పనిలేదు
ఆమె మాటతో పనిలేదు
ఆమె పెదవంచును తాకిన రక్తపు మరకలతో పనిలేదు
ఆమె అవసరం వెనుక దాగిన కథలక్కరలేదు
ఆమె అస్థిపంజరమై కుస్తీ పడుతున్నా
ఆడదైతే చాలంటూ
మైలపడిన మనసునెంటేసుకుని మగ మృగాలవుతున్నారు
ఆమె మోయలేని గాయాలను మోస్తుందిప్పుడు
ఆమె గుండె తలుపుకు అన్నీ చిల్లులే
వెచ్చదనం కోసం పచ్చనోటు పడవేసే కామాంధులకు
ఆమె తనువో అవసరాల అంగడి
బ్రతుకు పుస్తకంలో ఆమె
తిని పారేసిన విస్తరాకు
ఇప్పుడామె,
మనసు చచ్చి , మనిషి చచ్చి
చితిమంటల నీడల్లో బ్రతుకుతున్న శవం..