Pollen River Poetry పుప్పొడి నది (కవిత్వం)
పుప్పొడి నది….!!
వసంతం వస్తే చాలు
పుప్పొడి నదుల ప్రవాహమే
పూలతోటలన్నీ…..
సాయంత్రమయ్యే సరికి
జడనిండా పూలు తురుముకొని
తుమ్మెదల కోసం ఎదురు చూస్తుంటాయి
ఏ పువ్వును మోహించాలో తెలీక
తల పట్టుకున్న తుమ్మెదలు
గాల్లో చక్కెర్లు కొడుతుంటాయి
తోటలోని పూలు నవ్వుతూ
తుమ్మెదలకు కన్నుకొడుతుంటాయి
రా రమ్మని తొందర పెడుతుంటాయి
తోటలో సీతాకోకలు …..
వయ్యారంలో
పూలకు సవాలు విసురుతుంటాయి
సీతాకోకల అందం చూసి
కొన్ని పూలు సిగ్గుతో
తలదించుకుంటాయి
మరికొన్ని లోలోనే కుళ్ళుకుంటాయి
తూనీగల దండొకటి….
తోటపై చక్కర్లు కొడుతుంటాయి
తుమ్మెదల మోహంలో
తూనీగలను పట్టించుకోవడంలేదు పూలు
తోటలో పుప్పొడి పాయలు
నదిగా మారి తోటను పూర్తిగా తడిపేశాయి
ఇప్పుడు తోటంతా రంగుల మయం
ఎక్కడో మారుమూల…
బిక్కు బిక్కు మంటూ
ఓ కోయిల
గొంతు సవరించుకుంటోంది
కోయిలను చూసి…..
తుమ్మెదలు ,తూనీగలు
పక్కవాయిద్యాలతో సిధ్ధం
కోయిల పాట మొదలైంది
తోట తోటంతా ….
పారవశ్యంలో మునిగి పోయింది
పూలన్నీ తలలూపుతూ…
కోకిల పాటకు శృతి కలుపుతున్నాయి
వాసంత సమీరం వచ్చి
మెల్లగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది
ఇప్పుడు తోట….
ఓ పుప్పొడి నది
ఓ మోహ ధూపం
ఓ గాన శాల
ఓ ప్రేమ పాఠశాల
ఓ మధు సంతకం
ఓ మధుర స్మృతి !!
ఎ.రజాహుస్సేన్, కవి